అన్నమయ్య కీర్తనలకు వైవిధ్యమైన బాణీలు కట్టిన ఘనాపాటి
శాస్త్రీయ, ఆధ్యాత్మిక గాయకుడిగా గుర్తింపు
శ్రీ వేంకటేశ్వరునికి సంకీర్తన నైవేద్యాన్ని సమర్పించిన సంగీత తపస్వి
నిత్యనూతన గానంతో సంగీత ప్రియులను అలరించిన మధుర గాయకుడు
తిరుపతి కల్చరల్/రాజమహేంద్రవరం సిటీ: అన్నమయ్య సంకీర్తనల పదార్చనే జీవితంగా నిరంతరం తపించి తన స్వర కీర్తనలతో అలరారింపజేసిన సంగీత తపస్వి గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌ని పద్మశ్రీ వరించింది. శ్రీవారి పరమభక్తుడు అన్నమయ్య సంకీర్తనలకు రాగాలనద్ది, వైవిధ్యభరితంగా బాణీలు కట్టి భిన్నమైన స్వర ప్రయోగాలతో సాహిత్య సౌరభంతో అన్నమయ్య కీర్తలను జన బాహుళ్యం చేసిన ఘనాపాటిగా గరిమెళ్ల ప్రసిద్ధి చెందారు.
సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి శిష్యరికంతో మరింత రాటుతేలిన ఆయన శాస్త్రీయ, ఆధ్యాత్మిక గాయకుడుగా గుర్తింపు పొందారు. గరిమెళ్ల 1978లో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుడిగా ప్రవేశించి అపార ప్రతిభతో టీటీడీ ఆస్థాన విద్యాంసుడిగా ఎదిగారు. అన్నమయ్య కీర్తనలకు స్వపరపరిచి ఆలపించి తిరుమల శ్రీ వేంకటేశ్వరునికి సంకీర్తన నైవేద్యాన్ని సమర్పించారు. టీటీడీతోపాటు కంచి కామకోటి పీఠం (2010), అహోబిల మఠం (2020) ఆస్థాన సంగీత విద్వాంసులుగా కూడా గరిమెళ్ల పనిచేశారు.
అంచెలంచెలుగా.. గొప్ప సంగీత విద్వాంసుడిగా..
రాజమండ్రిలో 1948 నవంబరు 9న కృష్ణవేణి, నరసింహారావు దంపతులకు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ జన్మించారు. ఆయన తండ్రి నరసింహారావు కూడా విద్యాంసుడు కావడంతోపాటు ప్రముఖ సినీగాయని జానకి స్వయాన పిన్నమ. వారి స్ఫూర్తితో ఆయన చిన్నప్పటి నుంచి సంగీతంపట్ల ఆసక్తితో అంచెలంచెలుగా ఎదిగి గొప్ప సంగీత విద్యాంసుడిగా గుర్తింపు పొందారు. చివరి దశలో తిరుపతిలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య రాధ, కుమారులు అనిల్‌కుమార్, పవన్‌కుమార్. గరిమెళ్ల నిత్యం సంగీతార్చనతో తన ఆధ్యాత్మిక భక్తి పారవశాన్ని చాటుకున్నారు. 2025 మార్చి 9న తిరుపతిలో తన తుదిశ్వాస వరకు నిత్యనూతన మధుర గానంతో సంగీత ప్రియులను అలరిస్తూ, సంగీతోపాసన చేస్తూ నాదయోగిగా పరమపదాన్ని చేరుకున్న ధన్యజీవి, మధుర గాయకుడు, స్వరకర్త, మహా వాగ్గేయకారుడు బాలకృష్ణ ప్రసాద్.
జనరంజకంగా అపూర్వ రాగాల సృష్టికర్త
‘వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనవుల జాజర, పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు’ లాంటి పలు కీర్తనలకు ఆయనే స్వరాలు సమకూర్చారు. సంప్రదాయ కర్ణాటక, లలిత, జానపద సంగీతంలోనూ ఆయన ప్రసిద్ధులు. రాగమే ధ్యాసగా, ఆధ్యాత్మిక సంగీతమే జీవితంగా పయనిస్తూ వేయికి పైగా అన్నమాచార్య సంకీర్తనలను శాస్త్రీయ లలిత, జానపద బాణీలలో జనరంజకంగా స్వరపరిచి ఆ కీర్తనల సాహిత్య పరిమళాలను పండిత, పామరులకు విస్తరింపజేశారు.
బహుళ ప్రచారంలో మోహన, హంసధ్వని, శంకరాభరణం, తోడి, కల్యాణి, మాయామాళవగౌళ రాగాలను సరళమైన పద్ధతిలో స్వరపరిచి నొటేషన్‌లతోపాటు చిన్నచిన్న పుస్తకాలుగా అందుబాటులోకి తెచ్చారు. రతిపతిప్రియ, వరం, నటహిందోళం, శివరంజని, పాడి, మిశ్రవకుళాభరణం వంటి రాగాల్లో ఆయన స్వరపరిచిన సంకీర్తనలు ఎంతో అలరింపజేశాయి. సుందరంజని, సుమశ్రీసుకామవర్థని, సుమగంధి, సునాదనంది, సత్యప్రియ, సంజీవి, సింధుప్రియ, శ్యామకాం¿ోజి, వాణీప్రియ, చిత్రకల్యాణి, నిషాది, ప్రసూన, కోమలి వంటి సుమారు 20 అపూర్వ రాగాలను సృష్టించి అందులో కీర్తనలను రచించి పుస్తకాలతోపాటు ఆడియో రూపంలోనూ తీసుకొచ్చారు. త్యాగరాజస్వామి ఆరాధానోత్సవాల పంచరత్న కీర్తనల గోష్టిగానం తరహాలో ప్రపంచవ్యాప్తంగా సప్తగిరి సంకీర్తనల గోష్టిగానాన్ని ప్రచారం చేసిన ఘనత గరిమెళ్లకే దక్కింది.
పురస్కారాలు అనేకం..
సంగీతమే జీవితంగా.. అనునిత్యం ఆధ్యాత్మిక సంకీర్తనల స్వరధారణలో గరిమెళ్ల సంగీత యజ్ఞ ప్రతిభకు విశేష పురస్కారాలు వరించాయి. అన్నమాచార్య సంకీర్తన మహతి, హరికీర్తనాచార్యలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్యాతిక సంస్థల పురస్కారాలు ఎన్నో అందుకున్నారు. శ్రీపద్మావతి మహిళా వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. పొట్టి శ్రీరాముల తెలుగు వర్సిటీ నుంచి విశిష్ట పురస్కారంతోపాటు రాష్ట్రపతి చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్న ప్రతిభాశాలి గరిమెళ్ల. అంతటి సంగీత విద్వాంసుడు 2025 మార్చి 9న తుదిశ్వాస విడిచారు. ఆయన సంగీత సేవా ప్రతిభను కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌కు పద్మశ్రీ వరించడంతో సంగీతాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


