‘లైఫ్‌ ట్యాక్స్‌’కు ఎగనామం! | Sakshi
Sakshi News home page

‘లైఫ్‌ ట్యాక్స్‌’కు ఎగనామం!

Published Sun, May 26 2024 5:29 AM

Frauds by dealers with India registration

భారత్‌ రిజిస్ట్రేషన్‌తో డీలర్ల మోసాలు

ఇలా సుమారు 400 వాహనాల అమ్మకాలు 

రవాణా శాఖకు సుమారు రూ.4 కోట్ల నష్టం 

నలుగురు డీలర్ల పైచర్యలు.. 

మరో 10 మందికి నోటీసులు

గోపాలపట్నం: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, నాలుగు రాష్ట్రాల్లో కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కంపెనీలు ఉన్న ప్రయివేటు సంస్థల ఉద్యోగులకు మాత్రమే వర్తించే బీహెచ్‌ రిజిస్ట్రేషన్‌ వాహనాల అమ్మకాల్లో పలువురు డీలర్లు మోసాలకు పాల్పడిన ఘటన వెలుగులోకొచ్చింది. ఇటీవల లైఫ్‌ టాక్స్‌ కట్టాల్సిన వాహనాల వివరాలు సేకరించే క్రమంలో ఇది బయటపడింది. విశాఖలో వాహనాలు కొనుగోలు చేసి అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకుని లైఫ్‌ టాక్స్‌ ఎగ్గొట్టేందుకు చేసిన ప్రయత్నాలు బయటపడ్డాయి. ఇందులో ప్రధా­నంగా కార్లు ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వ, ప్రయి­వేటు సంస్థల ఉద్యోగులమంటూ పలువురు ఫేక్‌ డాక్యుమెంట్లతో కార్లు కొనుగోలు చేసినట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. విశాఖలో 16 మంది కార్ల డీలర్లు 400పైగా కార్లను ఈ విధంగా అమ్మినట్లు తెలుస్తోంది. దీని వల్ల రవాణా శాఖకు సుమారు రూ.4 కోట్ల వరకు నష్టం వాటిల్లి­నట్లు గుర్తించారు. ఈ అమ్మకాల్లో కొన్ని నిజమైనవి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఫేక్‌ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు ఎన్ని జరిగాయో పరిశీలిస్తున్నట్టు తెలిపారు.   

అదే అదనుగా..  
గతంలో అమ్మకాలపై రవాణా శాఖకు నిరంతరం సమాచారం ఉండేది. కానీ ఇప్పుడు డీలర్ల రిజి­స్ట్రేషన్‌ వల్ల వాటిపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో డీలర్లు ఇష్టానుసారంగా మోసాలకు పాల్పడుతున్నారు. నెలలో ఎన్ని వాహనాలు అమ్ము­తున్నారు? ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి? లైఫ్‌ టాక్స్‌లు ఎన్ని వస్తున్నాయన్న సమాచా­రం అధికారులకు ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి మోసా­లకు జరుగుతున్నాయని వాహనదారులు చెబు­తున్నారు. కాగా, పలు రాష్ట్రాల్లో పని చేసే ఉద్యో­­గులకు వెసులుబాటు కలిగించేందుకు భారత్‌ రిజిస్ట్రేషన్‌ సదుపాయం కలిగించింది.

అయితే అందుకు తగిన పత్రాలు అందించాలి. కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తూ ఇతర రాష్ట్రాలకు బదిలీపై వెళ్లే వారికి, నాలుగు రాష్ట్రాల్లో కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కంపెనీలు ఉన్న ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగులు, బదిలీలపై వెళ్లే వారికి భారత్‌ రిజిస్ట్రేషన్‌ వర్తిస్తుంది. ఈ రిజిస్ట్రేషన్‌ వాహనాలు ఏ రాష్ట్రంలోనైనా తిరగొచ్చు. రాష్ట్రం మారాక ఆ రాష్ట్రంలో మళ్లీ రిజిస్ట్రేషన్‌ మార్చుకునే పని ఉండదు. దీని ద్వారా లైఫ్‌ ట్యాక్స్‌ తగ్గుతుంది. ఇది అదునుగా చేసుకుని కొందరు డీలర్లు బీహెచ్‌ రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు ఇక్కడ వాహనాలను అమ్మి, అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నారు. దీంతో ఇక్కడి కొనుగోలు చేసిన వాహనాలకు ఇక్కడి లైఫ్‌ ట్యాక్స్‌లు కట్టే పరిస్థితి లేకపోయింది.  

నలుగురు డీలర్లపై చర్యలు, 10 మందికి నోటీసులు
400 కార్ల బీహెచ్‌ రిజిస్ట్రేషన్‌పై ఉప రవాణా కమిషనర్‌ రాజారత్నం చర్యలు తీసుకున్నారు. కొద్ది రోజులుగా బీహెచ్‌ రిజిస్ట్రేషన్‌ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టి అందులో జరిగిన అవకతవకలను గుర్తించారు. లైఫ్‌ ట్యాక్స్‌లు తగిన స్థాయిలో రాక పోవడం వల్ల అనుమానాలకు దారి తీసిందన్నారు. ఫేక్‌ ధ్రువపత్రాలతో బీహెచ్‌ రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు నలుగురు డీలర్ల ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలు ఉండడంతో వీరిపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. మరో 10 మంది డీలర్లకు నోటీసులిచ్చామన్నారు. దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని తెలిపారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement