
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (APERC) భారీ షాక్ ఇచ్చింది. విద్యుత్ ఛార్జీల పేరిట ఈ ఏడాదిన్నర కాలంలో అడ్డగోలుగా వసూలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రజలకు రూ.923.55 కోట్లు వెనక్కి ఇవ్వాలంటూ బాబు సర్కార్‌ను ఈఆర్‌సీ ఆదేశించింది.
20024-2025 కాలానికి గానూ ట్రూ అప్ ఛార్జీలను డిస్కమ్‌లు వసూలు చేశాయి. ఈ చార్జీలపై ఈఆర్‌సీ విచారణ జరిపింది. అయితే డిస్కమ్‌ల లెక్కలు, విద్యుత్ కొనుగోలు వ్యయంలో తేడాలు గుర్తించింది. 2024-25 సంవత్సరానికి ట్రూ అప్ చార్జీలుగా డిస్కంలు ప్రతిపాదించిన రూ.2,758.76 కోట్లలో.. రూ.1,863.64 కోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అదనంగా వసూలు చేసిన రూ.923.55 కోట్లను విద్యుత్ వినియోగదారులకు వెనక్కి ఇవ్వాల్సిందేనని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే.. APERC స్థాపన (1999) తర్వాత వినియోగదారులకు రిఫండ్ ఆదేశించిన ఘటన ఇదే తొలిసారి. ఈఆర్సీ మొట్టికాయలతో ప్రజల సొమ్మును ప్రభుత్వం వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు.. ‘‘ప్రభుత్వం ప్రజల సొమ్ము గుంజింది.. అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేసింది’’ అనే రాజకీయ ఆరోపణలను ఈఆర్సీ నిర్ణయం వాస్తవమని తేల్చింది.
