35ఏళ్లపాటు ఉచిత విద్యుత్‌కు ఢోకాలేదు | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యుత్ పొందడం రైతు హక్కు

Published Sat, Sep 12 2020 1:45 PM

Farmers Have Right To Get Quality Eelectricity Says dokka Varaprasad - Sakshi

సాక్షి, గుంటూరు:  వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ పొందడం రైతుల హక్కు అని మాజీమంత్రి, శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌ పథకాన్ని మరింత మెరుగైన రీతిలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని చెప్పారు. వచ్చే 35ఏళ్ల వరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కు ఢోకా ఉండదని స్పష్టం చేశారు. శనివారం స్థానిక రామన్నపేటలోని ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ కార్యాలయంలో జనచైతన్య వేదిక ఆధ్వర్యాన నిర్వహించిన విలేకరుల సమావేశంలో డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడారు. ఉచితవిద్యుత్ పథకానికి నగదు బదిలీ చేయడంతో ప్రభుత్వానికి బాధ్యత, రైతుకు జవాబు దారీతనం వస్తుందన్నారు. పగటిపూట నాణ్యమైన విద్యుత్ పొందడం వ్యవసాయం చేసే రైతుకు హక్కుగా ఉండాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నగదుబదిలీ నిర్ణయానికి శ్రీకారం చుట్టారని వివరించారు. (దేవుళ్ల రథాలపై మరింత నిఘా..  )

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి మొట్టమొదటి ఫైలుపై సంతకం చేసి అమలు చేశారని గుర్తుచేశారు. ఆ తర్వాత వచ్చిన  ప్రభుత్వాలు ఉచిత విద్యుత్ పథకాన్ని నీరుగార్చాయన్నారు. టీడీపీ సర్కార్‌ హయాంలో పగటి పూట 9 గంటల పాటు కరెంటు ఇచ్చే పరిస్థితులే లేవన్నారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో దాదాపు 40 శాతం ఫీడర్లలో పగటి పూట 9 గంటలు కరెంటు ఇవ్వడానికి మౌలిక సదుపాయాలే లేవన్నారు. ఈ పరిస్థితులను మార్చడానికి, ఫీడర్ల ఏర్పాటు, అప్‌గ్రేడేషన్‌ పనుల కోసం వైఎసార్ ప్రభుత్వం రూ.1,700 కోట్లు కేటాయించిందని.. దీని వల్ల ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో 89 శాతం ఫీడర్లలో పగటిపూటే 9 గంటలపాటు ఉచితంగా విద్యుత్‌ ఇస్తున్నట్లు డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పారు. మిగిలిన చోట్ల కూడా వేగంగా పనులు పూర్తి చేసి రబీ నాటికి పూర్తి స్థాయిలో 9 గంటలపాటు పగటి పూటే కరెంటు ఇస్తారని వివరించారు. 

జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. 2019 మార్చి 31 నాటికి చంద్రబాబు ఉచిత విద్యుత్‌ పథకం కింద డిస్కంలకు డబ్బులు ఇవ్వకుండా దాదాపు రూ.8 వేల కోట్లు బకాయిపెట్టారని..వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ డబ్బు మొత్తం చెల్లించిందని చెప్పారు. ఈ డబ్బులు చెల్లించడమే కాకుండా నాణ్యమైన కరెంటు ఇవ్వడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు వివరించారు. రైతుల విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే 30 నుంచి 35 సంవత్సరాలపాటు ఉచిత విద్యుత్‌ పథకానికి ఎలాంటి ఢోకా రానివ్వకుండా 10 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ కోసం ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. తద్వారా యూనిట్‌ కరెంటు రూ.2.5 కే ప్రభుత్వానికి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు‌ దీని వల్ల ప్రభుత్వంపై భారం తగ్గుతుందని.. ఉచిత విద్యుత్‌ పథకం స్థిరంగా, నిరంతరాయంగా కొనసాగడానికి ఇది దోహదం చేస్తుందని లక్ష్మణరెడ్డి స్పష్టంచేశారు. (ఎన్ని గుళ్లు తిరిగినా ఆయన పాపాలు పోవు)

రైతులపై ఒక్క పైసా భారం పడదన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం మనసున్న, రైతుల పక్షపాత ప్రభుత్వమని.. రైతులకు ఒక్క పైసాకూడా నష్టం జరగదని పేర్కొన్నారు. ఎస్పీడీసీఎల్ ఏడి సురేష్ బాబు మాట్లాడుతూ ఉచిత విద్యుత్ పథకానికి నగదు బదిలీ వంటి కొత్తగా తీసుకొస్తున్న సంస్కరణల వల్ల ఉచిత విద్యుత్‌ రూపేణా ఎంత వాడుతున్నాం.. ఎంత ఖర్చు చేస్తున్నామో తెలుస్తుందన్నారు. ప్రభుత్వం ప్రత్యేక ఖాతాల్లోకి వేసే డబ్బును రైతులే డిస్కంలకు చెల్లిస్తారని వివరించారు.నాణ్యమైన కరెంట్‌ పగటి పూట 9 గంటల పాటు రాకపోతే రైతులు డిస్కంలను నిలదీయొచ్చని.. సంబంధిత అధికారులను ప్రశ్నించవచ్చున్నారు. దీని వల్ల జవాబుదారీతనం, బాధ్యత పెరుగుతాయని..అధికారులకు కూడా రైతుల పట్ల జవాబుదారీతనం పెరుగుతుందన్నారు.  ప్రతినెలా రైతులకు ఖాతాల్లో డబ్బులు పడతాయని.. ఆ డబ్బులు డిస్కంలకు వెళతాయన్నారు. దీనివల్ల డిస్కంల ఆర్థిక పరిస్థితులు కూడా బాగుంటాయని సురేష్ బాబు వివరించారు. విలేకరుల సమావేశంలో ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టారు, ఏపీ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షులు శాంతమూర్తి, రిటైర్డ్ ఎస్పీ చక్రపాణి, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement