రాష్ట్రంలో తీవ్ర ఆందోళనలో రైతన్నలు
విత్తనం నుంచి బీమా వరకు అన్నదాతలను వెంటాడుతున్న సమస్యలు
అరకొరగా పెట్టుబడి సాయం.. కౌలు రైతులకు రిక్తహస్తం
అందని మోంథా తుపాను పరిహారం.. జాడలేని కరువు సాయం
అదునుకు సబ్సిడీ విత్తనాలు సైతం అందక నానాపాట్లు
అరకొరగా అందిన చోట్ల అన్నీ పుచ్చులేనని రైతుల ఆందోళన
యాప్‌తో ఎరువు పంపిణీ సకాలంలో అందక అగచాట్లు
అటకెక్కిన ఉచిత పంటల బీమా పథకం..
స్వచ్ఛంద నమోదు బీమాకూ మంగళం
ముంచుకొస్తున్న ఎల్‌నినో ప్రభావం.. కానరాని సర్కారు ముందస్తు ప్రణాళిక
సాక్షి, అమరావతి: ఏరువాక పౌర్ణమి. ఇది రైతుల పండుగ. తొలకరి చినుకులు నేలను తాకే వేళ.. వర్ష రుతువు ప్రారంభంలో జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే ఈ వేడుక ప్రకృతికి, మానవాళికి మధ్య విడదీయలేని అనుబంధానికి ప్రతీక. ఖరీఫ్ సీజన్ ఆరంభానికి సూచికగా రైతులు కాడెద్దులను సిద్ధం చేసి.. వ్యవసాయ పరికరాలను అలంకరించి పూజలు చేసి.. సాగుకు శ్రీకారం చుడతారు. అలాంటి ఈ సంప్రదాయ పండుగ వాతావరణం రాష్ట్రంలో రెండేళ్లుగా రైతుల లోగిళ్లలో మచ్చుకైనా కన్పించడం లేదు.
చంద్రబాబు సర్కారు నిర్వాకంతో అదనుకు సబ్సిడీ విత్తనం, ఎరువులు అందక ఓ వైపు నానా అగచాట్లు పడుతుంటే.. మరొక వైపు ముంచుకొస్తున్న ఎల్‌నినోను తట్టుకునేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించక పోవడంతో రైతులు తొలకరి సాగుపై ఆందోళనకు గురవుతున్నారు.
సీజన్ ఆరంభంలోనే నకిలీ విత్తనాల బెడద
ఖరీఫ్ సాగు కోసం ఈసారి ముందస్తుగా సాగు నీటి విడుదలకు షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం, అందుకు తగినట్టుగా విత్తనాలను సరఫరా చేయలేక పోతోంది. ఖరీఫ్‌లో 6.73 లక్షల క్వింటాళ్ల విత్తనాలకు జిల్లాల నుంచి ఇండెంట్ రాగా, సబ్సిడీకి కోత పెట్టడంతో 4.82 లక్షల క్వింటాళ్ల విత్తన సరఫరాకు టెండర్లు పిలిచారు.
పచ్చిరొట్ట విత్తనాలతో వేరుశనగ, కంది విత్తనాలు అరకొరగానే అందుబాటులో ఉంచగా.. వరి విత్తనాల పంపిణీ ఇంకా ప్రారంభించలేదు. మరో వైపు ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనాలే నాసిరకం కావడంతో అవి మొల కెత్తక రైతులు విత్తులోనే ఆర్థికంగా నష్టపోయారు. రెండేళ్లుగా అదునుకు యూరియా అందించలేని ప్రభుత్వం ఈ ఏడాది యాప్ ద్వారా సరఫరా అంటూ రైతులను నరకయాతనకు గురిచేస్తోంది. కట్ట (బస్తా) యూరియా కోసం సీజన్ ఆరంభంలోనే రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన అగత్యం ఏర్పడింది.
కౌలు రైతులకు మళ్లీ మొండిచెయ్యే
అధికారంలోకి వస్తే ఏటా ప్రతీ రైతు కుటుంబానికి రూ.20 వేల చొప్పున అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తామని ఇచ్చిన సూపర్ సిక్స్ హామీకి చంద్రబాబు సర్కారు తూట్లు పొడిచింది. తొలి ఏడాది నిస్సిగ్గుగా రూ.10,717 కోట్లు ఎగ్గొట్టిన ప్రభుత్వం.. రెండో ఏడాది ఏడు లక్షల మందికి ఎగనామం పెట్టి అరకొర సాయం విదిల్చింది. ఈ ఏడాది తొలి విడతలో రూ.5 వేలు మాత్రమే జమ చేసింది.
గతేడాదితో పోలిస్తే ఒక్కరంటే ఒక్క రైతు కూడా పెరగలేదు. మళ్లీ ఏడు లక్షల మందికి ఎగ్గొట్టారు. భూ యజమానులతో సమానంగా కౌలు రైతులు, దేవదాయ, అటవీ భూ సాగుదారులకు ఏటా రూ.20 వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయానికి మూడో ఏడాది కూడా ఎగనామం పెట్టింది. దీంతో కౌలు రైతుల చేతిలో చిల్లిగవ్వ లేక పెట్టుబడి కోసం అప్పులు ఇచ్చే వారి చుట్టూ తిరుగుతూ అష్టకష్టాలు పడుతున్నారు.
