lands Capture
-
విస్తరణ డ్రామాపై అమరావతి రైతులు కోర్టుకు !
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి విషయంలో ఇప్పుడు సరికొత్త డ్రామాకు తెరలేపారు. ఇప్పుడు తీసుకున్న భూములన్నీ చాలడం లేదు.. అన్నిటికీ కేటాయించేయగా.. అన్నీ కట్టేయగా.. మహా అయితే రెండు వేల ఎకరాలు మాత్రమే మిగలబోతున్నాయి. ఇంత పెద్ద నగరం కట్టడానికి ఆ భూమి ఏమూలకూ చాలదు. ఇంకా 44 వేల ఎకరాలను సేకరించి మహా రాజధాని కడతాం అని.. చంద్రబాబునాయుడు ఈ కొత్త డ్రామాకు స్క్రిప్టు సిద్ధం చేశారు. కొత్తగా 44 వేల ఎకరాలు లాండ్ పూలింగ్ ద్వారా సేకరించడానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రకటనలు కూడా వస్తున్నాయి. అయితే.. ఆయన సొంత వర్గానికి చెందిన అమరావతి ప్రాంత రైతులే ఈ ఆలోచన మీద ఆగ్రహంతో నిప్పులు కక్కుతున్నారు. తా దూరను కంత లేదు.. మెడకో డోలు అన్నట్టుగా.. ఆల్రెడీ రాజధానిగా నోటిఫై చేసిన భూముల్లో ఏడాదిగా ఒక్క పని మొదలుపెట్టలేకపోయారు గానీ.. ఇప్పుడు ఇంకో 44 వేల ఎకరాలు అంటున్నారు. తమ వద్ద నుంచి సేకరించిన భూములలో తమకు హామీ ఇచ్చిన రాజధాని నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదాకా, నగర విస్తరణ పేరిట కొత్త భూసేకరణ/ పూలింగ్ ప్రయత్నాలను నిలుపుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ.. అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అమరావతి రాజధానిని ఇప్పుడు చంద్రబాబునాయుడే వంచించడానికి పూనుకున్నారు. అమరావతి ని రాజధానిగా పూర్తిగా అభివృద్ధి చేసి, ఆ ప్రాంతంలో.. భూములు ఇచ్చిన రైతులకు దామాషా ప్రకారంగా భూములకంటె విలువైన స్థలాలుగా మార్చి ఇస్తాం అని చంద్రబాబునాయుడు లాండ్ పూలింగ్ సందర్భంగా చాలా చాలా మాటలు చెప్పారు. ప్రజలందరూ కూడా దానిని నమ్మారు. నమ్మి ఇచ్చిన వారు కొందరైతే.. బెదిరించి ప్రలోభ పెట్టి బలవంతంగా మరికొందరితో కూడా భూములు లాక్కున్నారు. మొత్తానికి 54 వేల ఎకరాల వరకు సమీకరించారు. తొలి అయిదేళ్ల పాలనలో కేవలం డిజైన్ల పేరుతో వందల కోట్ల రూపాయలు తగలేసి.. బొమ్మ చూపించి మాయచేస్తూ వచ్చారు. ప్రజలు నమ్మకం లేక ఓడించిన తర్వాత.. జగన్ ప్రభుత్వం ఏర్పడింది. మంచి పాలనలో అధికారవికేంద్రీకరణ ఉండాలనే ఉద్దేశంతో జగన్ ఆలోచన చేసి, శాసన రాజధానిగా అమరావతిని ప్రకటించారు తప్ప.. దానిని వ్యతిరేకించలేదు. అయితే.. చంద్రబాబునాయుడు అమరావతి రైతులను రెచ్చగొట్టి వారితో హైకోర్టులో కేసులు వేయించి.. అసలు ఏ పనీ ముందుకు సాగకుండా అడ్డుపడ్డారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటిదాకా ఆ ప్రాంత క్లీనింగ్ పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టారు. నిర్మాణ పనులు ఇంకా మొదలు కూడా పెట్టలేదు. అప్పుడే మరో 44 వేల ఎకరాలు రాజధాని విస్తరణకు సేకరిస్తాం అంటూ మరో పాట అందుకోవడంపై అమరావతి రైతులు రగిలిపోతున్నారు. ముందు మాకు మాట ఇచ్చిన విధంగా ఈ 54 వేల ఎకరాల రాజధాని పూర్తిగా అభివృద్ధి చేసి.. మాకు కేటాయించిన స్థలాలు మాకు అప్పగించిన తర్వాతే.. మరో పూలింగ్ కు వెళ్లాలని వారు మొండికేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇష్టారాజ్యంగా తమను పక్కన పెట్టేసి, ఇంకో నగరం మాయతో తిరగకుండా అడ్డుకోవడానికి అమరావతి రైతులు తమ స్వబుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వారి డిమాండు సహేతుకమైనదే గనుక.. కోర్టులో అనుకూల తీర్పు వస్తుందని భావిస్తున్నారు. 44 వేల ఎకరాలంటూ చంద్రబాబు ఎంచుకున్న కొత్త డ్రామాకు ఆదిలోనే బ్రేకులు పడేప్రమాదం కనిపిస్తోంది. సొంత సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ.. తమ పట్ల చంద్రబాబు తలపెడుతున్న ద్రోహాన్ని జీర్ణించుకోలేక అమరావతి రైతులు కోర్టు గడప తొక్కడానికి సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది...ఎం. రాజేశ్వరి -
అగ్రిగోల్డ్ భూములు అన్యాక్రాంతం!
