తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు | High Court harsh comments on police | Sakshi
Sakshi News home page

తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు

Jul 30 2025 5:12 AM | Updated on Jul 30 2025 5:12 AM

High Court harsh comments on police

రాజీ చేసుకోవాలని పోలీసులు ఎలా ఒత్తిడి చేస్తారో.. ఎలా బెదిరిస్తారో కూడా తెలుసు 

మాకు ఏమీ తెలియదని అనుకోవద్దు 

అలా అనుకునేందుకు మేమేం ఈఫిల్‌ టవర్‌ మీద కూర్చోలేదు 

ఎప్పుడో ఫిర్యాదులు చేస్తే ఇప్పుడు కేసులు పెడుతున్నారు 

ఇలాంటివి రోజూ చూస్తూనే ఉన్నాం.. తీరు మార్చుకోవాలి 

పోలీసులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సిన అవసరం ఉంది 

సివిల్‌ వివాదంలో జోక్యం చేసుకుంటే సహించేది లేదు 

హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు 

పిడుగురాళ్ల ఎస్‌హెచ్‌వోపై మండిపాటు 

కోర్టు ఎదుట హాజరైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త పఠాన్‌ కరీంసా 

ఎస్‌హెచ్‌వో జోక్యం చేసుకుంటే మళ్లీ కోర్టుకు రావొచ్చన్న ధర్మాసనం 

కరీంసా భార్య దాఖలు చేసిన పిటిషన్‌ మూసివేత  

సాక్షి, అమరావతి: ‘‘తప్పుడు కేసులతో పోలీసులు ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు. రాజీ చేసుకోవాలని ఎలా ఒత్తిడి చేస్తారో, బెదిరిస్తారో కూడా తెలుసు. మాకు ఏమీ తెలియదని అనుకోవద్దు. అలా అనుకోవడానికి మేమేమీ ఈఫిల్‌ టవర్‌ మీద కూర్చొనిలేము’’ అంటూ పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడో ఫిర్యాదులు చేస్తే ఇప్పుడు కేసులు పెడుతున్నారని వారి తీరును ఆక్షేపించింది. దీనిని రోజూ చూస్తూ నే ఉన్నామని, పోలీసులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందని, వారి తీరు మార్చుకోవాలని స్పష్టం చేసింది. పిటిషనర్‌ పఠాన్‌ కరీంసా విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోవద్దని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో)ను ఆదేశించింది. 

ఒకవేళ జోక్యం చేసుకున్నట్లు తమ దృష్టికి వస్తే తీవ్రంగా పరిగణిస్తామని ఎస్‌హెచ్‌వోను హెచ్చరించింది. పిడుగురాళ్ల పోలీసుల అక్రమ నిర్భంధంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త పఠాన్‌ కరీంసా కోర్టు ఎదుట హాజరయ్యారు. దీనిని నమోదు చేసిన హైకోర్టు... తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కరీంసా భార్య పఠాన్‌ సైదాబీ దాఖలు చేసిన పిటిషన్‌ను మూసివేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, జస్టిస్‌ జగడం సుమతిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎస్‌హెచ్‌వో దురుసుగా వ్యవహరిస్తున్నారు...
కరీంసాను పిడుగురాళ్ల పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని సైదాబీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం.. పఠాన్‌ కరీంసాను స్థానిక కోర్టులో హాజరుపరిచి వాంగ్మూలం నమోదు చేయించాలని పోలీసులను ఆదేశించింది. కరీంసాను తమ ముందు హాజరుపరచాలని సూచించింది. మంగళవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా.. కరీంసాను కోర్టులో హజరుప­రిచారు. 

‘‘పోలీసులు ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు? ఎప్పుడు వదిలేశారు?’’ తదితర వివరా­లను ధర్మాసనం పఠాన్‌ కరీంసాను అడిగి తెలుసుకుంది. వ్యాజ్యాన్ని మూసేస్తా­మని ప్రతి­పాదించింది. కరీంసా తరఫు న్యాయవా­ది సూరపరెడ్డి గౌతమి జోక్యం చేసుకుంటూ, పిటిషనర్‌కు సంబంధించిన సివిల్‌ వివాదంలో పిడుగురాళ్ల ఎస్‌హెచ్‌వో జోక్యం చేసుకుంటున్నారని వివరించారు. కరీంసా సైతం కల్పి­ంచుకుని వేరే వ్యక్తులపై తాము ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని ఎస్‌హెచ్‌వో తీవ్రంగా ఒత్తిడి తెస్తూ బెదిరిస్తున్నారని, దురుసుగా వ్యవహరిస్తున్నారని వివరించా­రు.

మీకు కౌన్సెలింగ్‌ చేయించాల్సి ఉంటుంది...
కోర్టు హాలులోనే ఉన్న ఎస్‌హెచ్‌వోను ధర్మాసనం పిలిపించి.. పిటిషనర్‌ చెప్పింది నిజమా అని ప్రశ్నించింది. అవి కేవలం ఆరోపణలని ఎస్‌హెచ్‌వో సమాధానం ఇవ్వగా, ‘‘సహ­జంగా నిజం కాదనే చెబుతారు’’ అని వ్యాఖ్యానించింది. కౌన్సెలింగ్‌ పేరుతో వేధిస్తే, మీకు కౌన్సెలింగ్‌ చేయించా­ల్సి ఉంటుందని ఎస్‌హెచ్‌వోను హెచ్చరించింది. మరో­సారి ఫిర్యాదు వస్తే తీవ్రంగా పరిగణిస్తామని తేల్చి చెప్పి­ంది. పోలీసులు ఒత్తిడి తెస్తే తిరిగి కోర్టుకు రావొచ్చునని పఠాన్‌ కరీంసాకు ధర్మాసనం వెసులుబాటు ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement