గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలే అజెండా

Gazette Notification Implementation Agenda - Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గత నెల 15న కేంద్ర జల్‌ శక్తి శాఖ జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలే అజెండాగా సోమవారం సంయుక్తంగా సమావేశం నిర్వహించేందుకు రెండు బోర్డులు సిద్ధమయ్యాయి. పరిధిలో కొన్ని అంశాలపై అభ్యంతరాలను ప్రస్తావించడంతోపాటు ఏపీకి న్యాయబద్ధంగా దక్కాల్సిన నీటి కోటా కోసం బోర్డుల సమావేశంలో బలమైన వాదనలు వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశానికి హాజరు కాలేమని తెలంగాణ సర్కార్‌ తొలుత లేఖ పంపగా.. గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన 30 రోజుల్లోగా బోర్డుల స్వరూపాన్ని ఖరారు చేయాలని, సమయం తక్కువగా ఉన్నందున తప్పనిసరిగా హాజరు కావాలని బోర్డులు తేల్చి చెప్పాయి. సోమవారం ఎన్జీటీలో కేసుల విచారణకు హాజరు కావాల్సి ఉన్నందున సమావేశాన్ని మరో రోజుకు వాయిదా వేయాలని రెండు బోర్డులకు తెలంగాణ సర్కార్‌ ఆదివారం మరోసారి వేర్వేరుగా లేఖలు రాసింది. అయితే దీన్ని పరిగణనలోకి తీసుకోని బోర్డులు సోమవారం సమావేశాన్ని యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించాయి. 

అక్టోబర్‌ 14 నుంచి అమల్లోకి గెజిట్‌ నోటిఫికేషన్‌ 
బోర్డుల సమన్వయ కమిటీ సమావేశానికి ఈనెల 3న తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు గైర్హాజరయ్యారు. అయినప్పటికీ ఆ సమావేశాన్ని బోర్డులు యథాతథంగా నిర్వహించాయి. పూర్తి స్థాయి బోర్డుల సమావేశాన్ని నిర్వహించిన తర్వాతే సమన్వయ కమిటీల భేటీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ సర్కార్‌ ఆ భేటీకి గైర్హాజరైంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొని బోర్డుల పరిధిపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, వాటిని కేంద్ర జల్‌ శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. జల్‌ శక్తి శాఖ స్పందన ఆధారంగా మిగిలిన అంశాలపై ముందుకెళ్తామని స్పష్టం చేశారు. తెలంగాణ సర్కార్‌ హాజరు కాకపోవడంతో సమన్వయ కమిటీ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. అక్టోబర్‌ 14 నుంచి గెజిట్‌ నోటిఫికేషన్‌ అమల్లోకి వస్తుందని కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌ ప్రతిపాదించిన మేరకు పూర్తి స్థాయి బోర్డుల సమావేశాన్ని నిర్వహించాలని కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్‌లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్‌ అయ్యర్‌లు నిర్ణయించారు. ఆ మేరకు సోమవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ దీనికి సైతం గైర్హాజరు కావాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయించడం గమనార్హం.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top