ధాన్యం రైతుకు దగా.. రొక్కం లేదు.. దుఃఖమే! | Grain Farmers Worry with TDP Chandrababu Govt | Sakshi
Sakshi News home page

ధాన్యం రైతుకు దగా.. రొక్కం లేదు.. దుఃఖమే!

Jul 1 2025 4:16 AM | Updated on Jul 1 2025 4:16 AM

Grain Farmers Worry with TDP Chandrababu Govt

24 గంటల్లో ఇస్తామన్నారు..

రెండు నెలలు దాటినా దిక్కులేదు

పశ్చిమ గోదావరిలో అన్నదాతలకు రూ.300 కోట్ల మేర ధాన్యం బకాయిలు 

కోనసీమలో రూ.260 కోట్లు.. తూర్పు గోదావరిలో రూ.150 కోట్లు.. కాకినాడలో రూ.130 కోట్లు 

2 లక్షల మంది నుంచి 19.84 లక్షల టన్నుల సేకరణ.. తేమ శాతం, నాసిరకం సాకుతో నిలువు దోపిడీ.. బస్తాకు రూ.300 – రూ.450కి పైగా నష్టం 

క్వింటాల్‌కు ఏకంగా రూ.600 వరకు నష్టపోయిన రైతన్నలు 

దాదాపు రూ.1,200 కోట్లు దళారీల జేబుల్లోకి..  

సాక్షి, అమరావతి: పొలం పనుల సీజన్‌ మొదలైంది..! కూలీలతో కలసి కోలాహలంగా పంట చేలో తిరగాల్సిన రైతన్న.. కాడి, మేడి వదిలేసి కుమిలిపో­తున్నాడు! విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లాంటి వాటికోసం పెట్టుబడి సాయం అందించి ఆదుకోవడం దేవుడెరుగు.. తన కష్టార్జితాన్ని సైతం ఈ ప్రభుత్వం పొట్టనబెట్టుకుందని రగిలిపోతు­న్నాడు! 

ధాన్యం రైతులకు 24 గంటల్లో చెల్లిస్తామన్న డబ్బులకు రెండు నెలలుగా దిక్కు లేకుండా పోయిందని.. దళారీల పాలు చేసి దగా చేసిందని ఆక్రోశిస్తు­న్నాడు! పెట్టుబడి ఖర్చులకు డబ్బులు లేక.. బ్యాంకు రుణాలు పుట్టక అన్నదాతలు తీవ్ర అగచాట్లు ఎదు­ర్కొంటున్నారు. దళారీలు, మిల్లర్లను అడ్డు పెట్టుకుని టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులను అడ్డంగా దోచేస్తోంది! 

నెలలు తరబడి ధాన్యం సొమ్ములు చెల్లించకుండా నిర్దయగా వ్యవహరిస్తోంది. అన్నదాతలు కడుపు మండి రోడ్డెక్కితే కర్కశంగా వ్యవహరిస్తోంది. కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోగా.. ఆ వచ్చిన ధరనైనా చెల్లించకుండా వేధిస్తోంది. 

ఇప్పటివరకు రబీలో రెండు లక్షల మంది రైతుల నుంచి 19.84 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా చిరుధాన్యాల బకాయిలతో కలిపి దాదాపు రూ.1,250 కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉంది. రెండు నెలలకుపైగా బకాయిలు పేరుకుపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

రాష్ట్రానికి ధాన్యాగారం లాంటి ఉభయ గోదావరి జిల్లాల్లో ధాన్యం రైతులకు చెల్లింపులు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. మరోవైపు పెట్టుబడి ఖర్చుల కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో పాటు ఖరీఫ్‌ సాగుకు విత్తనాలు వేసుకునేందుకు డబ్బులు లేక దిక్కు తోచని పరిస్థి­తిలో కూరుకుపోయారు. రెండో ఏడాదీ అన్నదాతా సుఖీభవ ఇంతవరకు అందకపోవడంతో ‘సాగు కాడి’ని మోయలేకపోతున్నారు. 

‘మద్దతు’.. ఓ మోసం!
కేంద్ర ప్రభుత్వం 75 కిలోల బస్తా ధాన్యం సాధారణ రకానికి రూ.1,725, ఏ–గ్రేడ్‌కు రూ.1,740 చొప్పున గిట్టుబాటు ధర నిర్ణయించింది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం తేమ శాతం, ధాన్యం బాగా లేదనే సాకుతో రైతులను నిలువు దోపిడీకి గురి చేసింది. దీంతో ఒక్కో రైతు బస్తాకు రూ.300 – రూ.450కి పైగా నష్టపోయారు. టన్నుకు ఏకంగా రూ.6 వేలకు పైగా నష్టం వాటిల్లింది. 

