ఆడుదాం ఆంధ్ర రిజిస్ట్రేషన్లకు గడువు పొడిగింపు | Sakshi
Sakshi News home page

ఆడుదాం ఆంధ్ర రిజిస్ట్రేషన్లకు గడువు పొడిగింపు

Published Fri, Dec 15 2023 5:12 AM

Extension of deadline for Adudam Andhra registrations - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ‘ఆడుదాం ఆంధ్ర’ మెగా టోర్నీ నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చురుగ్గా చేస్తోంది. ఈ టోర్నీలో పాల్గొనడానికి యువత పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తం చేస్తోంది. ఇప్పటివరకు 30.50 లక్షల మంది క్రీడాకారులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. మరో 1.36 లక్షల మందికి పైగా ప్రేక్షకులుగా నమోదయ్యారు. వీరిలో క్రీడల్లో పాల్గొనాలనే ఆసక్తి కలిగిన వారి కోసం శాప్‌ ప్రత్యేకంగా ఎడిట్‌ ఆప్షన్‌ను తీసుకొస్తోంది. అలాగే యువత నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు రిజిస్ట్రేషన్ల గడువును ఆదివారం వరకు పొడిగించింది. 

ప్రత్యేక డ్రెస్‌.. డిజిటల్‌ స్కోరింగ్‌
ఈ టోర్నీని ప్రొఫెషనల్‌ స్థాయిలో నిర్వహిస్తు­న్న ప్రభుత్వం.. ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌ అమలు చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో విజేతలకు ప్రభుత్వం స్పోర్ట్స్‌ టీ షర్టులను పంపిణీ చేయనుంది. దాదాపు ఒక్కో సచి­వాలయం పరిధిలో ఐదు క్రీడాంశాల్లో(క్రికెట్, ఖోఖో, బ్యాడ్మింటన్‌ డబుల్స్, కబడ్డీ, వాలీబాల్‌)గెలిచిన 114 మంది మహిళలు, పురుషులకు ‘ఆడుదాం ఆంధ్ర’ లోగోతో కూడిన టీషర్టులు అందించనుంది.

తొలి దశలో 17.19 లక్షల టీషర్టులను అందజేయనుంది. అనంతరం రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించిన జిల్లా స్థాయి విజేతలకు స్పోర్ట్స్‌ డ్రెస్‌ కిట్లు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించింది. అలాగే సచివాలయాల పరిధిలో వలంటీర్ల సేవలను ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీల కోసం ఉపయోగించుకోనున్నారు. జిల్లా కోచ్‌లు, పీఈటీలు, పీడీలతో పాటు వలంటీర్లకు అంపైరింగ్, డిజిటల్‌ స్కోరింగ్‌పై తొలి దశ శిక్షణ అందించారు.

మరోసారి సాంకేతిక నిపుణు­లతో ప్రత్యేక యాప్‌లో స్కోరింగ్‌ నమోదుపై శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామ, వార్డు సచివా­లయం, మండల స్థాయి వరకు ఆఫ్‌లైన్‌లో స్కోర్లు నమోదు చేసి వాటిని యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. నియోజకవర్గ­స్థాయిలో క్రీడాకారులు, ప్రేక్షకులు తమ మొబైల్‌లోనే స్కోర్‌ చూసుకునే విధంగా పోటీల సమయంలోనే ఆన్‌లైన్‌లో స్కోరింగ్‌ నమోదు చేస్తారు. 

పది రోజుల పాటు వాయిదా
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 9,060 క్రీడా మైదానాలను శాప్‌ అధికారులు గుర్తించారు. మైదానాల్లో గడ్డి తొలగించడంతో పాటు క్రీడలకు అనువుగా మార్చే ప్రక్రియను ప్రారంభించారు. కానీ తుపాను కారణంగా పలు జిల్లాల్లోని మైదానాల్లోకి నీళ్లు చేరాయి. ప్రస్తుతం వాటిని తొలగించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.  దీంతో 15వ తేదీన ప్రారంభం కావాల్సిన టోర్నీని పది రోజుల పాటు వాయిదా వేశారు. మరోవైపు.. రిజిస్ట్రేషన్లకు గడువును ఆదివారం(డిసెంబరు 17) వరకు పొడిగించారు.

Advertisement
 
Advertisement