సాక్షి, తాడేపల్లి: గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త సాల్మన్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. టీడీపీ గూండాల చేతుల్లో దారుణంగా హత్యకు గురైన సాల్మన్ ఉదంతాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించి.. బాధిత కుటుంబానికి ఆసరాగా ఉంటామని ప్రకటించారు కూడా. ఈ క్రమంలో పిన్నెల్లి గ్రామస్తులు బుధవారం వైఎస్ జగన్‌ను కలిశారు.
పిన్నెల్లి గ్రామస్తులతో పాటు బాధిత కుటుంబం కూడా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయానికి వచ్చింది. తమ తండ్రిని రాజకీయ కక్షతోనే అత్యంత కిరాతకంగా చంపారని సాల్మన్ కుమారులు మరియదాసు, భిక్షం(ప్రవీణ్), కుమార్తె రాహేలు జగన్ వద్ద వాపోయారు. తండ్రి మరణంతో తమ కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లను ఓదార్చిన జగన్.. అధైర్య పడొద్దని, పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

మరోవైపు.. అక్రమ కేసులు పెడతామని టీడీపీ గూండాలు, పోలీసులు తమను ఎలా బెదిరించారనే విషయాన్ని గ్రామస్తులు జగన్‌కు తెలియజేశారు. ప్రభుత్వ దన్నుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, వ్యవస్ధలు దిగజార్చేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరును ఈ సందర్భంగా తీవ్రంగా తప్పుబట్టారాయన.

ఎవరూ భయపడవద్దని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇలాంటి వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని.. పార్టీ తరఫున లీగల్ సెల్ అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని చెప్పారు. పిన్నెల్లి గ్రామస్తుల వెంట గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్ రెడ్డి, స్ధానిక నాయకులు, లీగల్ సెల్ సభ్యులు ఉన్నారు.
చల్లా నాగరాజుకు భరోసా..
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం తేలుకుట్ల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త చల్లా నాగరాజు.. 2024 అక్టోబర్‌లో టీడీపీ గూండాల చేతిలో తీవ్రంగా గాయపడ్డాడు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్‌గా ఉన్నందుకు రాడ్లతో దాడిచేసి, నాగరాజు రెండు కాళ్ళు విరగ్గొట్టి తీవ్రంగా గాయపరిచారు. తనపై టీడీపీ గూండాలు ఏ విధంగా దాడిచేశారనేది, తన కుటుంబాన్ని ఎలా ఇబ్బందులు పెడుతున్నారనేది వైయస్ జగన్‌కు వివరించాడు. రెండు కాళ్ళు విరిగిపోవడంతో వీల్ ఛైర్‌కే పరిమితమై కుటుంబ పోషణ తీవ్ర ఇబ్బందిగా ఉందని జగన్ దృష్టికి తీసుకెళ్లాడు. నాగరాజు పరిస్థితికి చలించిపోయిన వైఎస్ జగన్.. పార్టీ తరపున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.


