
విజయనగరం జిల్లాలోని ఓ ప్రైవేటు దుకాణం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు
విజయనగరం జిల్లాలో ప్రైవేటు దుకాణం వద్దే జాగారం
వేకువనే భారీగా బారులు తీరిన రైతులు
వన్–బి తెచ్చిన వారికే యూరియా అని మెలిక పెట్టడంతో ఆందోళన
సంతకవిటి: ఉమ్మడి విజయనగరం జిల్లా రైతులను యూరియా కష్టాలు వీడడం లేదు. ఆర్‌ఎస్‌కేలు, పీఏసీఎస్‌లు, ప్రైవేటు దుకాణాల వద్ద క్యూ కడుతూనే ఉన్నారు. నిద్రకూడా మానుకుని రాత్రుళ్లూ షాపుల వద్దే పడిగాపులు పడుతున్నారు. వేకువనే అక్కడే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. యూరియా కోసం ఇన్ని కష్టాలు ఎన్నడూ చూడలేదంటూ ఆవేదన చెందుతున్నారు. విజయనగరం జిల్లా సంతకవిటిలో ఓ ప్రైవేటు దుకాణం వద్ద బుధవారం రాత్రి 9 గంటల వరకు యూరియా కోసం క్యూకట్టిన రైతులు సరుకు అందకపోవడంతో నిరాశచెందారు.
గురువారం మళ్లీ పంపిణీ చేస్తామని దుకాణం యజమాని చెప్పడంతో రాత్రంతా రైతులు అక్కడే ఉండిపోయారు. దోమలతో జాగారం చేశారు. గురువారం వేకువనే ఇలా బారులుతీరారు. భారీగా బారులు తీరిన రైతులను చూసి యజమాని దుకాణం తెరిచేందుకు భయపడ్డారు. ఏఓ సి.బి.యశ్వంతరావు, పోలీసుల సమక్షంలో దుకాణం తెరిచి యూరియా పంపిణీ ప్రారంభించారు.
ఆధార్‌కార్డు, వన్–బి తెచ్చిన వారికే యూరియా ఇస్తామని చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. రాత్రి నుంచి దోమల్లో కాపలా ఉంటే ఇప్పుడు నిబంధనలు పెట్టడంపై వాగ్వాదానికి దిగారు. టోకెన్‌లు ఉన్న రైతులకు 444 బస్తాలు పంపిణీ చేయడంతో మిగిలిన రైతులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.
వ్యవసాయం మానేయాలా బాబూ..
నేను దివ్యాంగుడిని. క్యూలైన్‌లో నిల్చోగలనా? నేను వ్యవసాయం మానేయాలా బాబూ.. నేనేమి చేయాలి చెప్పండి. గత ప్రభుత్వంలో రైతుభరోసా కేంద్రాలకే యూరియా వచ్చేది. ఇప్పుడు బస్తా యూరియా కోసం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కనీసం ఒక బస్తా యూరియా కూడా అందలేదు. – గడే సీతారాం, దివ్యాంగుడు, రైతు, ముకుందపురం