
అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా
టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అరాచకం
నలుగురు ఫారెస్ట్ సిబ్బంది కిడ్నాప్.. అర్ధరాత్రి విడుదల.. అటవీ వాహనాన్ని తానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యేపై అటవీ శాఖ సిబ్బంది ఫిర్యాదు
దాడిని ఉపేక్షించేది లేదన్న అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్.. ఎమ్మెల్యే, అతడి అనుచరులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారుల సంఘం డిమాండ్
సాక్షి ప్రతినిధి, కర్నూలు/యర్రగొండపాలెం/పెద్దదోర్నాల: శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మద్యం మత్తులో అరాచకం సృష్టించారు. తాను ఎక్కడ ఉన్నానో, ఏం చేస్తున్నానో అనే కనీస స్పృహ లేకుండా అటవీ సిబ్బందిని కిడ్నాప్ చేసి, వారిపై దాడికి దిగారు. మద్యం సేవించి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం అతిథి గృహంలో బసచేసి దిగజారి ప్రవర్తించారు. దీనికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దోర్నాల–శ్రీశైలం ఘాట్‌రోడ్డు రాత్రి 9 గంటలకు మూసేస్తారు.
ఉదయం 6 గంటలకు తిరిగి వాహనాలను అనుమతిస్తారు. శ్రీశైలంలోని శిఖరం వద్ద కూడా ఇదే సమయాన్ని అటవీ అధికారులు పాటిస్తారు. మంగళవారం రాత్రి ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రామానాయక్, బీట్‌ఆఫీసర్లు మోహన్‌కుమార్, గురవయ్య, డ్రైవర్ కరీం రాత్రి గస్తీ చేపట్టారు. చిన్నారుట్ల బీట్ సమీపంలో శిఖరం చెక్‌పోస్టు సమీపంలో రెండు వాహనాలు రోడ్డుపై ఆగి ఉండటాన్ని గమనించి హారన్ కొడుతూ వాటివద్దకు వెళ్లినా వాహనాలు కదల్లేదు. ఆ వాహనాల్లో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తన అనుచరులతో ఉండటాన్ని చూసి ఎమ్మెల్యేకు సెల్యూట్ చేశారు.
మద్యం మత్తులో ఊగిపోతున్న ఎమ్మెల్యే తన వాహనాల వద్దకు వచ్చి హారన్ కొట్టడంపై అటవీ సిబ్బందిపై బూతులతో రెచి్చపోయారు. ‘మీరంతా ప్రకాశం జిల్లా ఫారెస్టోళ్లు. శ్రీశైలం నా పరిధి. ఇక్కడ సిబ్బంది వద్దకు వచ్చి డబ్బులు తీసుకుని వాహనాలు పంపిస్తూ నాకు చెడ్డపేరు తెస్తారా?’ అంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. గడువు దాటిన తర్వాత కూడా శిఖరం చెక్‌పోస్టు నుంచి వాహనాలను ఎమ్మెల్యే ముందుకు పంపించారు.
‘ఇది టైగర్ జోన్. వాహనాలను పంపకూడదు’ అని అటవీ సిబ్బంది చెబుతున్నా ఎమ్మెల్యే వినిపించుకోలేదు. శిఖరం తమ పరిధిలోకి రాదని, ఆత్మకూరు రేంజ్ పరిధిలోకి వస్తుందని, తమకు సంబంధం లేదని చెబుతున్నా వినిపించుకోకుండా వారిపై చేయి చేసుకున్నారు. అటవీ సిబ్బంది ఐడీ, ఆధార్ కార్డులు, పర్సులను ఎమ్మెల్యే అనుచరులు లాగేసుకున్నారు. అటవీ అధికారుల వాహనంలో ఇద్దరు సిబ్బందిని, తన వాహనంలో మరో ఇద్దరు అటవీ సిబ్బందిని బలవంతంగా కూర్చోబెట్టారు.
అటవీ వాహనాన్ని తానే డ్రైవ్ చేసుకుని సిబ్బందిని కిడ్నాప్ చేసి శ్రీశైలంలోని ఓ అతిథి గృహంలో నిర్బంధించారు. అక్కడికి జనసేన నాయకుడు అశోక్‌కుమార్, ఎమ్మెల్యే అనుచరుడు రవుత్ చేరుకుని అటవీ అధికారులు, సిబ్బందిపై దాడికి దిగారు. అర్ధరాత్రి తర్వాత వారిని విడిచిపెట్టారు.
