AP YSR Free Crop Insurance Scheme: నేడు రైతుల ఖాతాల్లో ఉచిత పంటల బీమా నగదు జమ - Sakshi
Sakshi News home page

నేడు రైతుల ఖాతాల్లో ఉచిత పంటల బీమా నగదు జమ

May 25 2021 4:02 AM | Updated on May 25 2021 9:41 AM

Free crop insurance cash deposits in farmers accounts today - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద ఖరీఫ్‌–2020 సీజన్‌కు సంబంధించి అర్హులైన 15.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,820.23 కోట్లు జమ చేయనుంది. మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా ఆర్థిక భారం పడనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో నోటిఫైడ్‌ పంటలకు ప్రీమియం చెల్లించిన రైతులకు మాత్రమే బీమా వర్తింపచేసేవారు. దీంతో ఆర్థిక స్తోమత, అవగాహన లేక లక్షలాది మంది రైతులు బీమా చేయించుకోలేక ఆర్థికంగా నష్టపోయేవారు. పైగా బీమా సొమ్ములు ఎప్పుడొస్తాయో.. ఎంతొస్తాయో, ఎంతమందికి వస్తాయో తెలియని పరిస్థితి ఉండేది. ఈ దుస్థితికి చెక్‌ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులపై పైసా భారం పడనీయకుండా.. తానే భారాన్ని భరిస్తూ ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చింది. ఏడాది తిరగకుండానే ఠంచనుగా పంటల బీమా సొమ్ములు చెల్లించాలన్న లక్ష్యంతో ఖరీఫ్‌– 2019 సీజన్‌కు సంబంధించి 9.79 లక్షల మంది రైతులకు రూ.1,252.18 కోట్లు చెల్లించింది. అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వం 5.58 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.715.84 కోట్ల బకాయిలను కూడా చెల్లించి వారికి అండగా నిలిచింది. 

2019–20లో 45.96 లక్షల హెక్టార్లకు బీమా
2019–20 సీజన్‌ (ఖరీఫ్, రబీ కలిపి)లో 49.81 లక్షల మంది రైతులకు చెందిన 45.96 లక్షల హెక్టార్లకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బీమా చేయించింది. ఇందుకు రైతులపై పైసా కూడా ఆర్థికభారం పడనీయలేదు. టీడీపీ హయాంలో రబీ, ఖరీఫ్‌ కలిపి సగటున కేవలం 23.57 లక్షల హెక్టార్లు మాత్రమే బీమా పరిధిలోకి వస్తే ప్రస్తుతం 45.96 లక్షల హెక్టార్లు అంటే.. కోటి 14 లక్షల ఎకరాలను ప్రభుత్వం బీమా పరిధిలోకి తెచ్చింది. ఇందుకు రైతుల వాటా రూ.468 కోట్లు, ప్రభుత్వ వాటా రూ.503 కోట్లు కలిపి మొత్తం రూ.971 కోట్లను ప్రభుత్వమే చెల్లించింది.

గత రెండేళ్లలో రూ.3,788.25 కోట్ల లబ్ధి
ఖరీఫ్‌–2020 సీజన్‌లో 37.25 లక్షల మంది రైతులు 35.75 లక్షల హెక్టార్లలో వేసిన పంటలు బీమా పరిధిలోకి వచ్చాయి. దిగుబడి ఆధారంగా 21 పంటలకు, వాతావరణ పరిస్థితుల ఆధారంగా 9 పంటలకు బీమా సదుపాయం కల్పించారు. పంటకోత ప్రయోగాల ఆధారంగా అర్హత పొందిన 15.15 లక్షల మంది రైతులకు రూ.1,820.23 కోట్లు బీమా సొమ్మును వారి ఖాతాల్లో మంగళవారం జమ చేస్తున్నారు. ఈ మొత్తంతో కలిపి గత రెండేళ్లలో పంటల బీమా కింద 30.52 లక్షల మంది రైతులకు రూ.3,788.25 కోట్ల లబ్ధిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేకూర్చింది. ఇలా ఇప్పటివరకు రైతులు వివిధ పథకాల కింద గత రెండేళ్లలో రూ.83,085.45 కోట్ల లబ్ధిని పొందారు. 

రైతులపై పైసా భారం పడకుండా..
రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నాం. 5.58 లక్షల మంది రైతులకు గత టీడీపీ ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన రూ.716 కోట్ల బకాయిలను కూడా చెల్లించాం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఏడాది తిరగకుండానే ఖరీఫ్‌–19లో 9.79 లక్షల మందికి రూ.1,252 కోట్లు అందించాం. ఖరీఫ్‌–2020లో అర్హత పొందిన 15.15 లక్షల మందికి రూ.1,820 కోట్లు మంగళవారం జమ చేస్తున్నాం.
    – కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి

కోవిడ్‌ పరిస్థితులు ఉన్నప్పటికీ.. 
ఖరీఫ్‌–2020 పంటల బీమా సొమ్ము జమ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. గతంలో ఎన్నడూ ఏడాది తిరగకుండానే బీమా పరిహారం చెల్లించిన దాఖలాలు లేవు. కోవిడ్‌ పరిస్థితులు నెలకొన్నప్పటికీ రైతుభరోసా కేంద్రాల ద్వారా అర్హులైన రైతులను గుర్తించి.. వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం.  
 – హెచ్‌.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement