చితికిన బతుకు.. చెదిరిన బంధం.. మూడేళ్ల వ్యవధిలో కుటుంబమంతా చిన్నాభిన్నం

Father And Son Died In A Road Accident In Kadapa District Yerraguntla - Sakshi

రోడ్డు ప్రమాదంలో తండ్రికొడుకుల దుర్మరణం

ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామ సమీపంలో ఉన్న పెన్నా నది బ్రిడ్జిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పోట్లదుర్తి గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు వై.మల్లికార్జునరెడ్డి(55), వై.మనోహర్‌రెడ్డి(27)  దుర్మరణం చెందారు. ఎర్రగుంట్ల పోలీసుల కథనం మే రకు.. పోట్లదుర్తి గ్రామానికి చెందిన మల్లికార్జునరెడ్డికి ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు కావడంతో వారు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. మల్లికార్జునరెడ్డి భార్య మూ డేళ్ల క్రితం కేన్సర్‌ వ్యాధితో మృతి చెందింది. మనోహర్‌రెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నారు. కరోనా కారణంగా పోట్లదుర్తిలోని ఇంటినుంచే విధులు నిర్వహిస్తున్నారు.  

ఆసుపత్రికి వెళ్తూ..:
మల్లికార్జునరెడ్డి గత కొంత కాలంగా పక్షవాతంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం తండ్రిని ప్రొద్దుటూరులోని ఆసుపత్రిలో చూపించేందుకు తన బైకుపై కూర్చోబెట్టుకుని బయలుదేరాడు. ఇంటి నుంచి కొద్ది దూరం రాగానే గ్రామ  సమీపంలోని పెన్నానది వంతెనపై ముందు వెళుతున్న టిప్పర్‌ను ఓవర్‌ టేక్‌ చేసి వెళ్లిపోయారు. ఇంతలోనే వెనుక నుంచి మరో టిప్పర్‌ అతి వేగంగా వచ్చి బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు.

విషయం తెలుసుకున్న ఎర్రగుంట్ల ఎస్‌ఐ కృష్ణయ్య హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోట్లదుర్తి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని చెల్లాచెదురుగా పడిన తండ్రీకొడుకుల మృతదేహాలను చూసి చలించిపోయారు. చేతికందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.     

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top