అందని మోంథా నష్టపరిహారం.. అటకెక్కిన పంటల బీమా
చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాను అటకెక్కించింది. ఏడాది తిరక్కుండానే స్వచ్ఛంద నమోదు బీమాకు సైతం మంగళం పాడేసింది. ప్రీమియం బకాయిలు ఎగ్గొట్టడంతో ఇప్పటికే దాదాపు రూ.3,500 కోట్లకు పైగా బీమా పరిహారం అందకుండా పోయింది. బీమా కంపెనీలు ఏపీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టడంతో మూడో ఏడాది కూడా పంటల బీమాకు రైతులు దూరమైపోయారు. గతేడాది అక్టోబర్‌లో విరుచుకుపడిన మోంథా తుపానుతో నష్టపోయిన 3.42 లక్షల మంది రైతులకు రూ.411 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ 10 నెలలు గడుస్తున్నా చెల్లించలేని దుస్థితి నెలకొంది.
కరువుతో పాటు ఇతర వైపరీత్యాల సాయం కూడా కలుపుకుంటే కనీసం రూ.1,100 కోట్లకు పైగా పరిహారం అందని పరిస్థితి. మరో వైపు గడిచిన ఖరీఫ్ సీజన్‌లో పండించిన ధాన్యంతో సహా పత్తి, మొక్క జొన్న, పొగాకు, ఉల్లి, టమాటా, బత్తాయి, మామిడి ఇలా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కక రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క 2025–26లోనే 393 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ప్రభుత్వమే ప్రకటించింది.
కలవరపెడుతున్న ఎల్‌నినో ప్రభావం
ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులకు తోడు ఎల్‌నినో ప్రభావం రైతులను కలవర పెడుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పోలవరం, విశాఖ, కాకినాడ, ఉభయ గోదావరి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మైనస్ 20 శాతం నుంచి మైనస్ 59 శాతం వరకు లోటు వర్షపాతం నమోదైందని తెలుస్తోంది. జూలై, ఆగస్టుల్లో తీవ్రమైన లోటు వర్షపాతం నమోదవుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.
దాదాపు 22.53 లక్షల ఎకరాల్లో సాగయ్యే వర్షాధార పంటలపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఎల్‌నినోను తట్టుకునేలా కంటిజెన్స్ ప్రణాళికను ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేని దుస్థితి నెలకొంది. దీంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో ఏ విధంగా ముందుకెళ్లాలో అర్థం కాక రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం మాత్రం తామేదో రైతులను ఉద్దరించినట్టుగా ఏరువాక పౌర్ణమిని పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని పిలుపునివ్వడం పట్ల అన్నదాతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
సంచి విప్పి చూస్తే అన్నీ పుచ్చులే
నేను 5 ఎకరాల్లో ఖరీఫ్ సాగు కోసం సిద్ధమయ్యాను. ముందుగా భూ సారం కోసం శివపురం ఆర్బీకే ద్వారా 10 కేజీల జీలగు విత్తనాలు కొనుగోలు చేశాను. పొలంలో చల్లేందుకు విప్పి చూస్తే పూర్తిగా పుచ్చిపోయి ఉన్నాయి. వాటిని ఏం చేయాలో పాలుపోక ప్రైవేటు వ్యాపారుల దగ్గర మళ్లీ కొనుగోలు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనాలే ఇలా ఉంటే ఎలా?– సయ్యద్ అబ్దుల్, ముత్తరాయపల్లె, వైఎస్సార్ జిల్లా
ప్రభుత్వమే నాసిరకం విత్తనాలిస్తే ఎలా?
నాకున్న 4 ఎకరాలలో పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకుందామని దువ్వూరు మండలం ఎర్రబల్లె గ్రామంలో మా బంధువులు ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసిన జీలుగు విత్తనాల్లో కొన్ని తెచ్చుకున్నా. పొలంలో చల్లేందుకు ప్యాకెట్ విప్పి చూస్తే అన్నీ పుచ్చులే. నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాల్సిన ప్రభుత్వమే ఇలా నాసిరకమైన విత్తనాలు సరఫరా చేస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.– నేలటూరు సుబ్బారెడ్డి, అరవిందనగర్, వైఎస్సార్ జిల్లా
నిజంగానే ‘రోజులు మారాయి’
చంద్రబాబు పాలన అనగానే రైతన్నలు భయపడినంతా అయ్యింది.. రెండేళ్లుగా అన్నీ కష్టాలే.. ప్రభుత్వ పరంగా వ్యవసాయానికి ఏ విధంగానూ సహకారం లభించడం లేదు.. వ్యవసాయమే దండగ అన్న పెద్దమనిషి పాలనలో ఇంతకంటే ఏం ఆశించగలం అంటూ అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘నవ ధాన్యాలను గంపకెత్తుకొని.. చద్ది అన్నము మూట గట్టుకొని.. ముల్లు గర్రను చేతబట్టుకుని.. ఇల్లాలునీ వెంటబెట్టుకొని.. ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా.. నీ కష్టమంత తీరునురో రన్నో చిన్నన్నా..’ అనే పాటను సరదాకైనా పాడుకోలేమని చింతిస్తున్నారు.


