
యోగాంధ్ర కార్యక్రమం కోసం యంత్రాంగం మెడపై కత్తి
అందులో ఒకటో వంతైనా తురకపాలెం మరణమృదంగంపై దృష్టి పెట్టని సర్కార్
మే, జూన్ నెలల్లో యోగాంధ్రలో మునిగి తేలిన యంత్రాంగం.. అప్పుడే సమస్య తీవ్రం.. జూలై, ఆగస్టులో భారీగా మరణాలు
45 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం.. తప్పును కప్పిపుచ్చుకోవడానికి విచారణ పేరిట హడావుడి
కిందిస్థాయి సిబ్బంది, అధికారులపై చర్యలతో చేతులు దులుపుకునే పన్నాగం
తురకపాలెంలో మరణాలపై క్షేత్రస్థాయి సిబ్బంది చెప్పినా పట్టించుకోని ప్రభుత్వం
అనారోగ్య కేసులు, మరణాలను పసిగట్టలేదని ఆశాలు, ఏఎన్‌ఎంలపై ఉన్నతాధికారుల నెపం
‘‘యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రెండు కోట్ల రిజిస్ట్రేషన్లు చేయాలి’’ అంటూ అన్ని శాఖల యంత్రాంగం మెడపై సీఎం చంద్రబాబు కత్తిపెట్టారు. దీంతో ఎలాగైనా విజయవంతం చేయాలని మే, జూన్ నెలల్లో వీఆర్‌వో నుంచి సీఎస్ వరకు ప్రభుత్వం మొత్తం యోగాంధ్రలో తలమునకలైంది. కొన్నేళ్ల కిందట చనిపోయినవారు, విదేశాల్లో ఉంటున్నవారు, చిన్నపిల్లల పేరిట కూడా ఫేక్ రిజిస్ట్రేషన్లు చేయించి సీఎంను మెప్పించారు.
యోగాంధ్ర పూర్తవగానే యంత్రాంగంపై పీ4 పిడుగు పడింది. దీన్ని విజయవంతం చేయాల్సిందేనని సీఎం హుకుం జారీ చేశారు. మార్గదర్శకులను దొరకబట్టడం, లేకుంటే చిరుద్యోగులను బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించడంలో పెద్ద సార్లంతా నిమగ్నమయ్యారు.
...ఇలా ఈవెంట్ మేనేజ్‌మెంట్‌పై చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన శ్రద్ధలో ఒకటో వంతు ప్రజల ప్రాణాల రక్షణపై కూడా పెట్టి ఉంటే తురకపాలెంలో మృత్యుఘోషకు ఆదిలోనే అడ్డుకట్ట పడి ఉండేది.
సాక్షి, అమరావతి: క్వాంటం కంప్యూటింగ్, ఏఐ, అంతర్జాతీయ రాజధాని, బుల్లెట్‌రైన్ అంటూ పడికట్టు పదాలతో ప్రజలను మభ్యపెడుతున్న సీఎం చంద్రబాబు.. రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు రూరల్ మండలంలోని తురకపాలెంలో కనీసం సురక్షిత మంచినీటిని సరఫరా చేయకపోవడం ఆయన చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని యోగాంధ్రకు పరిమితం చేసిన మే, జూన్ నెలల్లోనే తురకపాలెంలో సమస్య మరింత తీవ్రమైనట్లు స్పష్టమవుతోంది.
అధికారిక లెక్కల ప్రకారం జూలైలో 10 మంది, ఆగస్టులో 10 మంది చనిపోయారు. గ్రామంలో జ్వరం, ఇతర అనారోగ్య సమస్యల కేసులు, మరణాలు మొదలైననాటి నుంచే ఆశాలు, ఏఎన్‌ఎంలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేస్తూ వచ్చారు. అయినప్పటికీ ప్రమాద ఘంటికలను ప్రభుత్వం పసిగట్టలేదు.
కిందివారిని బలి చేస్తే సరి..
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎక్కడ అమాయకులు మరణించినా విచారణలు జరిపి ఒకరిద్దరు సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకుని చేతులు దులిపేసుకోవడం చంద్రబాబు ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య. గోదావరి పుష్కరాలు, తిరుపతి తొక్కిసలాట, గోడ కూలి సింహాచలంలో భక్తుల మృతి ఘటనల్లో ఇదే వ్యూహాన్ని అమలు చేశారు. తురకపాలెం మరణాలపై సిబ్బంది నుంచి సమాచారం లేదంటూ ఉన్నతాధికారులు ఓ కట్టుకథ సిద్ధం చేశారు.
ఒక విచారణ చేసి తప్పంతా సిబ్బంది, ఒకరిద్దరు అధికారులదేనని నిరూపించే ప్రక్రియలో భాగంగా సెకండరీ హెల్త్ డైరెక్టర్‌తో విచారణకు ఆదేశించామని వైద్య శాఖ మంత్రి ప్రకటన చేశారు. మరణాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఉన్నతాధికారులకు సకాలంలో సమాచారం అందలేదని బూటకపు ప్రకటనలు చేశారు. కానీ, వాస్తవాలను పరిశీలిస్తే..
కింది స్థాయి సిబ్బందిపైనే నెపం..
గ్రామంలో ప్రజలు అనారోగ్యం పాలవడం, మరణాలపై ఎప్పటికప్పుడు ఆశా, ఏఎన్‌ఎంలు ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలైన్స్ ప్రోగ్రాం (ఐడీఎస్పీ) కార్యక్రమంలో భాగంగా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ వస్తున్నారు. దీని ఆధారంగానే జనవరి–మార్చి మధ్య ఐదుగురు, ఏప్రిల్‌లో ఇద్దరు, మేలో ముగ్గురు, జూన్‌లో ఇద్దరు, జూలైలో 10, ఆగస్టులో 10, సెప్టెంబరులో ముగ్గురు మరణించినట్టు గురువారం వైద్య శాఖ మంత్రే వెల్లడించారు. కానీ, కేసుల నమోదు తీరును పసిగట్టి పైఅధికారులను అప్రమత్తం చేయలేదని నెపం మోపుతూ తప్పంతా క్షేత్ర స్థాయి సిబ్బందిపై నెట్టేస్తున్నారు.
ఐడీఎస్పీ పోర్టల్‌లో రాష్ట్రంలో నమోదయ్యే జ్వరాలు, డెంగీ, మలేరియా, ఇతర అనారోగ్య సమస్యలు, వాటి ద్వారా సంభవించిన మరణాల వివరాలు క్షేత్రస్థాయి సిబ్బంది నమోదు చేసేవే. ఇది ఏడాదిలో 365 రోజులూ నడిచే ప్రక్రియ. ఐడీఎస్పీ వివరాల ఆధారంగానే వ్యాధులు, మరణాల నియంత్రణకు ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర స్థాయిలో ప్రజారోగ్య డైరెక్టర్, అదనపు డైరెక్టర్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్, వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిలు ఐడీఎస్పీలో అనారోగ్య కేసుల నమోదుపై సమీక్ష చేయాలి.
గత ప్రభుత్వంలో ఈ ప్రక్రియ పక్కాగా అమలయ్యేది. ఇప్పుడు పూర్తిగా గాలికి వదిలేశారు. ఈ కారణంగానే తురకపాలెం మరణాలు సంభవించాయి. క్షేత్రస్థాయి సిబ్బంది ఇచ్చిన సమాచారాన్ని అనుసరించి ఈ వ్యాధిని, మరణాలను అరికట్టాల్సిన పాలకులు, ఉన్నతాధికారులు ఈవెంట్ మేనేజ్‌మెంట్లలో మునిగిపోవడంతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.