
చంద్రబాబుకు అనుకూలంగా తోక ఆడించడం ఆ పత్రిక నైజం
కాగ్ నివేదికలో లేని గణాంకాలను వల్లె వేస్తూ బాబుకు బాకా
జీఎస్టీ వసూళ్లు అంచనాకు మించి వస్తున్నాయని అబద్ధపు రాతలు
జీఎస్టీ రాబడి అంచనా రూ.57,477 కోట్లు.. నాలుగు నెలల్లో వసూళ్లు రూ.16,754 కోట్లే
ఏడాది అంచనాలో తొలి నాలుగు నెలల్లో 29.15 శాతం వసూళ్లు నమోదు
61 శాతం వసూళ్లంటూ తప్పుడు లెక్కలు వేసిన ఈనాడు
ఇదిగో కాగ్ నివేదిక.. బాకా ఊదామని ఈనాడు అంగీకరిస్తుందా?
సాక్షి, అమరావతి: బాబుకు బాకా ఊదడమే ఈనాడు పని. అబద్ధాలు, అసత్యాలను నేర్పుగా కథలుగా అల్లి ఏదో రకంగా చంద్రబాబుకు జాకీ వేసి ఎత్తడానికి సుదీర్ఘకాలంగా ప్రయత్నిస్తూనే ఉంది. చాలాసార్లు ప్రజలకు వాస్తవాలు తెలియకుండా దాచేసి, బాబుకు లబ్ధి చేకూర్చడంలో కొన్నిసార్లు సక్సెస్ అయింది. కానీ.. ఒక్కోసారి అడ్డంగా ప్రజలకు దొరికిపోతుంటుంది. అవాస్తవాలు, అబద్ధాల లెక్కలు వల్లె వేస్తూ చంద్రబాబు గొప్పతనమంటూ గొప్పగా చెప్పడానికి తాజాగా పడిన తాపత్రయం ప్రజలకు నవ్వు తెప్పిస్తోంది.
జీఎస్టీ రాబడి అంచనాల్లో తొలి నాలుగు నెలల్లో ఏకంగా 61 శాతం వసూలైనట్టు ఆదివారం సంచికలో గొప్పగా డబ్బా కొట్టింది. వాస్తవం అందుకు భిన్నంగా ఉందని కాగ్ లెక్కలు చూస్తే తేటతెల్లమవుతోంది. వాస్తవానికి జీఎస్టీ అంచనా రాబడిలో తొలి నాలుగు నెలల వసూళ్లు 29.15 శాతమే. ఏడాదికి జీఎస్టీ రాబడి అంచనా రూ.57,477 కోట్లు అయితే.. నాలుగు నెలల్లో వసూళ్లు రూ.16,754 కోట్లు మాత్రమే. ఏరకంగా చూసినా ఇది అంచనాలో వసూలైంది 29.15 శాతమే.

