అగ్రిగోల్డ్‌ భూములు అన్యాక్రాంతం! 

AgriGold Lands Alienated In Telangana - Sakshi

అటాచ్‌ చేసిన భూముల కబ్జాకు యత్నం

భవనం కూల్చివేసి బోర్‌ వేసిన కబ్జాదారులు

స్థానిక పోలీసులు లేఖ రాసినా పట్టని సీఐడీ

సాక్షి సమాచారంతో రంగంలోకి దిగిన సీఐడీ

సాక్షి, హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ కేసు దర్యాప్తులో సీఐడీ నిద్రమత్తులో జోగుతోంది. వేల ఎకరాలు చే తులు మారుతున్నా పట్టించుకోకపోవడమే కాకుం డా గతంలో అటాచ్‌ చేసిన ఆస్తులను కాపాడటంలోనూ విఫలమవుతోంది. హైదరాబాద్‌లో అగ్రిగోల్డ్‌కు చెందిన ఓ భవనాన్ని కబ్జాదారులు కూల్చేసి దర్జాగా మరో నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమవుతుండటం ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది.  

నాలుగేళ్ల క్రితం జప్తు: హైదరాబాద్‌లోని కాప్రాలో అగ్రిగోల్డ్‌ ఫుడ్స్‌ అండ్‌ ఫారమ్స్‌ లిమిటెడ్‌కు 333 గజాల స్థలంలో ఓ భవనం ఉంది. దీన్ని సీఐడీ 2018లోనే జప్తు చేసింది. అయితే గతేడాది 2021 మేలో ఒక వ్యక్తి కబ్జాకు విఫలమయత్నం చేశాడు. అప్పుడు అగ్రిగోల్డ్‌ డైరెక్టర్‌లలో ఒకరైన అవ్వా సీతారామారావు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. కబ్జా వ్యవహారం, కేసు నమోదుపై 2021, మే 21న మల్కాజ్‌గిరి డీసీపీ సీఐడీకి ఓ లేఖ రాశారు.

అగ్రిగోల్డ్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సంబంధించిన జీవోలతోపాటు వివరాల ప్రతిని ఇవ్వాలని, తమ జోన్‌లో అగ్రిగోల్డ్‌ ఆస్తుల్లో ఒక భవనం కబ్జాపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు సీఐడీకి ఆ డీసీపీ రాసిన లేఖగానీ, ఆస్తి కబ్జా సమాచారం గానీ లేదు. గతేడాది దర్యాప్తు అధికారి ఆ వ్యవహారంపై దృష్టి పెట్టకపోవడం, అగ్రిగోల్డ్‌ డైరెక్టర్లు ఇచ్చిన సమాచారంతో కనీసం క్షేత్రస్థాయిలోనూ తనిఖీ చేయకపోవడం వివాదాస్పదమవుతోంది.  

దర్జాగా భవనం కూల్చి...: ఈసీఐఎల్‌లో ఉన్న అగ్రిగోల్డ్‌కు చెందిన భవనాన్ని కూల్చేసి బోరు వేసి న ఓ వ్యక్తిపై అగ్రిగోల్డ్‌ బాధిత సంఘం ‘సాక్షి’కి సమాచారం ఇచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై వరుస కథనాలు అందిసు ్తన్న ‘సాక్షి’కి బాధితులు ఆ ఆస్తికి సంబంధించిన అన్ని వివరాలు అందజేశారు. ఈ విషయాన్ని సీఐడీ ఉన్నతాధికారులకు తెలపగా అప్పుడు రంగంలోకి దిగారు.

నెల రోజుల క్రితం ఆ స్థలంలో ఉన్న భవ నం కూల్చేసి బోర్‌ వేసినట్టు బాధితులు గుర్తించా రు. ఆ ఫొటోలను సీఐడీకి పంపగా కొత్తగా వచ్చిన దర్యాప్తు అధికారి ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ చేసి సంబంధిత స్థలం సీఐడీ జప్తులో ఉందని, కబ్జాకు యత్నిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాల్సి ఉంటుందంటూ ఎట్టకేలకు బోర్డు ఏర్పాటు చేశారు.

జప్తు చేసిన వాటిని కాపాడాలి.. 
అగ్రిగోల్డ్‌కు చెందిన బినామీ ఆస్తులను ఎలాగూ గుర్తించని సీఐడీ అధికారులు, కనీసం జప్తులో ఉన్న ఆస్తులనైనా కాపాడాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. కష్టపడి సంపాధించిన సొమ్మును అగ్రిగోల్డ్‌లో పెట్టి మోసపోయామని... ఇప్పటికైనా సీఐడీ అధికారులు జప్తు చేసిన ఆస్తుల పరిస్థితి ఏమిటి? అవి భద్రంగా ఉన్నాయా లేకా అన్యాక్రాంతమయ్యాయా అనే అంశాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. మరోవైపు ఈ విషయంలో స్థానిక పోలీసుల నుంచి లేఖలు వచ్చినా అవి దర్యాప్తు అధికారి వరకు రాకపోవడంపై ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కనీసం అటాచ్‌ చేసిన ఆస్తుల పరిస్థితిపై దృష్టి పెట్టకపోవడంపై గత దర్యాప్తు అధికారి నిర్లక్ష్యం ఉన్నట్లు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆ అధికారిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించే అవకాశం ఉన్నట్టు సమాచారం.   
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top