ఇక ప్రభుత్వం చేపట్టాల్సిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిగా దళారులు, ప్రైవేటు వ్యక్తులు చేతుల్లోకి వెళ్లిపోయింది. దళారీ చెబితేనే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసిన దుస్థితి నెలకొంది. నేరుగా ధాన్యం సేకరించాలని అన్నదాతలు రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్తే.. ఆ ధాన్యం ఇక కళ్లాల వద్ద, రాశుల్లో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఖరీఫ్, రబీ సీజన్లు రెండింటిలోనూ ఇదే తీరు! 


ధాన్యం బకాయిలు చెల్లించాలంటూ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం డి.ముప్పవరం సెంటర్‌లో ఇటీవల అధికారులకు దండం పెట్టి నిరసన తెలుపుతున్న రైతులు (ఫైల్‌)  

రెండు నెలలుగా పడిగాపులు..
ధాన్యం విక్రయించిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లోకి మద్దతు ధర చెల్లిస్తున్నట్లు టీడీపీ కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంది. తాము ఘనంగా చెల్లింపులు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రచారం చేసుకున్నారు. 

కానీ రెండు నెలలుగా  వేలాది మంది ధాన్యం రైతులు ధాన్యం డబ్బుల కోసం పడిగాపులు కాస్తున్నా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో కడుపు మండిన అన్నదాతలు ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యే­లను నిలదీస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సన్నాలకు రేటే లేదు..
నాణ్యమైన సన్న రకాలకు సైతం గిట్టుబాటు ధర కంటే తక్కువ పలకడం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గత ప్రభుత్వంలో 75 కిలోల బస్తా రూ.2 వేలకుపైగా పలుకగా ఈసారి రూ.1,400 లోపే ఆగిపోవడం గమనార్హం. తెలంగాణలో సన్న రకాలకు రూ.500 బోనస్‌ ఇవ్వడంతో రైతులు అధికంగా సాగు చేశారు. ఫలితంగా ఏపీకి వచ్చి కొనేవారు తగ్గిపోయారు. 

పైగా ఎక్కడికక్కడ దళారులు, మిల్లర్లు తమ పరిధిలోకి వేరే ప్రాంతాల వ్యాపారులను రానివ్వకుండా అడ్డుకుని స్థానిక రైతులను నిలువునా దోచేశారు. మరోవైపు కాకినాడలో ‘సీజ్‌ ద షిప్‌’ ఎపిసోడ్‌ హడావుడితో బియ్యం వ్యాపారులు రైతుల నుంచి ధాన్యం కొనేందుకు ఆసక్తి చూపలేదు. ఫలితంగా మార్కెట్‌లో పోటీ తగ్గిపోయి రైతులు నష్టపోతున్నారు. 

‘కౌలు’కోలేని దెబ్బ..
కౌలు రైతులను కూటమి సర్కార్‌ కోలుకోలేని దెబ్బ­తీసింది. కౌలు రైతు కార్డులు జారీ చేయకపోవడంతో ప్రభుత్వానికి ధాన్యం విక్రయించుకోలేక నానా తిప్పలు పడ్డారు. దళారులు, మిల్లర్లు సిండికేట్‌గా మారడంతో నష్టానికి పంట అమ్ముకున్నారు. ఆరబెట్టినా, తేమ శాతం నిబంధనల ప్రకారం ఉండేలా చర్యలు తీసుకున్నప్పటికీ అదనపు ఖర్చులు మినహా.. మంచి రేటు వస్తుందన్న నమ్మకం లేక పంటలను దళారీలకే అప్పగించేశారు.

నాడు రైతన్న ఖాతాకు ‘జీఎల్టీ’ డబ్బులు..
నేడు ట్రాన్స్‌పోర్ట్‌ టెండర్లకూ దిక్కులేదు
ధాన్యం కొనుగోళ్లను పారదర్శకంగా చేపట్టి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులకు రవాణా, హమాలీలు, గోనె సంచులు సమకూర్చింది. రైతులే ఈ సదుపాయాలను సమకూర్చుకుంటే గన్నీ, లేబర్, ట్రాన్స్‌పోర్టు (జీఎల్టీ) చార్జీలను వారి ఖాతాల్లో జమ చేసేది. ఇలా రైతులపై అదనపు భారం పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం రాకతో మొత్తం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మారిపోయింది. 

ప్రభుత్వ యంత్రాంగం దళారీల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు దళారీలు ఇస్తేనే గోనె సంచులు వస్తాయి..! హమాలీలు లోడ్‌ చేస్తారు.. లారీ కదులుతుంది! ఇక జీఎల్టీ మొత్తం వాళ్లే తీసుకుంటున్నారు. ఒకవేళ రైతే ఇవన్నీ భరిస్తే రూపాయి కూడా వారి ఖాతాల్లో జమకావట్లేదు. అసలు ఈ ప్రభుత్వం ధాన్యం సేకరణకు ఎక్కడా ట్రాన్స్‌పోర్ట్‌ టెండర్లు పిలిచిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement