
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి విషయంలో ఇప్పుడు సరికొత్త డ్రామాకు తెరలేపారు. ఇప్పుడు తీసుకున్న భూములన్నీ చాలడం లేదు.. అన్నిటికీ కేటాయించేయగా.. అన్నీ కట్టేయగా.. మహా అయితే రెండు వేల ఎకరాలు మాత్రమే మిగలబోతున్నాయి. ఇంత పెద్ద నగరం కట్టడానికి ఆ భూమి ఏమూలకూ చాలదు. ఇంకా 44 వేల ఎకరాలను సేకరించి మహా రాజధాని కడతాం అని.. చంద్రబాబునాయుడు ఈ కొత్త డ్రామాకు స్క్రిప్టు సిద్ధం చేశారు. కొత్తగా 44 వేల ఎకరాలు లాండ్ పూలింగ్ ద్వారా సేకరించడానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రకటనలు కూడా వస్తున్నాయి.
అయితే.. ఆయన సొంత వర్గానికి చెందిన అమరావతి ప్రాంత రైతులే ఈ ఆలోచన మీద ఆగ్రహంతో నిప్పులు కక్కుతున్నారు. తా దూరను కంత లేదు.. మెడకో డోలు అన్నట్టుగా.. ఆల్రెడీ రాజధానిగా నోటిఫై చేసిన భూముల్లో ఏడాదిగా ఒక్క పని మొదలుపెట్టలేకపోయారు గానీ.. ఇప్పుడు ఇంకో 44 వేల ఎకరాలు అంటున్నారు. తమ వద్ద నుంచి సేకరించిన భూములలో తమకు హామీ ఇచ్చిన రాజధాని నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదాకా, నగర విస్తరణ పేరిట కొత్త భూసేకరణ/ పూలింగ్ ప్రయత్నాలను నిలుపుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ.. అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.
అమరావతి రాజధానిని ఇప్పుడు చంద్రబాబునాయుడే వంచించడానికి పూనుకున్నారు. అమరావతి ని రాజధానిగా పూర్తిగా అభివృద్ధి చేసి, ఆ ప్రాంతంలో.. భూములు ఇచ్చిన రైతులకు దామాషా ప్రకారంగా భూములకంటె విలువైన స్థలాలుగా మార్చి ఇస్తాం అని చంద్రబాబునాయుడు లాండ్ పూలింగ్ సందర్భంగా చాలా చాలా మాటలు చెప్పారు. ప్రజలందరూ కూడా దానిని నమ్మారు. నమ్మి ఇచ్చిన వారు కొందరైతే.. బెదిరించి ప్రలోభ పెట్టి బలవంతంగా మరికొందరితో కూడా భూములు లాక్కున్నారు. మొత్తానికి 54 వేల ఎకరాల వరకు సమీకరించారు. తొలి అయిదేళ్ల పాలనలో కేవలం డిజైన్ల పేరుతో వందల కోట్ల రూపాయలు తగలేసి.. బొమ్మ చూపించి మాయచేస్తూ వచ్చారు. ప్రజలు నమ్మకం లేక ఓడించిన తర్వాత.. జగన్ ప్రభుత్వం ఏర్పడింది.
మంచి పాలనలో అధికారవికేంద్రీకరణ ఉండాలనే ఉద్దేశంతో జగన్ ఆలోచన చేసి, శాసన రాజధానిగా అమరావతిని ప్రకటించారు తప్ప.. దానిని వ్యతిరేకించలేదు. అయితే.. చంద్రబాబునాయుడు అమరావతి రైతులను రెచ్చగొట్టి వారితో హైకోర్టులో కేసులు వేయించి.. అసలు ఏ పనీ ముందుకు సాగకుండా అడ్డుపడ్డారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటిదాకా ఆ ప్రాంత క్లీనింగ్ పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టారు. నిర్మాణ పనులు ఇంకా మొదలు కూడా పెట్టలేదు. అప్పుడే మరో 44 వేల ఎకరాలు రాజధాని విస్తరణకు సేకరిస్తాం అంటూ మరో పాట అందుకోవడంపై అమరావతి రైతులు రగిలిపోతున్నారు.
ముందు మాకు మాట ఇచ్చిన విధంగా ఈ 54 వేల ఎకరాల రాజధాని పూర్తిగా అభివృద్ధి చేసి.. మాకు కేటాయించిన స్థలాలు మాకు అప్పగించిన తర్వాతే.. మరో పూలింగ్ కు వెళ్లాలని వారు మొండికేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇష్టారాజ్యంగా తమను పక్కన పెట్టేసి, ఇంకో నగరం మాయతో తిరగకుండా అడ్డుకోవడానికి అమరావతి రైతులు తమ స్వబుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వారి డిమాండు సహేతుకమైనదే గనుక.. కోర్టులో అనుకూల తీర్పు వస్తుందని భావిస్తున్నారు. 44 వేల ఎకరాలంటూ చంద్రబాబు ఎంచుకున్న కొత్త డ్రామాకు ఆదిలోనే బ్రేకులు పడేప్రమాదం కనిపిస్తోంది. సొంత సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ.. తమ పట్ల చంద్రబాబు తలపెడుతున్న ద్రోహాన్ని జీర్ణించుకోలేక అమరావతి రైతులు కోర్టు గడప తొక్కడానికి సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.
..ఎం. రాజేశ్వరి