అక్రమ కేసులో మాజీ మంత్రి కాకాణి అరెస్టు | Former Minister Kakani Govardhan Reddy Arrested In Kerala In Illegal Mining Case, Watch News Video Inside | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులో మాజీ మంత్రి కాకాణి అరెస్టు

May 26 2025 5:27 AM | Updated on May 26 2025 9:00 AM

Former minister Kakani Govardhan Reddy arrested in illegal case

కేరళలో అదుపులోకి తీసుకున్న నెల్లూరు పోలీసులు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెడ్‌బుక్‌ పాలన రోజురోజుకూ శ్రుతిమించుతోంది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా సర్కారు పెద్దల బరితెగింపు హద్దులు మీరుతోంది. ప్రశ్నించే వారే ఉండకూడదని హూంకరిస్తూ నిత్యం తప్పుడు కేసులతో చెలరేగిపోతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్‌ చేశారు. కేరళ రాష్ట్రంలో ఆయన్ను అదుపులోకి తీసుకుని ఆదివారం రాత్రి నగరానికి తీసుకువచ్చారు. 

ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. వాటిని ప్రజలకు గుర్తు చేస్తున్న నేతలపై కూటమి ప్రభుత్వం కళ్లెర్ర చేస్తోందనేందుకు కాకాణి అరెస్టే నిదర్శనం. ఆయనకు ఏమాత్రం సంబంధం లేని సిల్లీ కేసులో ప్రభుత్వ పెద్దలు పట్టుబట్టి మరీ అరెస్ట్‌ చేయించడం దుర్మార్గం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసులను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు.. అరెస్టులు.. వేధింపులతో ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. రెడ్‌బుక్‌ కుట్రలతో ఇప్పటికే పదుల సంఖ్యలో ముఖ్య నేతలపై తప్పుడు కేసులు బనాయించారు. 

ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తుండటం వల్లే కాకాణిపై తప్పుడు కేసు పెట్టారు. ఇందులో భాగంగా పొదలకూరు మండలం తాటిపర్తి రుస్తుం మైన్స్‌లో అక్రమ మైనింగ్‌ జరిగిందని ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనింగ్‌ శాఖ ఇన్‌చార్జ్‌ డీడీ బాలాజీ నాయక్‌ పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్‌లో కాకాణి అనుచరుల ప్రమేయం ఉందని, ఆయన వారికి సహకరించారంటూ 120(బి), 447, 427, 379, 290, 506, 109 ఆర్‌/డబ్ల్యూ 34 ఐపీసీ, సెక్షన్‌ 3 పీడీపీపీఎ, సెక్షన్‌ 3 అండ్‌ 5 ఆఫ్‌ ఈఎస్‌ యాక్ట్‌ అండ్‌ సెక్షన్‌ 21(1), 21(4) ఆఫ్‌ ఎంఎండీఆర్‌ యాక్ట్‌ కింద పోలీసులు నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు. 

ఈ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సంబంధం లేకపోయినా.. పట్టుబట్టి, టార్గెట్‌ చేసి ఏ4గా చేర్చారు. తొలుత ఈ కేసులో బలం లేదని ఏ1తో పాటు మరో ఇద్దరికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో కేసును మరింత పటిష్టం చేసి కాకాణిని జైలుకు పంపే కుట్రలో భాగంగా అట్రాసిటీ సెక్షన్‌లు జత చేశారు. కాకాణి ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఉండగా నెల్లూరు పోలీసులు ఆదివారం మధ్యాహ్నం ఆయన్ను అదుపులోకి తీసుకుని నెల్లూరు డీటీసీకి తరలించారు. సమాచారం అందుకున్న మాజీ మంత్రి డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ యాదవ్, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు డైకస్‌ రోడ్డులోని కాకాణి గృహానికి తరలి వస్తున్నారు.   
 


అధికార దుర్వినియోగానికి పరాకాష్ట 
గత ప్రభుత్వ హయాంలో రుస్తుం మైన్స్‌లో అక్రమ మైనింగ్‌ జరుగుతోందంటూ అప్పటి టీడీపీ నేత, ప్రస్తుత సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో మైనింగ్‌ శాఖ జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ చేసింది. ఆ మైన్‌లో క్వార్ట్‌జ్, పల్స్‌పర్, మిక్స్‌డ్‌ మైకా 1050 మెట్రిక్‌ టన్నులు నిల్వ ఉందని, అక్కడ అక్రమ మైనింగే జరగలేదని నివేదిక ఇచ్చింది. 

ప్రభుత్వం మారడంతో స్థానిక ఎమ్మెల్యే, కూటమి పెద్దలు కాకాణిని టార్గెట్‌ చేసి, అక్రమంగా మైనింగ్‌ జరిగిందంటూ బాలాజీ నాయక్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయించారు. వాస్తవంగా ఆ మైన్‌లో జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ చేసి నివేదిక ఇచ్చిన వారిలో ప్రస్తుతం ఫిర్యాదు చేసిన మైనింగ్‌ శాఖ ఇన్‌చార్జ్‌ డీడీ కూడా ఉండడం విశేషం. అధికార దుర్వినియోగం జరిగిందనేందుకు ఇంత కంటే నిదర్శనం అవసరమా?   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement