డిప్లొమాలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు | Sakshi
Sakshi News home page

డిప్లొమాలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు

Published Sun, Sep 3 2023 4:58 AM

Govt Text Books in Diploma - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థులకు అత్యున్న­త­స్థాయి విద్యనందించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం. సాంకేతిక విద్య­లోనూ సీఎం జగన్‌ పలు సంస్కరణలు చేప­ట్టారు. విద్యార్థులు చదువు పూర్తి చేయగానే మంచి కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేలా పాఠ్యాంశాల్లో కూడా మార్పులు చేస్తున్నారు. సాంకేతిక విద్యలో ప్రభుత్వం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి ప్రమాణా­లకు అనుగుణంగా కరిక్యులమ్‌లో మార్పులు తెచ్చింది.

డిప్లొమా స్థాయి నుంచి ఇండస్ట్రీ కనెక్ట్‌ విధానాన్ని అమలు చేస్తోంది. తాజాగా డిప్లొమాలో తొలిసారిగా ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను ముద్రిస్తోంది. ఈ విద్యా సంవత్సరం (2023–24)లో డిప్లొమా మొదటి ఏడాదికి ఆరు బ్రాంచ్‌లలో కొత్త కరిక్యులమ్‌ ప్రకారం 17 థియరీ, 10 ల్యాబ్‌ మాన్యు­వ­­ల్స్‌ను ప్రచురిస్తోంది. త్వరలో ఆటోమొబైల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూని­కేషన్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌లలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి.

అదనపు సమాచా­రం కోసం పాఠ్యపుస్తకాల్లో వెబ్‌ లింక్‌లు, ఆడియో విజువల్‌ విద్యా సమాచారానికి అనుగుణంగా డిజిటల్‌ లింక్‌లు పొందుపరిచారు. విద్యార్థులు డిప్లొమా పరీక్ష­లతోపాటు బహుళ జాతీయ సంస్థ, పలు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించేలా మంచి క్వశ్చ­న్‌ బ్యాంక్‌లను కూడా రూపొందించడం విశేషం.

విద్యార్థులకు అందుబాటు ధరల్లో
ఇప్పటివరకు డిప్లొమా కోర్సుల్లో బోధనకు రాష్ట్ర సాం­కేతిక విద్య, శిక్షణ మండలి ఆమోదించిన పాఠ్య పుస్త­కాలు అందుబాటులో లేవు. ఈ పరిస్థి­తుల్లో పుస్త­కాల ఎంపికలో విద్యార్థులు గందరగోళా­నికి గుర­వు­తు­న్నారు. దీంతో విద్యార్థులకు మేలు చేకూ­ర్చేలా సొంతంగా పాఠ్యపుస్తకాలు రూపొందించాల­ని సాంకేతిక విద్యా శాఖ అధికారులను ప్రభు­త్వం ఆదే­శించింది.

ఈ క్రమంలో సాంకేతిక విద్య, శిక్షణ మండలి తక్కువ ధరకు నాణ్యమైన పాఠ్య పుస్త­కాలు, ప్రయోగశాల కరదీపికల ప్రాజెక్టును ప్రారంభించింది. వీటి రూపకల్పనకు ప్రత్యేక అధ్యాపక బృందాన్ని ఎంపిక చేసింది. పాఠ్య పుస్తక ప్రచురణలో 46 మంది రచయితలు, 20 మంది సంపాదకులు సేవలు అందించారు. నేషనల్‌ అక్రెడిటే­షన్‌ బోర్డు మార్గదర్శకాల ప్రకారం అభ్యాస ఫలితా­లకు తగిన­ట్లుగా కంటెంట్‌ను రూపొందించింది.

మార్కెట్‌ ధరలతో పోల్చితే తక్కువ ధరకు పాఠ్య పుస్తకాలను అందించనుంది. గతంలో ఏ పుస్తకం కొనాలన్నా రూ.200–రూ.300 ఖర్చు అయ్యేది. ఇప్పుడు మెరుగైన విషయ పరిజ్ఞానంతో ప్రభు­త్వమే రూ.100 లోపు ధరలకు పాఠ్యపుస్తకాలను అందించనుంది. ముద్రిత ధరపై మరో 20 శాతం మేర సాంకేతిక విద్య, శిక్షణ మండలి ప్రత్యేక రాయి­తీని కల్పిస్తోంది.

కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి
కొద్ది రోజుల్లోనే డిప్లొమా మొదటి సంవత్సరం విద్యా­ర్థులకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు అందు­బాటు­లోకి తెస్తాం. ఇప్పటికే సాధారణ సబ్జె­క్టుల పుస్త­కాలు, ల్యాబ్‌ మాన్యువల్‌లు సిద్ధంగా ఉన్నా­యి. సీఎం జగన్‌ సూచనలతో సాంకేతిక విద్యా శాఖ, శిక్షణ మండలి పాఠ్య­పుస్తకాలను ముద్రిస్తోంది. ఇవి తక్కువ ధరకే లభిస్తాయి.
– చదలవాడ నాగరాణి, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ 

 
Advertisement
 
Advertisement