ఉద్యోగులకు బకాయిలు లేవు

Finance Minister Buggana in Legislative Council - Sakshi

పీఎఫ్, డీఏ బకాయిలు మాత్రమే కొంతమేర పెండింగ్‌లో ఉన్నాయి

శాసనమండలిలో ఆర్థిక మంత్రి బుగ్గన ప్రకటన 

సభ్యుల ప్రశ్నలకు పలువురు మంత్రుల సమాధానాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగుల రెగ్యులర్‌ జీతభత్యాలు, బకాయిలు, ఉద్యోగుల మెడికల్‌ రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య బీమా, ఏపీజీఎల్‌ఐ రుణాలు, కంప్యూటర్, హౌస్‌ బిల్డింగ్, కారు, బైక్, విద్య, పండుగ అడ్వాన్సులు, ప్రయాణ భత్యం, తదితరాలకు సంబంధించి ఎలాంటి బకాయిలు లేవని ఆరి్థక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శనివారం శాసనమండలి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ప్రకటించారు.

తాను ఈ ప్రకటన చేస్తున్న సమయానికి పింఛనుదారులకు సైతం పెన్షన్‌ బకాయిలు, ఏపీజీఎల్‌ఐ తుది చెల్లింపులు, జీఐఎస్, వైద్య ఖర్చుల చెల్లింపులు, ఆర్జిత సెలవులు నగదుగా మార్చుకోవడం, పారితో ష కాలు, పింఛన్ల మార్పిడికి సంబంధించి ఎలాంటి బకాయిలు పెండింగ్‌లో లేవని వెల్లడించారు. అయితే ఉద్యోగులకు సాధారణ భవిష్య నిధి, డీఏ, సరెండర్‌ లీవు బకాయిలు కొంత మేర మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అలాగే పింఛనుదారుల కరువు భత్యం బకాయిలు కొంత మేర చెల్లించాల్సి ఉందని చెప్పారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక అనేక ఉద్యోగ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ప్రసుత్త ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ మొత్తం సొంత ఆదాయం రూ.98,900 కోట్లు ఉందన్నారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛనుదారుల చెల్లింపులకే దాదాపు రూ.80 వేల కోట్లు ఖర్చవుతోందని వివరించారు. రాష్ట్ర ప్రజలందరి సంక్షేమం ప్రభుత్వ ప్రాధాన్యత అని.. ఇందులోనే ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కూడా కలిసి ఉందన్నారు. 

33.68 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ
మార్చి 15 నాటికి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ద్వారా 33,68,398.72 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యాన్ని సేకరించామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఇందుకు గాను 6,03,490 మంది రైతులకు రూ.6,834.87 కోట్లు చెల్లించామని చెప్పారు. 

అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణ పనులు వేగవంతం 
గుంటూరు జిల్లా అమరావతిలో గత ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతివనం పనులు నిధులు లేక జరగలేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు.

ఈ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం విజయవాడ స్వరాజ్‌ మైదానంలో రూ.268.46 కోట్లతో 125 అడుగుల డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. దీనికి సంబంధించి కొన్ని పనులు పూర్తికాగా మరికొన్ని పురోగతిలో ఉన్నా­యని చెప్పారు. కాగా, ఎస్సీ సబ్‌ ప్లాన్‌ కింద 2022–­23లో రూ.18,518.29 కేటాయించగా, ఫిబ్రవరి నాటికి రూ.13,112.36 కోట్లు ఖర్చు చేశామన్నారు. 

గత ప్రభుత్వంలో యాడ్స్‌ ఖర్చు రూ.449 కోట్లు 
గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో పత్రికల్లో ప్రకటనల కోసం రూ.449 కోట్లు ఖర్చు పెట్టిందని సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.128.38 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు.

టీడీపీ ప్రభుత్వంలో కొన్ని ఏజెన్సీల ద్వారా ప్రకటనలు ఇచ్చేవారని.. 15 శాతం కమీషన్లు ఇస్తేనే ఏజెన్సీలు పత్రికలకు ప్రకటనలు ఇచ్చేవన్నారు. తమ ప్రభుత్వం ఆ వృథాను అరికట్టి నేరుగా మంత్రిత్వ శాఖ ద్వారానే ప్రకటనలు ఇస్తోందని తెలిపారు.  

31,594 ఎకరాల వక్ఫ్‌ భూముల ఆక్రమణ 
రాష్ట్రంలో 65,783.83 ఎకరాల మేర వక్ఫ్‌ భూములు ఉన్నా­యని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా తెలిపారు. అందులో 31,594.20 ఎకరాలు గతంలో వివిధ ప్రభుత్వాల సమయంలో ఆక్రమణల పాలయ్యాయనని చెప్పారు. ఇలా కబ్జాలో ఉ­న్న వక్ఫ్‌ భూముల స్వా«దీనానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. 580.32 ఎకరాలను ఇప్ప­టివరకు స్వా«దీనం చేసుకున్నామని వివరించారు.

రహదారుల నిర్మాణం, మరమ్మతులకు   రూ.3,824.75 కోట్లు 
రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, మరమ్మతులకు రూ­.­3,824.75 కోట్లు వ్యయం చేశా­మని రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. రెండో దశ కింద రూ.1,816.50 కోట్లు కేటాయించామన్నారు. కాగా, ఏపీ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌లో జరిగిన కుంభకోణంపై 2021లో సీఐడీ కేసు నమోదు చేసిందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు. ఇప్పటికే నలుగురిని అరెస్ట్‌ కూడా చేసిందని సభ్యుల అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.  

ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడును స్వాగతించిన మండలి 
రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడాన్ని శాసనమండలి స్వాగతించింది. ప్రశ్నో­­త్తరాల కార్యక్రమంలో జరిగిన చర్చ సందర్భంగా పీడీఎఫ్‌ సభ్యులతో పాటు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వ విధానాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ 2023–24­లో విద్యకు రూ.30 వేల కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలో 60.6శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారన్నారు.

నాడు–నేడు కింద 56,572 పాఠ­శాల­లను సుమారు రూ.16వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా 25,552 అదనపు గదులను నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో సగటున ఏటా 72 లక్షల మంది విద్యార్థులు పాఠశాలల్లో చదువుతున్నారన్నారు. 2018–19­లో ప్రభుత్వ పాఠశా­లల్లో 36 లక్షల మంది విద్యార్థులు ఉంటే.. అది నాడు–నేడు తర్వాత 43 లక్షలు దాటిందని గుర్తు చేశారు.  
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top