
రాజ్ భవన్ వైపు వెళ్తున్న రైతులు, వ్యవసాయ కార్మికులను అడ్డుకున్న పోలీసులు
బలవంతంగా భూసేకరణ చేస్తే తీవ్రపరిణామాలు
హెచ్చరించిన రైతులు, రైతుకూలీలు
ఉద్రిక్తతకు దారితీసిన చలో విజయవాడ
ఛలో అసెంబ్లీ, ఛలో రాజ్‌భవన్‌లను అడ్డుకున్న పోలీసులు
పలువురు నేతలు అదుపులోకి..
సాక్షి, అమరావతి: పారిశ్రామికీకరణ పేరిట టీడీపీ కూటమి ప్రభుత్వం చేపట్టిన బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు, వ్యవసాయ కార్మికులు చేపట్టిన ఆందోళనతో బుధవారం విజయవాడ దద్దరిల్లింది. ఆందోళన చేపట్టినవారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు పలువురు నేతల్ని అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత వదిలేశారు. చివరికి కొందరు ప్రతినిధులు అసెంబ్లీలో మంత్రిని కలిసేందుకు అనుమతించారు.
ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ మా భూముల జోలికొస్తే ఖబడ్దార్.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును హెచ్చరించారు. బలవంతంగా భూసేకరణ జరిపితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఏపీ వ్యవసాయ కార్మిక, రైతుసంఘాలు ఇచ్చిన ‘చలో విజయవాడ’ పిలుపుతో అన్ని జిల్లాల నుంచి వచ్చిన రైతులు, వ్యవసాయ కార్మికులు తొలుత విజయవాడ ధర్నాచౌక్ వద్ద ఆందోళనకు దిగారు. తమ గోడు వినేందుకు రెవెన్యూ మంత్రి లేదా ఉన్నతాధికారులు రావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో అక్కడి నుంచి ఛలో అసెంబ్లీ చేపట్టారు.
వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అప్సర హొటల్ జంక్షన్‌లో ఏలూరు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకి దిగారు. దాదాపు గంటసేపు వాహనాల రాకపోకలు స్తంభించాయి. అనంతరం రైతులు, వ్యవసాయ కార్మికులు ఛలో రాజ్‌భవన్ అంటూ గవర్నర్ బంగ్లా వైపు ర్యాలీగా తరలివెళ్లారు. రాజ్‌భవన్ సమీపంలో వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారికి, పోలీసులకు తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. పోలీసులు ముఖ్యనేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
రైతులు, వ్యవసాయ కార్మికుల ఆందోళన మరింత తీవ్రతరం అవుతుండటంతో ఉన్నతాధికారులు స్పందించారు. కొద్దిమంది ప్రతినిధుల్ని అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం మంత్రిని కలిసిన నేతలు మాట్లాడుతూ రైతులతో పాటు రైతుకూలీల అనుమతి లేకుండా భూములు తీసుకోబోమని మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు.
ముఖ్యమంత్రివా.. రాజకీయ బ్రోకర్‌వా?
ధర్నాచౌక్‌లో వ్యవసాయ కార్మికసంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈ రాష్ట్రం చంద్రబాబు జాగీరా అని ప్రశ్నించారు. కరేడులో 20 వేల ఎకరాలు, కుప్పంలో రెండువేల ఎకరాలు కావాలంటున్నారని చెప్పారు. కరేడులో ఐదువేల ఎకరాలు, కుప్పంలో 1,500 ఎకరాలు, అమరావతిలో 50 వేల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ఒప్పుకొన్నారని చెబుతున్నారన్నారు.
రాష్ట్రంలో ఒక్క రైతు కూడా భూమి ఇచ్చేందుకు సిద్ధంగా లేడని చెప్పారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేలకు 100 నుంచి 200 ఎకరాలున్నాయని, ఆ భూములు తీసుకుని ఏ ప్రాజెక్టు కావాలంటే ఆ ప్రాజెక్టు కట్టుకోవచ్చని చెప్పారు. చంద్రబాబూ నువ్వు ముఖ్యమంత్రివా.. రాజకీయ బ్రోకర్‌వా.. అదాని, అంబానీలకు గుమాస్తావా? అంటూ నిలదీశారు. కరేడులో ఎకరం కోటి రూపాయలైతే.. అప్పనంగా కాజేయాలని చూస్తున్నారన్నారు.
వంద ఎకరాలు సరిపోయే ఇండోసోల్‌కు ఎనిమిదివేల ఎకరాలు కావాలనడం.. రియల్ ఎస్టేట్ కోసం కాదా? అని నిలదీశారు. అంతర్జాతీయ విమానాశ్రయానికే 500 ఎకరాలు చాలని, అలాంటిది కుప్పం ఎయిర్‌పోర్టుకు రెండువేల ఎకరాలు కావాలా? అని ప్రశ్నించారు. మా పేదల జోలికి వస్తే ఖబడ్దార్ చంద్రబాబూ.. అంటూ హెచ్చరించారు. ఈ ఆందోళనలోఆయా సంఘాల రాష్ట్ర నేతలు వి.కృష్ణయ్య, బలరాం, హరిబాబు, దడాల సుబ్బారావు, కె.ప్రభాకర్‌రెడ్డి వై.కేశవరావు తదితరులు పాల్గొన్నారు.
పాల రైతు సంఘ నేతల అరెస్టు హేయం
విశాఖ డైరీలో అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాసనసభ కమిటీ నివేదిక తక్షణమే ఇవ్వాలని కోరుతూ చేపట్టిన ధర్నాలో పాల్గొన్న రైతులను అరెస్ట్ చేయడం అత్యంత హేయమైన చర్య అని ఏపీ రైతు సంఘం అధ్యక్ష,ప్ర«దాన కార్యదర్శులు వీ.కృష్ణయ్య, కే.ప్రభాకరరెడ్డి ఓ ప్రకటనలో ఖండించారు.