
తెల్లవారుజాము నుంచే క్యూలలో రైతన్నలు
తమకు రెండు కట్టలుకావాల్సిందేననిపట్టుబట్టిన అన్నదాతలు
కుదరదన్న అధికారులు.. పంపిణీ కేంద్రంలోకి దూసుకెళ్లిన రైతులు
పలుచోట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ అన్నదాతల ఆందోళన
విజయనగరం జిల్లాలో యూరియా కోసం రైతులు రోజంతా క్యూలోనే
సాక్షి, అమరావతి,మాడుగుల రూరల్, బుచ్చెయ్యపేట/దెందులూరు,రామభద్రపురం/పలాస: బస్తా యూరియా కోసం మండుటెండలో అన్నదాతలు నరకయాతన అనుభవించారు. అనకాపల్లి జిల్లా కేజే పురం శివారు తెలకలదీపం గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో శనివారం యూరియా పంపిణీ చేపడుతున్నట్టు తెలుసుకున్న రైతులు తెల్లవారుజామున 5 గంటల నుంచే ఆధార్, భూమి పాసుపుస్తకం, 1బీ జెరాక్స్ కాపీలను కేంద్రం వద్ద లైన్‌లో పెట్టారు. ఎండ మండుతున్నా క్యూలైన్‌లో వేచి ఉన్నారు.
యూరియా పంపిణీ ప్రారంభమవుతున్న సమయంలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు అక్కడకి వచ్చారు. ఈ క్రమంలో రైతులు తమకు 2 బస్తాలు కావాలని పట్టుబట్టారు. అయితే ప్రతి రైతుకు ఒక బస్తా మాత్రమే ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు మాకుమ్మడిగా కేంద్రంలోకి చొరబడి ఆందోళన చేశారు. పోలీసులు అక్కడికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. యూరియా అందరికీ అందకపోవడంతో రైతులు మండిపడ్డారు.
800 రైతులకు 150 బస్తాలే..
అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం రాజాం లో 800కి పైగా రైతులు ఉండగా 150 యూరియా బస్తాలే వచ్చాయి. దీంతో యూరియా దొరకదేమోననే ఆందోళనతో రైతు సేవా కేంద్రం వద్దకు అన్నదాతలు పరుగులు తీశారు. పేర్లు నమోదు కోసం రైతులంతా ఎగబడటంతో గందరగోళం తలెత్తింది. తహశీల్దార్ లక్ష్మి గ్రామానికి చేరుకుని రైతులకు సర్దిచెప్పారు. వచి్చన యూరియా కట్టలను కొంతమందికే ఇవ్వగలమని, మిగిలిన వారికి 2,3 రోజుల్లో ఇస్తామని చెప్పగా రైతులు నిరసన తెలిపారు.
112 మందికే ఇస్తే మిగిలినవారి సంగతేంటి?
యూరియా నిల్వలకు ఎటువంటి ఇబ్బందీ లేదని, సరిపడా ఉన్నాయని అంటూనే తమకు చుక్కలు చూపిస్తున్నారని ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలి రైతులు నిరసన తెలిపారు. శనివారం కొవ్వలి కో–ఆపరేటివ్ సొసైటీకి 12.30 టన్నుల కట్టల యూరియా వచ్చింది. వాటిలో 112 మందికి ఒక కట్ట,2 కట్టలు చొప్పున పంపిణీ చేశారు. 2.5 టన్నుల యూరియా కట్టలు సొసైటీలో నిల్వ ఉంచారు.
అప్పటికే 200 మందికి పైగా రైతులు సొసైటీకి వచ్చి యూరియా కావాలని అడిగితే జిల్లా అధికారులు బఫర్ స్టాక్ కింద సొసైటీలో ఉంచాలని ఆదేశాలిచ్చారని, ఇది అలాగే ఉంచాలని, వీటిని ఇవ్వడం కుదరదని చెప్పారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం యూరియా వస్తుందని, అది మిగిలిన రైతులకు అందజేస్తామని అధికారులు చెప్పారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు.
యూరియా..ఇవ్వండయ్యా!
ఒక్క బస్తా యూరియా కోసం విజయనగరం జిల్లా రామభద్రపురం మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రం వద్ద రైతులు శనివారం రోజంతా క్యూలో నిలుచున్నారు. టోకెన్లు ఉన్నవారికే ఆర్‌ఎస్‌కే సిబ్బంది ఒక్కో బస్తా యూరియా ఇచ్చారు. మిగిలినవారంతా ఉసూరుమంటూ వెనుదిరిగారు. అలాగే, శ్రీకాకుళం జిల్లా పలాస మండలం టెక్కలిపట్నం గ్రామ సచివాలయం వద్ద కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది.
టోకెన్లు ఒక చోట, ఎరువులు ఒక చోట పెట్టి కావాల్సిన రైతులకు మాత్రమే యూరియాను ఇస్తున్నారని మిగిలిన రైతులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో రైతు సేవా కేంద్రం ఉన్నా అక్కడ పంపిణీ పెట్టకుండా సచివాలయం వద్దనే టోకెన్లు ఇవ్వడంతో గందరగోళం ఏర్పడింది. ఎకరా పొలానికి కనీసం 3 బస్తాలు యూరియా కావాలని రైతులు డిమాండ్ చేస్తుండగా ఒక్క బస్తాతోనే సరిపెటే్టస్తుండటంపై అన్నదాతలు మండిపడుతున్నారు.
యూరియా దారి మళ్లింపుపై సమగ్ర విచారణ జరపాలి
ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి
యూరియా దారిమళ్లుతున్న వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనుకూల పత్రికల్లోనే యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్న వార్తలు వస్తున్నాయని విమర్శించారు.
జూన్ నాటికి 10 శాతం పంటలు సాగైతే.. 32 శాతం యూరియా అమ్మకాలు ఎలా జరుగుతాయని ఆయన ప్రశ్నించారు. పంటలు వెయ్యక ముందే ఈ యూరియా ఎవరు కొన్నారో నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం వరి, మొక్కజొన్నకు మాత్రమే యూరియా అవసరం ఉందని, వీటికీ డిమాండ్‌కు సరిపడా యూరియా సరఫరా చేయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు.