ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు | Cyclonic Storm Brings Heavy Rains And Strong Winds To North Andhra, Check Out Weather Updates Inside | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు

Oct 2 2025 12:20 PM | Updated on Oct 2 2025 2:18 PM

Heavy Rains: Strong winds in Visakhapatnam

సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. వంశ ధార, నాగావళి నదులకు ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని.. ఫ్లాష్ ప్లడ్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ అయ్యింది. 20 సెంటీమీటర్ల పైగా వర్షం నమోదయ్యే చాన్స్ ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు.

కళింగపట్నం సమీపంగా తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. వాయువ్య దిశగా కదులుతూ అర్ధరాత్రి పారాదీప్‌-గోపాల్‌పూర్‌ మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో 70 కి.మీ పైబడిన వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అలజడిగా మారింది. మత్స్యకారులు వేటకు వెళ్ళారాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఉత్తరాంధ్రలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరక కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. తీవ్ర వాయుగుండంతో ఉత్తరాంధ్రలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రం అలజడిగా మారింది. వాతావరణ శాఖ.. మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. విశాఖలో ఈదురుగాలుల బీభత్సం సృష్టించాయి. గాలి వానకు భారీ చెట్లు నేలకొరిగాయి.

పలు ప్రాంతాల్లో  విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్‌ కుప్పకూలాయి. ద్వారకానగర్ రోడ్డులోని ఫార్చునర్ కారుపై చెట్టు కూలిపోయింది. కారు పార్క్ చేసి.. ఓనర్ షాపింగ్‌కు వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఎక్కడికక్కడ భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఏయూ, శంకరమఠం, సత్యం జంక్షన్‌, బీవీకే కాలేజీ రోడ్లలో చెట్లు విరిగిపడ్డాయి. 

కాగా, వాయుగుండం ప్రభావంతో బుధవారం కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా మాడుగులలో 7.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. గాదిరాయిలో 5.1, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో 3.8, శ్రీకాకుళం జిల్లా పలాసలో 3.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వచ్చే రెండురోజుల్లో ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, దక్షిణకోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఇవాళ(గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement