బంగారం ధర పెరుగుతుందా..? తగ్గుతుందా?.. విశ్లేషకులు ఏం చెబుతున్నారు?

Gold Prices Are Rising Again - Sakshi

నరసాపురం(పశ్చిమగోదావరి): 20 రోజుల క్రితం తగ్గిన బంగారం ధరలు మళ్లీ 10 రోజుల నుంచి పెరుగుతూ వస్తున్నాయి. ధరలు ఇంకా తగ్గుతాయని కొన్ని నెలలుగా బులియన్‌ వర్గాలు విశ్లేషిస్తూ వస్తున్నాయి. అయితే సీన్‌ రివర్స్‌ అయ్యింది.  వారం రోజుల నుంచి పసిడి ధరలు పెరుగుతున్నాయి  మరో వైపు వెండిదీ అదే దారి. ప్రస్తుతం నరసాపురం మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 53,400, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.48,200 వద్ద ట్రేడవుతోంది. 916 కేడీఎం ఆభరణాల బంగారం కాసు ప్రస్తుతం రూ 38,550కు చేరింది. నెలరోజుల క్రితం కాసుధర రూ.37,024గా ఉంది. నెలరోజుల్లో రూ.1536లు పెరిగింది. కిలో వెండి ధర 62,000గా ట్రేడవుతోంది.
చదవండి: లోన్‌ యాప్స్‌ వేధింపులకు ఇక చెక్‌.. ట్రోల్‌ ఫ్రీ నంబర్‌ రిలీజ్‌ చేసిన హోంశాఖ

నెలరోజుల క్రితం వరకూ బంగారం ధరలు తగ్గుతూ వస్తుండటంతో ఇంకా తగ్గుతాయని బులియన్‌ వర్గాలు అంచనా వేశాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్‌ పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. చైనా, ఆ్రస్టేలియా, లాటిన్‌ అమెరికా దేశాలు భారీగా బంగారం నిల్వలను పెంచుకునే ప్రయత్నం చేయడం, రష్యా–ఉక్రెయిన్‌ మధ్య యుద్ధ వాతావరణం చల్లారకపోవడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని అంటున్నాయి. రూపాయి మారకం విలువ రికార్డుస్థాయిలో పడిపోవడం మరో కారణం. షేర్‌మార్కెట్‌లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీంతో మదుపర్లు బంగారం వైపు మళ్లడం ధరల పెరుగుదలకు కారణాలుగా మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో మరింతగా పెరగొచ్చని భావిస్తున్నారు.

రూ.4 కోట్ల వరకూ తగ్గిన అమ్మకాలు 
బంగారం ధరల పెరుగుదల అమ్మకాలపై పడింది. మొన్నటి వరకూ కళకళలాడిన జ్యుయెలరీ షాపులు వెలవెల బోతున్నాయి. ఒక్క నరసాపురం మార్కెట్‌లోనే హోల్‌సేల్, రిటైల్‌ కలిపి రోజుకు రూ.5 కోట్ల వరకూ అమ్మకాలు జరుగుతాయి. ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం పట్టణాల్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతాయి. పెరిగిన ధరలతో ఉమ్మడి పశ్చిమలో రోజుకు రూ 4 కోట్లు వరకూ అమ్మకాలు తగ్గినట్లు అంచనా. దీపావళికి బంగారం అమ్మకాలు పెద్ద ఎత్తున సాగుతుంటాయి. ధరల పెరుగుదల దీపావళి అమ్మకాలపై కూడా ప్రభావం చూపుతుందని బులియన్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

వేచి చూసే ధోరణిలో కొనుగోలుదారుడు 
ప్రస్తుతం బంగారం కొనాలా? కొన్ని రోజులు ఆగాలా? అనే సందిగ్ధంలో కొనుగోలుదారుడు ఉన్నాడు. ధరలు ఇంకా తగ్గుతాయనే విశ్లేషణతో, బంగారం కొనుగోళ్ళను చాలామంది వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఒక్కసారిగా పెరుగుతున్న ధరలు వారిని షాక్‌కు గురిచేసాయి. ఇప్పుడేమో ధరలు ఇంకా పెరుగుతాయని చెప్పడంతో కొనాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు.  

ఇంకా పెరిగే  అవకాశం ఉంది 
బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. షేర్‌ మార్కెట్‌ నష్టాల్లో ఉంది. అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం నెలకొంది. దీంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ధరలు పెరగడంతో నరసాపురం మార్కెట్‌లోనే దాదాపు 40 శాతం అమ్మకాలు తగ్గాయి. దీపావళి పండుగ అమ్మకాలపై కూడా ప్రభావం పడింది. పండుగకు ముందస్తు ఆర్డర్లు పెద్దగా రావడంలేదు. పెట్టుబడుల రూపంలో కొనుగోలు చేసే బిస్కెట్‌ అమ్మకాలు మాత్రం నిలకడగా సాగుతున్నాయి.  
– వినోద్‌కుమార్‌జైన్, నరసాపురం చాంబర్‌ ఆఫ్‌ గోల్డ్‌ అండ్‌ సిల్వర్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top