ఒక్క రోజులో.. అదిరిపోయే టూర్లు!

Special packages from Department of Tourism Andhra Pradesh in Karthika Masam - Sakshi

కార్తీక మాసంలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలు

ఒకేరోజులో వీలైనన్ని ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా ఏర్పాట్లు

సర్క్యూట్‌ల వారీగా దేవాలయాలు, సందర్శనీయ ప్రాంతాలను కలుపుతూ షెడ్యూల్‌

పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళిక

సాక్షి, అమరావతి: కార్తీక మాసంలో ఆధ్యాత్మికతో పాటు ఆహ్లాదాన్ని పంచేలా ‘వన్డే’, ప్రత్యేక టూర్‌లకు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రణాళికలు రూపొందించింది. హైదరాబాద్‌ నుంచి ఒక్క రోజులో వచ్చి, వెళ్లేలా కూడా ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి సర్క్యూట్‌ల వారీగా దేవాలయాలు, సందర్శనీయ ప్రాంతాలను కలుపుతూ షెడ్యూల్‌ తయారు చేసింది. ప్రస్తుతం విశాఖ నుంచి ప్రతి సోమవారం పంచారామాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట శైవక్షేత్రాలను సందర్శించేందుకు పెద్దలకు రూ.1,685, పిల్లలకు రూ.1,350 టికెట్‌ ధరలతో ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. అలాగే  విజయవాడ నుంచి కూడా ప్రతి సోమవారం పంచారామాలను దర్శించుకునేందుకు పెద్దలకు రూ.1,430, పిల్లలకు రూ.1,190 ధరలతో పర్యాటక శాఖ టూర్‌ ఏర్పాటు చేసింది. తిరుపతి నుంచి కాణిపాకం, గోల్డెన్‌ టెంపుల్, అరుణాచలం, కంచి, తిరుత్తణిని సందర్శించేందుకు పెద్దలకు రూ.2,040, రూ.2,330, రూ.3,130, పిల్లలకు రూ.1,635, రూ.1,865, రూ.2,505 టికెట్‌ రేట్లతో(రెండు రాత్రులు, ఒక పగలు) యాత్రలకు రూపకల్పన చేసింది. ప్యాకేజీలకు అనుగుణంగా రవాణాతో పాటు భోజన, వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తోంది. 

రాయలసీమ సర్క్యూట్‌లో ఇలా.. 
ఒక్క రోజు యాత్ర: తిరుపతిలోని టీటీడీ శ్రీనివాసం నుంచి ప్రతి సోమవారం తలకోన సిద్ధేశ్వరాలయం, గుడిమల్లం పరుశురామేశ్వరాలయం, కపిలేశ్వరస్వామి ఆలయం, తొండవాడ అగస్తేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించవచ్చు. వీటికి టికెట్‌ ధరను రూ.500గా నిర్ణయించింది. అలాగే ప్రతి రోజూ తిరుపతి సమీపంలోని ఆలయాలకు గైడ్‌ సౌకర్యంతో రూ.175, రూ.375 టికెట్‌ రేట్లతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. శ్రీకాళహస్తి, కాణిపాకం, తలకోనకు విడివిడిగా స్థానిక ఆలయాలను కూడా సందర్శించేలా రూ.375తో ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. రెండు రోజుల యాత్ర: శ్రీశైలం, మహానందికి ప్రతి మంగళవారం టీటీడీ శ్రీనివాసం నుంచి రెండు రోజుల యాత్ర ప్రారంభమవుతుంది. శ్రీశైలం, మహానంది, నందవరం, యాగంటి, బెలూం గుహలు, అల్లాడుపల్లి దేవాలయాలను సందర్శించవచ్చు. పెద్దలకు టికెట్‌ ధర రూ.3,960, పిల్లలకు రూ.3,165గా నిర్ణయించింది.  

ఉత్తరాంధ్రను చుట్టేసేలా.. 
విశాఖ నుంచి లంబసింగి, కొత్తపల్లి వాటర్‌ఫాల్స్, మత్స్యగుండం, మోదుకొండమ్మ ఆలయాన్ని దర్శించేందుకుగాను పెద్దలకు రూ.1,970, రూ.1,850, పిల్లలకు రూ.1,575, రూ.1,480గా టికెట్‌ ధరలను పర్యాటక శాఖ నిర్ణయించింది. శక్తిపీఠాలైన పిఠాపురం, ద్రాక్షారామంతో పాటు అన్నవరం సందర్శనకు పెద్దలకు రూ.1,180, రూ.1,200, రూ.1,375, రూ.1,200, పిల్లలకు రూ.945, రూ.960 టికెట్‌ రేట్లతో వివిధ ప్యాకేజీలు ప్రకటించింది. గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోని ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శనలో భాగంగా(రెండు రాత్రులు, ఒక పగలు) అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, దిండి, అంతర్వేది, ద్వారకా తిరుమల, విజయవాడ సందర్శనకు పెద్దలకు రూ.4,425, రూ.5,025, పిల్లలకు రూ.3,540, రూ.4,020 టికెట్‌ ధరగా నిర్ణయించింది.  

బెంగళూరు నుంచి కూడా.. 
పర్యాటక శాఖ విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు నుంచి కూడా ప్రత్యేక ప్యాకేజీలు రూపొందిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నుంచి శ్రీశైలానికి(రాత్రి, పగలు/రెండు రాత్రులు, రెండు పగళ్లు) వివిధ ప్యాకేజీల్లో మల్లికార్జున స్వామి దర్శనంతో పాటు రోప్‌వే, సందర్శన స్థలాల వీక్షణం, హరిత హోటల్‌లో భోజన వసతి సౌకర్యాలు కల్పించనుంది. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి (రెండు రాత్రులు, ఒక పగలు)శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనంతో కూడిన ప్యాకేజీ కూడా తీసుకొస్తోంది. విజయవాడ, బెంగళూరు నుంచి గండికోట(రెండు రోజులు), విజయవాడ నుంచి సూర్యలంక(రాత్రి బస, పగలు వీక్షణం), విజయవాడ నుంచి తూర్పుగోదావరిలోని పిచ్చుకలంకకు ఉదయం బయలుదేరి సాయంత్రానికి చేరుకునేలా.. వేదాద్రి నరసింహస్వామి, ముక్త్యాల ముక్తేశ్వరస్వామి, ముక్త్యాల కోట, తిరుమలగిరి వేంకటేశ్వరస్వామి, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దర్శనాలతో కూడిన ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. ఏపీటీడీసీ వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెంపొందించేలా.. 
రాష్ట్రంలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఆధ్యాత్మిక కేంద్రాలను కలుపుతూ ప్రత్యేక యాత్రలు నిర్వహిస్తున్నాం. హైదరాబాద్, బెంగళూరు నుంచి కూడా పర్యాటకులు వచ్చి వెళ్లేలా ‘వన్డే’ టూర్‌ ప్లాన్‌ చేస్తున్నాం. 
– ఎస్‌.సత్యనారాయణ, ఏపీటీడీసీ ఎండీ

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.. 
పర్యాటకులు రాష్ట్రంలోని శైవక్షేత్రాలు, దేవాలయాలు, సందర్శనీయ స్థలాలను తక్కువ సమయంలో చుట్టివచ్చేలా పర్యాటక ప్యాకేజీలు తీసుకొచ్చాం. అందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలి. 
– ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, చైర్మన్, ఏపీటీడీసీ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top