దుకాణాల వేలంపై జీవీఎంసీ అధికారుల ఎత్తులు

GVMC Controversy Over Store Auction - sakshi - Sakshi

గతంలో వచ్చిన అద్దెకంటే తక్కువకు వేలంలో దుకాణాలు కట్టబెట్టే యత్నం  

ప్రధాన కూడళ్లయిన టీఎస్సార్‌ కాంప్లెక్స్, జగదాంబలో జిమ్మిక్కులు 

నేడు కీలక నిర్ణయం తీసుకోనున్న స్టాండింగ్‌ కమిటీ

సాక్షి,విశాఖపట్నం: కార్పొరేషన్‌ ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించి.. నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు.. దుకాణాల వేలంపై కఠినంగా వ్యవహరించనున్నామని ప్రకటించిన జీవీఎంసీ.. ఇప్పుడు వాస్తవానికి సుదూరంగా నడుస్తోంది. గతంలో సరిగా అద్దెలు చెల్లించలేదనీ, రెన్యువల్‌ చేయకుండా మీనమేషాలు లెక్కించారంటూ దుకాణాల నిర్వహణను నిలుపుదల చేయడం, బినామీల నుంచి స్వాధీనం చేసుకోవడం వంటి కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించిన అధికారులు.. ఇప్పుడు మళ్లీ అదే బాటలో పయనిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పక్కన ఉన్న ప్రైవేట్‌ షాపుల అద్దెల కంటే.. జీవీఎంసీ షాపులకు తక్కువ అద్దె వస్తుందనే కారణంతో కొత్తగా వేలం పాటలు నిర్వహించారు. ద్వారకా బస్‌స్టేషన్‌ సమీపంలో ఉన్న టీఎస్సార్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో మాత్రం వేలం పాటల నిర్ణయాలు విభిన్నంగా ఉన్నాయి. ఈ కాంప్లెక్స్‌లో షాప్‌ నం.25లో గతంలో రూ.25వేలు అద్దె చెల్లించేవారు.

ఇప్పుడు వేలం వేయగా రూ.46 వేలుకు చేరింది. 26వ నంబర్‌ షాపు రూ.23,500 ఉండగా ప్రస్తుతం రూ.42వేలకు చేరింది. కానీ.. ఇదే షాపింగ్‌ కాంప్లెక్స్‌లో వెస్ట్‌ సైడ్‌ ఉన్న షాప్‌ నంబర్‌ 1.లో గతంలో రూ.65,000 అద్దె చెల్లించారు. కానీ.. ఇటీవల నిర్వహించిన వేలం పాటలో రూ.22,500కి మాత్రమే అప్పగిస్తూ వేలం ఖరారు చేసేశారు. అదేవిధంగా గతంలో రూ.53 వేలు అద్దె వచ్చే షాపు ఇప్పుడు రూ.24వేలకు, రూ.40 వేలు వచ్చే షాపుని రూ.35 వేలకు కట్టబెట్టేలా జీవీఎంసీ అధికారులు ఎత్తులు వేస్తున్నారు. అదేవిధంగా ప్రధాన జంక్షన్‌గా నిత్యం రద్దీగా ఉండే జగదాంబ జంక్షన్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లోనూ దుకాణదారులతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కైపోయారు. గతంలో వచ్చిన అద్దెల కంటే రూ.5 వేల వరకు తక్కువకే వేలం పాటలో ఇచ్చేందుకు సిద్ధమైపోతున్నారు. పాత బస్‌స్టాండ్‌ సమీపంలో ఉన్న షాపుల విషయంలోనూ ఇదే తీరుగా రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తూ.. గతంలో ఉన్న అద్దెలకే తిరిగి దుకాణాలు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సూర్యాబాగ్‌ వాణిజ్య సముదాయంలో షాప్‌ నం. 2కి గతంలో 23,900 అద్దె రాగా.. ఇప్పుడు రెవెన్యూ అధికారుల కుటిల యత్నాలతో అంతకు తగ్గించి రూ.21 వేలకు మాత్రమే వేలానికి వచ్చినట్లుగా నిర్ణయించారు. పద్మానగర్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ఒక షాపుని కూడా ఇదే మాదిరిగా అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు. తమకు నచ్చిన వారికి.. తమతో కుమ్మక్కైన వారికి దుకాణాలను తక్కువ అద్దెకు ఇచ్చేలా రెవెన్యూ యంత్రాంగం కుమ్మక్కైంది. 

స్టాండింగ్‌ కమిటీ చర్చిస్తుందా..? 
కార్పొరేషన్‌కు ఆదాయం పెంచకుండా తగ్గించేలా జరిగిన వేలం పాటల వ్యవహారాలన్నీ శుక్రవారం జరగనున్న స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో సభ్యుల ఎదుటకు చర్చకు రానున్నాయి. మొత్తం 60 అంశాలతో కూడిన అజెండాతో ఉదయం 11 గంటలకు స్టాండింగ్‌ కమిటీ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం కానుంది. మేయర్‌ హరివెంకటకుమారి స్టాండింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తూ సమావేశం నిర్వహించనున్నారు. ఆదాయాన్ని హరించేలా జరిగిన వేలం పాటలకు సంబంధించిన వ్యవహారంపై కమిటీ సభ్యులు చర్చించి.. నిలుపుదల చేయనున్నారా.? లేదా.. అధికారుల పొంతన లేని సమాధానాలకు తలొగ్గి ఆమోదించనున్నారా? అనేది తేలనుంది. వేలం వ్యవహారంలో అధికారులు తమదైన శైలిలో సభ్యులను తప్పుదారి పట్టించేందుకు కావల్సిన అస్త్రాల్ని సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. రిజర్వేషన్ల ప్రకారం తగ్గించి ఇచ్చామని కొన్ని దుకాణాలకు, వేలం పాటకు ఎవరూ రాలేదని మరికొన్ని దుకాణాలను కట్టబెట్టామని చెప్పేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. నగర అభివృద్ధికి దోహదపడేలా ఏం నిర్ణయం తీసుకోవాలో స్టాండింగ్‌ కమిటీ చేతుల్లోనే ఉందని కొందరు రెవెన్యూ సిబ్బంది వ్యాఖ్యానించడం కొసమెరుపు. 

చదవండి: నోట్లో గుడ్డలు కుక్కి.. పీక నులిమి హత్య! ఏం ఎరగనట్టు నాటకం..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top