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసు దర్యాప్తులో సీఐడీ నిద్రమత్తులో జోగుతోంది. వేల ఎకరాలు చే తులు మారుతున్నా పట్టించుకోకపోవడమే కాకుం డా గతంలో అటాచ్ చేసిన ఆస్తులను కాపాడటంలోనూ విఫలమవుతోంది. హైదరాబాద్‌లో అగ్రిగోల్డ్‌కు చెందిన ఓ భవనాన్ని కబ్జాదారులు కూల్చేసి దర్జాగా మరో నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమవుతుండటం ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. నాలుగేళ్ల క్రితం జప్తు: హైదరాబాద్‌లోని కాప్రాలో అగ్రిగోల్డ్ ఫుడ్స్ అండ్ ఫారమ్స్ లిమిటెడ్‌కు 333 గజాల స్థలంలో ఓ భవనం ఉంది. దీన్ని సీఐడీ 2018లోనే జప్తు చేసింది. అయితే గతేడాది 2021 మేలో ఒక వ్యక్తి కబ్జాకు విఫలమయత్నం చేశాడు. అప్పుడు అగ్రిగోల్డ్ డైరెక్టర్లలో ఒకరైన అవ్వా సీతారామారావు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. కబ్జా వ్యవహారం, కేసు నమోదుపై 2021, మే 21న మల్కాజ్గిరి డీసీపీ సీఐడీకి ఓ లేఖ రాశారు. అగ్రిగోల్డ్ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సంబంధించిన జీవోలతోపాటు వివరాల ప్రతిని ఇవ్వాలని, తమ జోన్లో అగ్రిగోల్డ్ ఆస్తుల్లో ఒక భవనం కబ్జాపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు సీఐడీకి ఆ డీసీపీ రాసిన లేఖగానీ, ఆస్తి కబ్జా సమాచారం గానీ లేదు. గతేడాది దర్యాప్తు అధికారి ఆ వ్యవహారంపై దృష్టి పెట్టకపోవడం, అగ్రిగోల్డ్ డైరెక్టర్లు ఇచ్చిన సమాచారంతో కనీసం క్షేత్రస్థాయిలోనూ తనిఖీ చేయకపోవడం వివాదాస్పదమవుతోంది. దర్జాగా భవనం కూల్చి...: ఈసీఐఎల్‌లో ఉన్న అగ్రిగోల్డ్‌కు చెందిన భవనాన్ని కూల్చేసి బోరు వేసి న ఓ వ్యక్తిపై అగ్రిగోల్డ్ బాధిత సంఘం ‘సాక్షి’కి సమాచారం ఇచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. అగ్రిగోల్డ్ వ్యవహారంపై వరుస కథనాలు అందిసు ్తన్న ‘సాక్షి’కి బాధితులు ఆ ఆస్తికి సంబంధించిన అన్ని వివరాలు అందజేశారు. ఈ విషయాన్ని సీఐడీ ఉన్నతాధికారులకు తెలపగా అప్పుడు రంగంలోకి దిగారు. నెల రోజుల క్రితం ఆ స్థలంలో ఉన్న భవ నం కూల్చేసి బోర్ వేసినట్టు బాధితులు గుర్తించా రు. ఆ ఫొటోలను సీఐడీకి పంపగా కొత్తగా వచ్చిన దర్యాప్తు అధికారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి సంబంధిత స్థలం సీఐడీ జప్తులో ఉందని, కబ్జాకు యత్నిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుందంటూ ఎట్టకేలకు బోర్డు ఏర్పాటు చేశారు. జప్తు చేసిన వాటిని కాపాడాలి.. అగ్రిగోల్డ్‌కు చెందిన బినామీ ఆస్తులను ఎలాగూ గుర్తించని సీఐడీ అధికారులు, కనీసం జప్తులో ఉన్న ఆస్తులనైనా కాపాడాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కష్టపడి సంపాధించిన సొమ్మును అగ్రిగోల్డ్‌లో పెట్టి మోసపోయామని... ఇప్పటికైనా సీఐడీ అధికారులు జప్తు చేసిన ఆస్తుల పరిస్థితి ఏమిటి? అవి భద్రంగా ఉన్నాయా లేకా అన్యాక్రాంతమయ్యాయా అనే అంశాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. మరోవైపు ఈ విషయంలో స్థానిక పోలీసుల నుంచి లేఖలు వచ్చినా అవి దర్యాప్తు అధికారి వరకు రాకపోవడంపై ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కనీసం అటాచ్ చేసిన ఆస్తుల పరిస్థితిపై దృష్టి పెట్టకపోవడంపై గత దర్యాప్తు అధికారి నిర్లక్ష్యం ఉన్నట్లు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆ అధికారిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
ఖాకీ జాగా.. అయినా పాగా!
