ఆకాశమే హద్దుగా.. ఎగుమతుల్లో ఏపీ దూకుడు | Sakshi
Sakshi News home page

ఆకాశమే హద్దుగా.. ఎగుమతుల్లో ఏపీ దూకుడు

Published Wed, Jun 7 2023 4:54 AM

Exports of food products at a record level in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆకాశమే హద్దుగా ఎగుమ­తుల్లో ఆంధ్రప్రదేశ్‌ దూకుడు కనబరుస్తోంది. ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల్లో రికార్డు స్థాయిలో ఎగుమతులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణలు.. పెద్ద ఎత్తున కల్పిస్తున్న మార్కెటింగ్‌ సౌకర్యాలు సత్ఫ­లి­తాలిస్తున్నాయి. ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విలువ 2018–19లో రూ.8,929 కోట్లు ఉండగా 2022–23లో ఈ మొత్తం రూ.22,761.99 కోట్లకు చేరింది. అంటే నాలుగేళ్లలోనే రెండున్నర రెట్లు పెరిగింది.

2021–­22లో జరిగిన ఎగుమతుల విలువతో పోలిస్తే 2022–23లో రూ.2,860 కోట్ల విలువైన ఆహార ఉత్ప­త్తులు అధికంగా ఎగుమతయ్యాయి. ఇక జాతీ­య స్థాయిలో 2022–23లో రూ.2.21 లక్షల కోట్ల విలువైన 4.45 కోట్ల టన్నుల ఉత్పత్తులను ఎగుమతి చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి రూ.24,826 కోట్ల విలువైన 80.86 లక్షల టన్నులు ఎగుమతయ్యాయి. వాటిలో ఒక్క మన రాష్ట్రం నుంచే రూ.22,762 కోట్ల విలువైన 79.25 లక్షల టన్నుల ఉత్పత్తులు ఉండటం విశేషం.

తెలంగాణ నుంచి కేవలం రూ.2,064 కోట్ల విలువైన 1.61 లక్షల టన్నుల ఉత్పత్తులు మాత్రమే ఉన్నాయి. ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ రికార్డులు తిరగరాస్తోందని వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎపెడా) చెబుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గరిష్టంగా ఒక ఏడాదిలో జరిగిన ఎగుమతులను 2022–23లో తొలి అర్ధ సంవత్సరంలోనే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధిగమించడం విశేషం.

చరిత్రలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఎగుమతులు జరగలేదని చెబుతున్నారు. పురుగు మందుల అవశేషాల్లేని వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తే లక్ష్యంగా ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ నుంచి గ్యాప్‌ సర్టిఫికేషన్‌ జారీ చేయనున్నందున 2023–24లో కోటి లక్షల టన్నులకు పైగా ఎగుమతులు జరిగే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.  

తొలిసారి గోధుమలు, పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతి
రాష్ట్రం నుంచి ప్రధానంగా నాన్‌ బాస్మతి రైస్, మొక్కజొన్న, జీడిపప్పు, బెల్లం, అపరాలు, శుద్ధి చేసిన పండ్లు, పండ్ల రసాలు, కూరగాయలు పెద్ద ఎత్తున ఎగుమతవుతున్నాయి. మొత్తం ఎగుమతుల్లో సింహభాగం నాన్‌ బాస్మతి రకం బియ్యమే. 2018–19లో రూ.7,324 కోట్ల విలువైన 29.22 లక్షల టన్నులు నాన్‌ బాస్మతి రైస్‌ ఎగుమతి అయితే.. 2022–23కు వచ్చేసరికి రూ.18,693 కోట్ల విలువైన 67.32 లక్షల టన్నులు ఎగుమతి అయ్యాయి.

నాన్‌ బాస్మతి రైస్‌ తర్వాత మొక్కజొన్న 2018–19లో రూ.130.77 కోట్ల విలువైన 91,626 టన్నులు ఎగుమతి కాగా, 2022–23లో ఏకంగా రూ.1,845.73 కోట్ల విలువైన 7.24 లక్షల టన్నులు ఎగుమతి అయ్యాయి. కాగా రాష్ట్రం నుంచి తొలిసారి గోధుమలు, ఆయిల్‌ కేక్స్, పౌల్ట్రీ, పశుదాణా ఉత్పత్తులు ఎగుమతి చేశారు.

రూ.829.71 కోట్ల విలువైన 3.23 లక్షల టన్నుల గోధుమలు, రూ.317 కోట్ల విలువైన 1,906.89 టన్నుల పశుదాణా, రూ.17.6 కోట్ల విలువైన 8,371 టన్నుల పౌల్ట్రీ ఉత్పత్తులు, రూ.4.68 కోట్ల విలువైన 3,028 టన్నుల ఆయిల్‌ కేక్స్‌ ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. రాష్ట్రం నుంచి ఎక్కువగా మిడిల్‌ ఈస్ట్, దక్షిణాసియా దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుండగా.. గతేడాది అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోపియన్, అరబ్‌ దేశాలకు కూడా పంపారు.

ప్రభుత్వ ప్రోత్సాహంతో పోటీపడుతున్న వ్యాపారులు..
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ప్రోత్సాహం, గ్రామస్థాయిలో కల్పించిన సౌకర్యాలతో గత నాలుగు సీజన్లలో వ్యవసాయ విస్తీర్ణంతోపాటు నాణ్యమైన దిగుబడులు పెరిగాయి. నాలుగేళ్లలో ఏటా సగటున 14 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తుల దిగుబడులు అదనంగా వచ్చాయి. కేంద్రం మద్దతు ధర ప్రకటించని ఆహార ఉత్పత్తులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు ప్రకటించడం, ధరలు తగ్గిన ప్రతిసారీ రైతులు నష్టపోకుండా మార్కెట్‌లో జోక్యం చేసుకోవడంతో వ్యాపారులు సైతం పోటీపడి కొనుగోలు చేశారు. దీంతో మార్కెట్‌లో రైతుల ఉత్పత్తులకు మంచి ధరలు లభిస్తున్నాయి. మిరప, పత్తి వంటి వాణిజ్య పంటలే కాదు.. అపరాలు, చిరు ధాన్యాలు, అరటి, బత్తాయి వంటి ఉద్యాన ఉత్పత్తులకు మంచి ధర లభిస్తోంది.

ఎగుమతులను ప్రోత్సహించేలా సంస్కరణలు
సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకొచ్చిన సంస్కరణలు, కల్పించిన మార్కెటింగ్‌ సౌకర్యాల ఫలితంగా ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఏటా సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో రికార్డు స్థాయి ఎగుమతులు నమోదవడం సంతోషదాయకం.
    – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి

‘గ్యాప్‌’ సర్టిఫికేషన్‌తో మరిన్ని ఎగుమతులు
గతంలో ఎన్నడూలేని విధంగా 79.25 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు రాష్ట్రం నుంచి విదేశాలకు ఎగుమతయ్యాయని ఎపెడా ప్రకటించడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించే రైతులకు ‘గ్యాప్‌’ (గుడ్‌ అగ్రికల్చర్‌ ప్రాక్టీస్‌) సర్టిఫికేషన్‌ జారీ చేయబోతున్నాం. దీంతో 100కుపైగా దేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం లభిస్తుంది.
    –గోపాలకృష్ణ ద్వివేది, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి   

Advertisement
Advertisement