సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే గెజిట్‌ ప్రకటన రాలేదు

Gazette notification was not received as directions of Supreme Court - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన కృష్ణాజల వివాదాల ట్రిబ్యునల్‌ చేసిన సిఫార్సులను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికారిక గెజిట్‌లో నోటిఫై చేయలేదని కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ తుడు చెప్పారు. అంతర్‌రాష్ట్ర జలవివాదాల చట్టం కింద కేంద్ర ప్రభుత్వం 2004లో జస్టిస్‌ బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసిందని రాజ్యసభలో సోమవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు జవాబుగా తెలిపారు.

2010లో ఈ ట్రిబ్యునల్‌ ప్రభుత్వానికి నివేదిక  ఇచ్చిందన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా 2011లో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసిం దని, దీనిపై కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయని వివరించారు. వీటిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించేవరకు బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ సిఫార్సులను అధికారిక గెజిట్‌లో ప్రకటించవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని తెలిపారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ట్రిబ్యునల్‌ సిఫార్సులను ప్రభుత్వం అధికారికంగా గెజిట్‌లో ప్రకటించలేదన్నారు. 

1.15 కోట్ల గృహాలు మంజూరు
దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన్‌–అర్బన్‌ (పీఎంఏవై–యూ)లో 1.15 కోట్ల గృహాలు మంజూరయ్యాయని, వాటిలో 56.2 లక్షలు పూర్తయ్యాయని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయమంత్రి కౌశల్‌ కిషోర్‌ తెలిపారు. మిగిలినవి వివిధ దశలో ఉన్నాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

ఆర్థిక మద్దతుపై ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి
ఏపీకి ఆర్థిక మద్దతు ఇవ్వడానికి ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రానికి వైఎ స్సార్‌సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం మరో ఐదేళ్లపాటు పొడిగించాలన్నారు. రాజ్యసభలో  ద్రవ్యవినిమయ బిల్లుపై  మాట్లాడారు. ‘దేశంలో ఎరువుల బ్లాక్‌ మార్కెటింగ్‌ పెరుగుతోంది. కరోనా నేపథ్యంలో రాష్ట్రాల ఆర్థికవ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ పరిహారాన్ని ఐదేళ్ల పాటు పొడిగించాలి. రాష్ట్రంలో పెండింగ్‌ ప్రాజెక్టులను కేంద్రం వేగవంతం చేయాలి.  రాష్ట్రానికి ఆర్థిక మద్దతు అందించడానికి ఓ వ్యవస్థ రూపొందించాలి..’ అని ఆయన పేర్కొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top