► ఆక్రమణలకు గురవుతున్న పోలీస్ శాఖ స్థలాలు ► వినుకొండ, మాచర్ల, రేపల్లెలో అన్యాక్రాంతం ► గుర్తించిన రూరల్ ఎస్పీ తొలిగించాలంటూ ఆదేశాలు సార్.. దౌర్జన్యంగా నా ఇంటిని ఆక్రమించారు... నా భూమిని రియల్ మాఫియా కబ్జా చేసింది...న్యాయం చేయండి.. అంటూ నిత్యం బాధితులు పోలీసులను ఆశ్రయించడం చూస్తూనే ఉంటాం. ఇదంతా మామూలే అనుకుంటాం. కానీ.. పోలీసు శాఖకు చెందిన స్థలాలే ఆక్రమణకు గురవుతున్నాయంటే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. స్వయానా పోలీసు ఉన్నతాధికారులే ఈ విషయాన్ని గుర్తించారు. ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని ఆదేశాలిచ్చారు. పోలీసులు తమ స్థలాలను ఎలా రక్షించుకుంటారో వేచి చూడాలి.. సాక్షి, గుంటూరు : జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పోలీస్‌స్టేషన్ పాత భవనాలు, సిబ్బంది క్వార్టర్స్ నిర్మించిన స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. కోట్ల విలువచేసే స్థలాలు ఆక్రమణల చెరలోకి వెళ్లాయి. ముఖ్యం గా శిథిలావస్థకు చేరిన పోలీస్ క్వార్టర్స్‌లో సిబ్బంది ఖాళీ చేసి వెళ్లిపోవడంతో ఎవరూ లేరుకదా అని కొందరు వీటిని ఆక్రమించేశారు. అనేక ఏళ్లుగా ఈ ఆక్రమణలు కొనసాగుతున్నా అప్పటి పోలీసు అధికారులు చూసీచూడనట్లు వదిలేశారు. తర్వాత వచ్చిన పోలీసులు మనకెందుకే గొడవ.. అన్ని మిన్నకున్నారు. పోలీస్ స్థలాలు కబ్జాకు గురవుతున్నా కనీసం ఫిర్యాదు చేసేవారు లేకపోవడం, పోనీ మనశాఖ స్థలాలే కదా సుమోటోగా కేసులు నమోదు చేద్దాం అనే ఆలోచన ఏ ఒక్క పోలీస్ అధికారికీ రాకపోవడం శోచనీయం. ఎస్పీ పర్యటనతో వెలుగులోకి.. గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ జిల్లాలో పోలీసుల పనితీరు తెలుసుకునేందుకు ఇటీవల విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలో మాచర్ల, కారంపూడి, వినుకొండ, రేపల్లెతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో పోలీస్‌శాఖ స్థలాలు ఆక్రమణలో ఉన్నట్లు ఆయన గుర్తించినట్లు తెలిసింది. దీంతో అక్కడి ఆక్రమణదారులను ఖాళీ చేయించి స్థలాలను స్వాధీనం చేసుకోవాలని అక్కడి పోలీస్ అధికారులను ఆయన ఆదేశించినట్లు సమాచారం. ఆక్రమణలకు గురైన స్థలాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సేకరించినట్లు తెలిసింది. స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లను బయటకుతీసి ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఆక్రమణల్లో ఉన్న పోలీస్ స్థలాలను వెనక్కు తీసుకుని సిబ్బందికి క్వార్టర్స్ నిర్మించి తిరిగి వాటిని వినియోగంలోకి తేవాలని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఐదు పాత పోలీస్స్టేషన్ల స్థానంలో నూతన భవనాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాయి. ఆక్రమణలను తొలగిస్తే స్థలం సమకూరుతుందని అధికారులు భావిస్తున్నారు.