తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్లలో సాధించింది ఏమీ లేదని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు.
‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. ఎమ్మెల్యేలే జనం ఇళ్లపైకి వెళ్లి దాడులు చేస్తున్నారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులు ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. అధికార పార్టీ నేతల చెప్పుచేతుల్లో పోలీసులు పని చేయటం సిగ్గుచేటు. ఎమ్మెల్యే చింతలపూడి ప్రభాకర్ రౌడీయిజం చేయటం దుర్మార్గం.
ఇలాంటివి జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? పైగా బాధితుడి మీదే కేసు పెడతారా? ప్రశ్నిస్తాననే పవన్ కల్యాణ్ ఎందుకు సైలెంట్ అయ్యారు? రాష్ట్రంలో దారుణాలు జరుగుతుంటే ఢిల్లీ వెళ్లి మీటింగులు పెట్టటం సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి మంచోడట, కాంగ్రెస్ అంతుచూస్తాడట.
లాలూచీలకు అలవాటు పడిన పవన్ ఇంతకంటే ఇంకేం మాట్లాడుతారు? విజయవాడకు చెందిన సాయికృష్ణను పోలీసులు లాకప్ లో చంపేశారు. అతన్ని వెతుకుతున్నామంటూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు. వ్యవస్థలను ఇంతగా దిగజార్చుతారా? హోంమంత్రి అనిత ఒక మహిళ అయి ఉండి మహిళలకు రక్షణ కల్పించలేరా? పసిపిల్లలు తప్పి పోయినా తెలుసుకునే పరిస్థితి లేదు. నియంత దేశాల్లో కూడా ఇలాంటి పోకడలు లేవు’’ అని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.


