
ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని స్నేహితురాలికి ఫోన్
ఆమెను సముదాయించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చిన స్నేహితురాలు
ఇంటికి వచ్చేయమన్న తల్లిదండ్రులు..
గురువారం నుంచి సెలవులు, అప్పుడొస్తానని చెప్పిన విద్యార్థిని
అదేరోజు రాత్రి ఐరన్ క్లిప్, ప్లాస్టర్‌కు ఆర్డర్.. ఆర్ధరాత్రి ఆత్మహత్య
గుంటూరులోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఘటన
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): ఊపిరాడకుండా నోటికి ప్లాస్టర్, ముక్కుకు ఐరన్ క్లిప్ పెట్టుకుని పిడికిళ్లు బిగించుకుని సోమవారం గుంటూరులో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం... ఏలూరు జిల్లా శ్రీరామవరం ప్రాంతానికి చెందిన కమ్మ రాజు రైతు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె శ్రావ్య (20) గుంటూరు అశోక్‌నగర్‌లోని నవీన్ లేడీస్ హాస్టల్‌లో ఉంటూ వీవీఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో నాలుగో సంవత్సరం బీటెక్ చదువుతోంది.
చదువులో చురుగ్గా ఉంటూ 85 శాతం మార్కులు సాధిస్తోంది. అయితే, ఆదివారం సాయంత్రం శ్రావ్య తన చిన్ననాటి స్నేహితురాలైన జాగృతికి ఫోన్‌చేసి తనకు చాలా చికాకుగా ఉందని, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందంటూ కన్నీరుమున్నీరైంది. దీంతో స్నేహితురాలు ధైర్యం చెప్పింది. అయినా అనుమానంతో జాగృతి.. శ్రావ్య సోదరుడికి ఫోన్‌చేసి జరిగిన విషయం వివరించింది. అతను తన తల్లికి చెప్పడంతో ఆమె వెంటనే ఏలూరు వచ్చేయాల్సిందిగా కుమార్తెకు చెప్పింది. అయితే, గురువారం నుంచి సెలవులు కాబట్టి అప్పుడు వస్తానని తన తల్లితో శ్రావ్య చెప్పింది.
ఆన్‌లైన్‌లో ప్లాస్టర్, ఐరన్ క్లిప్ ఆర్డర్..
కానీ, శ్రావ్య ఆదివారం రాత్రే ఆత్మహత్య చేసుకునేందుకు ప్లాస్టర్‌ను, ఐరన్ క్లిప్‌ను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకుంది. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో డెలివరి వచ్చింది. హాస్టల్‌లోని తోటి స్నేహితులు ఆరుబయట మెట్లపై ఎందుకు కూర్చున్నావని శ్రావ్యను అడగటంతో ఆమె దురుసుగా మాట్లాడింది. దీంతో వారంతా లోపలకు వెళ్లిపోయారు. తర్వాత కొద్దిసేపటికి నోటికి ప్లాస్టర్, ముక్కుకు ఐరన్ క్లిప్‌ను పెట్టుకుని రెండు పిడికిళ్లు గట్టిగా బిగించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తెల్లవారుజామున తోటి విద్యార్థినులు గదిలో నుంచి బయటకొచ్చి చూసి భయంతో హాస్టల్ వార్డెన్‌కు సమాచారమిచ్చారు.
సమాచారం అందుకున్న వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్, సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ తరంగిణి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. హాస్టల్‌లో సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. తోటి విద్యార్థినులతో వారు మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. శ్రావ్య కుటుంబ సభ్యులు హాస్టల్‌కు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు శ్రావ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.