వైజాగ్ @ సేఫ్‌ జోన్‌ | Experts Clear Visakhapatnam To Be Safe Zone | Sakshi
Sakshi News home page

వైజాగ్ @ సేఫ్‌ జోన్‌

Nov 15 2021 5:06 PM | Updated on Nov 15 2021 5:27 PM

Experts Clear Visakhapatnam To Be Safe Zone - Sakshi

అయితే.. విశాఖలో భూకంపాల వచ్చే తీవ్రత అత్యంత స్వల్పమని.. ప్రజలెవ్వరూ ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

సాక్షి, విశాఖపట్నం: ఆదివారం ఉదయం.. రాత్రంతా కురిసిన భారీ వర్షంతో భారంగా నిద్రలేస్తున్న వేళ.. ఒక్కసారిగా అలజడి... సరిగ్గా ఉదయం 7.13 గంటలకు భారీ శబ్దం వినిపించింది. ఉలిక్కిపడిన ప్రజలు.. 5 సెకన్ల పాటు భూ ప్రకంపనలు రావడంతో భయాందోళనలతో బయటికి వచ్చారు. ఎక్కడా ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గాలి కంటే వేగంగా.. వైజాగ్‌లో భూకంపం అనే వార్త దావానలంలా వ్యాపించింది. అయితే.. విశాఖలో భూకంపాల వచ్చే తీవ్రత అత్యంత స్వల్పమని.. ప్రజలెవ్వరూ ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

చదవండి: ఒక్క రోజులో.. అదిరిపోయే టూర్లు!

రిక్టర్‌ స్కేలుపై 6 దాటితేనే ప్రభావం 
భూమి లోపల 12 కఠినమైన పొరలతో పాటు చిన్న పొరలు కూడా ఉంటాయి. అవి ఒకదానికొకటి కదులుతూ ఉంటాయి. ఈ కదలిక కారణంగానే నష్టం వాటిల్లుతుంది. భూ అంతర్భాగంలో అధిక ఉష్ణోగ్రతలకు ఈ శిలాఫలకాలలోని కొన్ని భాగాలలో సమస్యలు ఏర్పటంతో ఒకదానికొకటి నెట్టుకుంటాయి. దాని వల్ల ఆ శిలాఫలకాలలో పగుళ్లు ఏర్పడి భూకంపాలు ఏర్పడతాయి. శిలాఫలకాలలో ఏర్పడే పగుళ్ల స్థాయిని బట్టి ఈ భూకంపాలు సంభవిస్తాయి. భూకంపాల తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6 దాటితేనే ప్రభావం అధికంగా ఉంటుంది. 

జోన్‌–2లో విశాఖ జిల్లా.. 
భూకంపాల తీవ్రత ఉన్న ప్రాంతాలను జోన్లలో విభజిస్తారు. జోన్‌–1 అంటే చిన్న స్థాయి ప్రకంపనలు కూడా వచ్చే శాతం అతి స్వల్పంగా ఉంటుందనీ.. జోన్‌–2లో స్వల్ప ప్రకంపనలు వస్తాయని.. జోన్‌–3లో భూకంప తీవ్రత స్వల్పంగా ఉంటుందనీ.. జోన్‌–4లో భారీగా ప్రమాదం ఉంటుందని విభజించారు. విశాఖ జిల్లా భూకంపాల విషయంలో జోన్‌–2 (లో రిస్క్‌ ఏరియా)లో ఉంది. కాబట్టి ఎలాంటి ఆందోళనకు గురికావల్సిన అవసరం లేదని వాతావరణ నిపుణులు, భూగర్భ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మన రాష్ట్రంలో 1967 మార్చి 27న ఒంగోలులో నమోదైన 5.4 తీవ్రత ఇప్పటివరకు అత్యధికంగా ఉంది. అది కూడా రిక్టర్‌ స్కేలుపై 6 దాటలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 26 సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి.

200 ఏళ్లలో ఐదు సార్లు మాత్రమే.. 
విశాఖలో ప్రకంపనలు రావడం అత్యంత అరుదుగా చరిత్ర చెబుతోంది. గత 200 ఏళ్ల కాలంలో కేవలం 7 సార్లు మాత్రమే భూ ప్రకంపనలు విశాఖలో వచ్చాయని రికార్డులు చెబుతున్నాయి. ఇందులో అత్యధికం 4.3 కాగా.. అత్యల్పం ఆదివారం వచ్చిన 1.8 కావడం గమనార్హం. భూ ప్రకంపనలు చివరిసారిగా 1984లో వచ్చినట్లు వాతావరణ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

విశాఖలో ప్రకంపనలు ఎందుకు..? 
విశాఖపట్నం ప్రాంతంలో ప్రీ కేంబ్రియన్‌ అనే కాలానికి చెందిన రాళ్లు ఉన్నాయి. ఇవి 300 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినవి. భూ అంతర్భాగంలో ఉన్న రాళ్లు చోర్నకైట్‌ అనే శిలలు ఒక పగులు ద్వారా వ్యాపించాయి. మధురవాడ, మద్దిలపాలెం, సిరిపురం, గవర్నరు బంగ్లా, ఆర్టీసీ కాంప్లెక్స్, నీలమ్మ వేపచెట్టు, జ్ఞానాపురం, ఎన్‌ఏడీ, ఎయిర్‌పోర్టు, గాజువాక, కూర్మనపాలెం, అనకాపల్లి వరకు ఈ శిలలు వ్యాపించాయి. సముద్రంలోకి కొంత భాగం కూడా చోర్నకైట్‌ శిలలున్నాయి. ఈ శిలలు అప్పటికే ఉన్న ఖోండలైట్‌ శిలల్లోకి చొచ్చుకొని వచ్చి రూపాంతరం చెందాయి. ఈ విధంగా చొచ్చుకొని రావడం వల్ల టెక్టానికల్లీ వీక్‌ జోన్‌(సున్నితమైన ప్రాంతం)గా భౌగోళికంగా చెబుతారు. ఈ చోర్నకైట్‌ శిలలకు, దాన్ని ఆనుకొని ఉన్న ఖోండలైట్‌ శిలలకు మధ్య జరిగిన సర్దుబాటు వల్ల ఈ ప్రకంపనలు వచ్చాయి.

భూకంపాల గురించి భయపడొద్దు.. 
విశాఖ జిల్లా చాలా సురక్షిత ప్రాంతం. జోన్‌–2 పరిధిలో ఉన్నందువల్ల ఇక్కడ భూకంపాల తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. విశాఖ భూ అంతర్భాగంలో అతి పెద్ద రాక్‌ బ్యారియర్‌ ఉంది. చోర్నకైట్, ఖోండలైట్‌ శిలల మధ్య జరిగిన పునఃసర్దుబాటు కారణంగా భారీ శబ్దం ఏర్పడి ప్రకంపనలు వచ్చాయి. పురాతన కాలంలో ఏర్పడడడం వల్ల ప్రస్తుతం ఈ రాక్‌ జోన్‌ అంత యాక్టివ్‌ జోన్‌ కాదు. విశాఖపట్నంలో ప్రకంపనల వరకే పరిమితం తప్ప భారీగా ఇళ్లు కూలిపోవడం, ప్రాణాలు కోల్పోవడం వంటి భారీ నష్టం వంటి పరిస్థితులు దాదాపు శూన్యం. ప్రజలెవ్వరూ ఈ విషయంలో ఎలాంటి భయాందోళనలకు గురికావల్సిన అవసరం లేదు. 
– ప్రొ.ఎం.జనార్దనరావు, ఏయూ జియాలజీ విభాగం గౌరవ ప్రొఫెసర్, నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement