భారీ వర్షాలు.. పిడుగులు

Heavy rains are falling across the state - Sakshi

బాపట్ల, తిరుపతి, కృష్ణా, గుంటూరు నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లోనూ భారీ వర్షాలు

ఉభయ, గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పిడుగుల తీవ్రత

అక్కడక్కడ వడగండ్ల వర్షాలు కూడా.. 

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్‌వర్క్‌ :ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో పిడుగులు, వడగళ్లు హడలెత్తిస్తున్నాయి. దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి జార్ఖండ్‌ వరకు.. రాయలసీమ, తెలంగాణ, ఒడిశాల మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ వరకు కొనసాగుతున్న ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కలవచర్లలో శనివారం అత్యధికంగా 8 సెం.మీ. వర్షం కురిసింది. ఎచ్చెర్ల (శ్రీకాకుళం)లో 7.5, ఎన్టీఆర్‌ జిల్లా వీరులపాడు మండలం అల్లూరులో 7 సెం.మీ.,  సీతంపేట (పార్వతీపురం మన్యం) 6.8, అనకాపల్లి జిల్లా గోలుగొండలో 6.5, కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరంలో 5.8, ఏలూరు జిల్లా పోలవరం మండలం లక్ష్మీనారాయణదేవీపేటలో 5.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, తిరుపతి, బాపట్ల, కాకినాడ, నెల్లూరు, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్ర­కా­శం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురిశాయి.

మిగిలిన ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పూర్వపు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లా­ల్లోని అనేకచోట్ల పిడుగులు పడ్డాయి. వర్షాల కార­ణంగా పలుచోట్ల ఉద్యాన పంటలకు నష్టం వాటి­ల్లినట్లు సమాచారం. పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి అనంతపురం జిల్లాల్లోని పలు మండలాల్లో వడగండ్ల వాన, ఈదురు­గాలులు సంభవించాయి. ఈ స్థాయిలో వడ­గళ్ల వాన కురవడం ఇక్కడ ఇదే తొలిసారి అని చెబుతున్నారు.

మరోవైపు.. ఈ వర్షంవల్ల ఉమ్మడి తూర్పుగోదావరిలోని మెట్ట, డెల్టా రైతులకు మేలు జరిగిందని భావిస్తున్నారు. గోదావరి డెల్టాలో రబీ సాగుకు శివారు, మెరక ప్రాంతాలకు నీటి సరఫరాకు అవాంతరాలు ఏర్పడుతున్న సమయంలో భారీ వర్షం కురవడం వారికి ఊరటనిచ్చింది. ముఖ్యంగా కోనసీమజిల్లా ముమ్మిడివరం, అమలా­పురం, రాజోలు, పి.గన్నవరం నియోజకవ­ర్గాలలో శివారు రైతులకు వర్షం మేలుచేసింది. కొబ్బరి, కోకో, ఆయిల్‌పామ్‌ వంటి ఉద్యాన పంటల రైతులు కూడా వర్షంవల్ల మేలు జరుగుతుందని చెబుతు­న్నారు.

మెట్ట ప్రాంతంలో మామిడి, జీడి మామిడి రైతులకు ఈ వర్షం మేలు చేస్తుంది. మామిడి పిందె గట్టిపడి తమకు ప్రయోజనం కలుగుతుందని మెట్ట ప్రాంతం రైతులు చెబుతున్నారు. వాతావరణం మారే వరకు మొక్కజొన్న కోతలు కోయవద్దని వ్యవసాయ శాఖాధికారులు సూచిస్తున్నారు. ఇక ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో శనివారం వీచిన ఈదురు గాలులకు ఒక ఇంటిపై రావిచెట్టు పడి సంధ్య (37) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. 

మరో రెండు రోజులు వర్షాలు 
రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఆదివా­రం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు­గోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు.

అలాగే, శ్రీకాకుళం, విజయ­నగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతా­రామ­రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకి­నాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదా­వరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో సోమవారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుపడే అవకాశముందని తెలిపా­రు.

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలతో­పాటుగా పిడు­గులు పడే అవకాశమున్న నేపథ్యంలో ఉరు­ముల­తో కూడిన వర్షం కురిసేటపుడు పొలాల్లో పనిచేసే కూలీలు, పశు–గొర్రె కాప­రులు చెట్లకింద ఉండకూడదని సూచించారు. ప్రజలు, రైతులు అప్ర­మత్తంగా ఉండాలని విశాఖలోని భారత వాతావరణ విభాగం  అధికా­రులు కూడా శనివారం రాత్రి నివేదికలో సూచించారు.

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top