
వెల్డింగ్ షాపులో పేలిన గ్యాస్ సిలిండర్
ముగ్గురు మృతి.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు
క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమం
తునాతునకలైన దుకాణం..
చెల్లాచెదురుగా ఇద్దరి శరీర భాగాలు
విశాఖ సిటీ: విశాఖ వన్‌టౌన్‌లో విషాదం చోటుచేసుకుంది. ఫిషింగ్ హార్బర్ రోడ్డులోని వెల్డింగ్ షాపులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విస్ఫోటనం ధాటికి షాపు తునాతునకలైంది. గురువారం సాయంత్రం 4.30 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనతో విశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళితే.. సున్నపువీధి ప్రాంతంలో నివాసముంటున్న చల్లా గణేష్ (44) 6 నెలల క్రితమే బుక్కావీధి ప్రాంతంలోని ఫిషింగ్ హార్బర్ రోడ్డులో వెల్డింగ్ దుకాణాన్ని ప్రారంభించాడు.
వెల్డింగ్, గ్యాస్ కటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గణేష్ తో పాటు హెల్పర్ శ్రీను, రోజువారీ వేతనం కింద ఎర్ర ఎల్లాజీ (45), డి.సన్యాసిరావు (46) పని చేస్తున్నారు. సాయంత్రం 4.30 సమయంలో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి వెల్డింగ్ షాపు నామరూపాలు లేకుండాపోయింది. షాపు యజమాని చల్లా గణేష్, హెల్పర్ శ్రీను శరీరాలు ముక్కలై షాపు వెనుక ఉన్న 9 అడుగుల గోడ పైనుంచి ఎగిరి అవతలివైపు పడ్డాయి.
వర్కర్లు ఎల్లాజీ, సన్యాసిరావుతో పాటు దాని పక్కనే ఉన్న స్క్రాప్ దుకాణం వద్ద పనిచేస్తున్న చింతకాయల ముత్యాలు (27), ఇప్పిలి రంగారావు(53)లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ పేలుడు శబ్దం రెండు కిలోమీటర్ల మేర వినిపించింది. దీంతో వన్‌టౌన్ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. క్షతగాత్రులను ఆటోలో ఎక్కించి కేజీహెచ్‌కు తరలించారు. చింతకాయల ముత్యాలు శరీరం 95 శాతం కాలిపోవడంతో చికిత్స పొందుతూ సాయంత్రం 7 గంటలకు మరణించాడు. ప్రస్తుతం 95 శాతం కాలిన గాయాలతో ఎల్లాజీ, 75 శాతం గాయాలతో ఇప్పిలి రంగారావు, 18 శాతం గాయాలతో డి.సన్యాసిరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. పేలుడు ఘటనపై పోలీసులు, అగి్నమాపక శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ ద్వారా పేలుడుకు గల కారణాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ పేలుడుకు వెల్డింగ్ సిలిండర్ కారణమా? లేదా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వినియోగంతోనే ప్రమాదం జరిగిందా? అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.