ఎమ్మెల్యేపై కేసు నమోదు
ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు మార్కాపురం డీఎఫ్‌ఓకు వివరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేతోపాటు దాడి చేసిన వారిలో జనసేన నాయకుడు ఉన్నారని చెప్పారు. దీనిపై అటవీశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అని తొలుత భయపడ్డారు. చివరకు ఎమ్మెల్యే దాడి చేసిన దృశ్యాలతో పాటు ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రభుత్వ పెద్దల సూచనతో శ్రీశైలం వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో అటవీ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, జనసేన నేత అశోక్‌పై కేసు నమోదు చేశారు.

మద్యం సేవించి శ్రీశైలంలో బస!
శ్రీశైలంలో మద్యపానం పూర్తిగా నిషేధం. కానీ.. ఎమ్మెల్యే, వారి అనుచరులు పూటుగా మద్యం సేవించి అటవీ సిబ్బందిపై బూతులతో విరుచుకుపడి, దాడి చేయడమే కాకుండా శ్రీశైలంలోని ఓ అతిథిగృహంలో బస చేశారు. ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే, అదీ తన సొంత నియోజకవర్గం శ్రీశైలంలో మద్యం మత్తులో బస చేయడాన్ని భక్తులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తానని చెప్పే అటవీశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ తన సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి చేయడం, మద్యం సేవించి శ్రీశైలంలో బస చేయడంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే చర్చ జరుగుతోంది.
ఉపేక్షించేది లేదు: అటవీశాఖ డీడీ
తమ సిబ్బందిపై దాడి చేసిన వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని ప్రకాశం జిల్లా మార్కాపురం అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సందీప్ కృపాకర్ పేర్కొన్నారు. తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి శ్రీశైలంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, ఆయన అనుచరులు అటవీశాఖ సిబ్బందిపై దాడి ఘటనను ఆయన ఖండించారు.
ఇటువంటి దాడులకు పాల్పడటం సరైన పద్ధతి కాదన్నారు. బాధిత సిబ్బంది శ్రీశైలం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నారని, ఆ ఫిర్యాదుతో పాటు తాము శాఖాపరంగా విచారణ జరుపుతామన్నారు. బాధితుల్లో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు చెందిన వారున్నారని, దోషులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతోపాటు దాడులు, కిడ్నాప్, దోపిడీ లాంటి కేసులు నమోదయ్యే అవకాశాలు ఉంటాయన్నారు.
తక్షణం చర్యలు తీసుకోవాలి: ఫారెస్ట్ అధికారుల సంఘం
అటవీ శాఖాధికారిపైన, సిబ్బందిపైన దాడికి పాల్పడిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, ఆయన అనుచరులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ మార్కాపురం ప్రాంత అధ్యక్షుడు పి.కరీముల్లా డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఫారెస్ట్ అధికారి కార్యాలయంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి విధులు నిర్వర్తిస్తున్న అటవీ శాఖ నెక్కంటి డిప్యూటీ రేంజ్ అధికారి డి.రామానాయక్, ఎఫ్‌ఎస్‌ఓ జె.మోహన్‌కుమార్, ఎఫ్‌బీఓ టీకే గురువయ్య, డ్రైవర్ షేక్ కరీముల్లాను శ్రీశైలం శిఖరం వద్ద అటకాయించి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, దాదాపు 30 మంది అనుచరులు దాడి చేశారన్నారు.
సిబ్బందిని వాహనంలో కిడ్నాప్ చేసి తీవ్ర హింసలకు గురిచేశారని ఆరోపించారు. సిబ్బంది వద్ద ఉన్న వాకీటాకీలు, మొబైల్ ఫోన్లు, నగదు, వ్యక్తిగత వస్తువులు కూడా అపహరించారని వివరించారు. తెల్లవారుజామున 4 గంటలకు ఫారెస్ట్ సిబ్బందిని విడిచి పెట్టారని, దాడికి గురైన వారంతా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారేనని ఆయన తెలిపారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్ తక్షణమే స్పందించాలని, సీఎం చంద్రబాబు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
రాజశేఖర్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని, దాడికి పాల్పడిన వారు తమ సిబ్బందికి క్షమాపణ చెప్పాలని, వారికి చట్టపరమైన శిక్ష పడేవరకు తాము విధులను బహిష్కరిస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో సంఘం సభ్యులు డి.శివశంకర్, జె.ఫిలిప్, జి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.