గర్భిణుల్లో గగుర్పాటు | Health problems for pregnant women due to high temperatures | Sakshi
Sakshi News home page

గర్భిణుల్లో గగుర్పాటు

Oct 7 2026 4:37 AM | Updated on Oct 7 2026 4:37 AM

Health problems for pregnant women due to high temperatures

అధిక ఉష్ణోగ్రతలతో అనారోగ్య సమస్యలు 

గర్భిణుల్లో వేడి సంబంధిత సమస్యలు పెరిగాయని 73 శాతం మంది వెల్లడి 

శిశువుల్లో అనారోగ్య సమస్యలు పెరిగాయని 76 శాతం మంది వైద్యుల అభిప్రాయం 

ప్రత్యేక మార్గదర్శకాలు అవసరమని డబ్ల్యూహెచ్‌వోకు వినతి 

వెల్లడించిన బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఆరోగ్య సంస్థ ‘వెల్‌కమ్‌’ 

సాక్షి, అమరావతి: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గర్భిణులు, గర్భస్థ శిశువులు, నవజాత శిశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అధిక వేడి కారణంగా మహిళలు గర్భధారణ సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ముందస్తు ప్రసవాలు జరగడం, శిశువు ఎదుగుదలలో లోపాలు వంటివి ఉత్పన్నమవుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బ్రిటన్‌కు చెందిన వెల్‌కమ్‌ అనే అంతర్జాతీయ ఆరోగ్య పరిశోధన సంస్థ భారత్, ఆ్రస్టేలియా, బ్రెజిల్, బ్రిటన్, జింబాబ్వే దేశాల్లో ఇటీవల నిర్వహించిన సర్వే నివేదికను తాజాగా వెల్లడించింది. సర్వేలో మొత్తం వెయ్యి మంది మాతా, శిశు, ఆరోగ్య నిపుణులు పాల్గొన్నట్టు తెలిపింది. 

సర్వే వివరాలు ఇలా..  
గర్భిణుల్లో వేడి కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు గత ఐదేళ్లలో పెరిగాయని 73 శాతం మంది వైద్య నిపుణులు చెప్పారని వెల్లడించింది. మరో 76 శాతం మంది వైద్యులు గర్భస్థ శిశువులు, నవజాత శిశువుల ఆరోగ్యంపై వేడి ప్రభావం పెరిగిందని తెలిపారని పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వైద్య నిపుణుల్లో 98 శాతం మంది తీవ్ర వేడి కారణంగా ఆరోగ్యం దెబ్బతిన్న గర్భిణులకు చికిత్స అందించినట్లు తెలిపారని పేర్కొంది. 99 శాతం మంది వేడి ప్రభావంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న శిశువులను కూడా చూసినట్టు చెప్పారని వెల్లడించింది. 

గుర్తించిన సమస్యలు ఇవీ 
అధిక ఉష్ణోగ్రతల కారణంగా మహిళల్లో గర్భధారణ సమస్యలను గుర్తించినట్టు సర్వేలో పాల్గొన్న 23 శాతం మంది నిపుణులు వెల్లడించారు. తక్కువ బరువుతో శిశు జననాలు,  శిశువు ఎదుగుదలలో లోపాలు, ఇలాంటి సమస్యలను గుర్తించినట్టు మరో 34 శాతం మంది నిపుణులు తెలిపారు.  ఇక నవజాత శిశువుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 36 శాతం మంది వైద్యులు డీహైడ్రేషన్, వేడి కారణంగా అనారోగ్యానికి గురైన శిశువులను చూసినట్టు వెల్లడించారు. మరో 33 శాతం మంది శిశువులు పాలు తాగడంలో, శ్వాస తీసుకోవడంలో, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడంలో ఇబ్బందులు కనిపించాయని తెలిపారు. 

వైద్యం చేయించుకోవడమూ గగనమే 
అధిక ఉష్ణోగ్రతల కారణంగా వైద్య సేవలు పొందడం కూడా కష్టమవుతోందని 27 శాతం మంది వైద్య నిపుణులు తెలిపారు. మరో 29 శాతం మంది అత్యవసర వైద్య సేవలను ఆశ్రయించే కేసులు పెరిగాయని చెప్పారు. ప్రతి డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత పెరుగుదలతో ముందస్తు ప్రసవం జరిగే అవకాశాలు సుమారు 5 శాతం పెరుగుతున్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. 

రానున్న రోజుల్లో మరింత ముప్పు 
తీవ్ర వేడి ప్రభావం భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 81 శాతం మంది నిపుణులు వచ్చే ఐదేళ్లలో గర్భిణులు, గర్భస్థ శిశువులు, నవజాత శిశువుల ఆరోగ్యానికి తీవ్రమైన వేడి పెద్ద ముప్పుగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

సూచనలు ఇవీ
గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులను జాతీయ వాతావరణ–ఆరోగ్య ప్రణాళికల్లో ప్రత్యేకంగా చేర్చాలని ‘వెల్‌కమ్‌’ సంస్థ కోరింది. వేడి తీవ్రతను ముందుగానే హెచ్చరించే వ్యవస్థలు, చల్లటి వాతావరణం కల్పించే సదుపాయాలు, మెరుగైన వైద్య పర్యవేక్షణను అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. అలాగే గర్భధారణ, ప్రసవానంతర కాలంలో తీవ్ర వేడి ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేక వైద్య మార్గదర్శకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) రూపొందించాలని కోరింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement