breaking news
Private Hostel
-
నోటికి ప్లాస్టర్, ముక్కుకు ఐరన్ క్లిప్.. ఇంజినీరింగ్ విద్యార్థిని బలవన్మరణం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): ఊపిరాడకుండా నోటికి ప్లాస్టర్, ముక్కుకు ఐరన్ క్లిప్ పెట్టుకుని పిడికిళ్లు బిగించుకుని సోమవారం గుంటూరులో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం... ఏలూరు జిల్లా శ్రీరామవరం ప్రాంతానికి చెందిన కమ్మ రాజు రైతు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె శ్రావ్య (20) గుంటూరు అశోక్‌నగర్‌లోని నవీన్ లేడీస్ హాస్టల్లో ఉంటూ వీవీఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో నాలుగో సంవత్సరం బీటెక్ చదువుతోంది.చదువులో చురుగ్గా ఉంటూ 85 శాతం మార్కులు సాధిస్తోంది. అయితే, ఆదివారం సాయంత్రం శ్రావ్య తన చిన్ననాటి స్నేహితురాలైన జాగృతికి ఫోన్‌చేసి తనకు చాలా చికాకుగా ఉందని, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందంటూ కన్నీరుమున్నీరైంది. దీంతో స్నేహితురాలు ధైర్యం చెప్పింది. అయినా అనుమానంతో జాగృతి.. శ్రావ్య సోదరుడికి ఫోన్‌చేసి జరిగిన విషయం వివరించింది. అతను తన తల్లికి చెప్పడంతో ఆమె వెంటనే ఏలూరు వచ్చేయాల్సిందిగా కుమార్తెకు చెప్పింది. అయితే, గురువారం నుంచి సెలవులు కాబట్టి అప్పుడు వస్తానని తన తల్లితో శ్రావ్య చెప్పింది. ఆన్లైన్లో ప్లాస్టర్, ఐరన్ క్లిప్ ఆర్డర్.. కానీ, శ్రావ్య ఆదివారం రాత్రే ఆత్మహత్య చేసుకునేందుకు ప్లాస్టర్‌ను, ఐరన్ క్లిప్‌ను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంది. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో డెలివరి వచ్చింది. హాస్టల్లోని తోటి స్నేహితులు ఆరుబయట మెట్లపై ఎందుకు కూర్చున్నావని శ్రావ్యను అడగటంతో ఆమె దురుసుగా మాట్లాడింది. దీంతో వారంతా లోపలకు వెళ్లిపోయారు. తర్వాత కొద్దిసేపటికి నోటికి ప్లాస్టర్, ముక్కుకు ఐరన్ క్లిప్‌ను పెట్టుకుని రెండు పిడికిళ్లు గట్టిగా బిగించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తెల్లవారుజామున తోటి విద్యార్థినులు గదిలో నుంచి బయటకొచ్చి చూసి భయంతో హాస్టల్ వార్డెన్‌కు సమాచారమిచ్చారు.సమాచారం అందుకున్న వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్, సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ తరంగిణి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. హాస్టల్లో సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. తోటి విద్యార్థినులతో వారు మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. శ్రావ్య కుటుంబ సభ్యులు హాస్టల్‌కు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు శ్రావ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుంటూరులో జనసేన కార్యకర్తల దాష్టీకం
గుంటూరు ఈస్ట్: గుంటూరు లక్ష్మీపురంలో జనసేన కార్యకర్తల దాష్టీకమిది. ప్రైవేటు హాస్టల్ బోర్డుపై కులం పేరు ఉందన్న కారణంతో జనసేన కార్యకర్తలు ఆ హాస్టల్ యజమానిని కొట్టి మోకాళ్ల మీద కూర్చొబెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తోంది. జనసేన కార్యకర్తల దురాగతాన్ని ప్రజలు ఖండిస్తున్నారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు హాస్టల్లోకి మంగళవారం కొందరు జనసేన కార్యకర్తలు కర్రలతో ప్రవేశించారు. హాస్టల్ యజమానిని బయటకు పిలిచి బోర్డు పైన ఉన్న ఓ సామాజికవర్గం పేరును తొలగించాలని బెదిరించారు. హాస్టల్ యజమాని అందుకు నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తులైన జనసేన కార్యకర్తలు మూకుమ్మడిగా హాస్టల్ యజమానిపై దాడి చేశారు. వదిలిపెట్టాలని హాస్టల్ యజమాని ప్రాధేయపడినా వదల్లేదు. పైగా జనసేన కార్యకర్తలు హాస్టల్ యజమానిని మోకాళ్ల మీద కూర్చోబెట్టి, వారి కాళ్ళు పట్టించుకున్నారు. అయితే జనసేన కార్యకర్తలకు భయపడిన హాస్టల్ యజమాని ఈ ఘటనపై పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేశాడు. గుంటూరులోని లక్ష్మీపురంలో హాస్టల్ నేమ్ బోర్డ్ లో రెడ్డి అనే పేరు ఉన్నందుకు హాస్టల్ మీద కర్రలతో, రాళ్ళతో దాడి చేసి ఆ హాస్టల్యజమానిని కొట్టి బలవంతంగా మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్ళు పట్టించుకున్న @JanaSenaParty గూండాలు.ఇదేనా నీ కొత్తతరం రాజకీయం అంటే @PawanKalyan ? pic.twitter.com/cVK38l1ksB— YSR Congress Party (@YSRCParty) June 6, 2024 -
ప్రైవేటు హాస్టల్ ఓనర్ నిర్వాకంతో రోడ్డున పడ్డ విద్యార్థులు
-
ఎందుకిలా చేశావమ్మా?
కురబలకోట (చిత్తూరు జిల్లా): కురబలకోట మండలం అంగళ్లులో ఇంజనీరింగ్ విద్యార్థిని పి.భవ్య (19) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఉంటున్న ప్రైవేట్ హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ముదివేడు ఎస్ఐ సుకుమార్ కథనం మేరకు.. కడపకు చెందిన పి.భవ్య మదనపల్లె దగ్గర అంగళ్లులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. రెండు నెలల క్రితం కళాశాల దగ్గరున్న ఓ ప్రైవేట్ హాస్టల్లో చేరింది. అక్కడి నుంచి కళాశాలకు వెళ్లేది. సోమవారం కూడా హాస్టల్ నుంచి కళాశాలకు పరీక్ష రాయడానికి వెళ్లింది. కొంత సేపటికే తిరిగి హాస్టల్‌కు చేరుకుంది. పరీక్ష కూడా రాయలేదని చెబుతున్నారు. హాస్టల్ గది నుంచి ఆమె బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి హాస్టల్ నిర్వాహకులు చూశారు. పిలిచినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో చూశారు. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కన్పించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వీఆర్వో అంజికుమార్ సమక్షంలో గది తలుపు పగులగొట్టి లోనికి వెళ్లారు. ఘటన స్థలంలో ఆమె రాసిన సూసైడ్ నోట్ ఉంది. తన చావుకు ఎవరూ కారణం కాదని పేర్కొంది. తల్లి కృష్ణవేణి మధ్యాహ్నం అంగళ్లుకు చేరుకున్నారు. విగతజీవిగా మారిన కుమార్తెను చూసి.. ఎందుకిలా చేశావమ్మా..? అంటూ బోరున విలపించారు. ఈమె తండ్రి సంజీవరాయుడు విజయవాడలో సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్నారు. ఆమె రాసిన సుసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సారీ మమ్మీ.. సారీ డాడీ.. ‘‘నాకు వేరే మార్గం కనిపించలేదు.. నేను తప్పు చేస్తున్నా అని తెలుసు.. బట్ నన్ను మీరైనా అర్థం చేసుకోండి.. నేను ఇలా చేసుకున్నందుకు ఎవరూ రీజన్ కాదు.. బబ్లూ.. మంచిగా చదువుకొని అమ్మవాళ్లను బాగా చూసుకో.. అమ్మమాట విను. నేను చేసిన దానికి నాకు ఇదే పనిష్మెంట్..’’ ‘‘నన్ను అందరూ బాగా చూసుకున్నారు.. నామీద పెట్టుకున్న హోప్స్‌ని నిలబెట్టుకోలేక పోతున్నందుకు బాధపడకండి’’ (ఇంగ్లిష్‌లో భవ్య రాసిన సుసైడ్ నోట్ సారాంశం) -
హాస్టల్ యజమాని బరితెగింపు
విద్యార్థినులను గెంటేసిన వైనం రోడ్డుపైకి లగేజీ విసిరివేత పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు అదుపులో నిందితులు అమ్మాయిలకు ప్రత్యామ్నాయ వసతి ఏర్పాటు తిరుపతి క్రైం : తిరుపతి-రేణిగుంట మార్గంలోని గొల్లవానిగుంట వద్ద ఓ ప్రైవేట్ హాస్టల్లో ఓ విద్యార్థినిపై యజమాని దాడిచేసిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గొల్లవానిగుంటలోని భారతి ఉమెన్స్ హాస్టల్లో అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన 40 మంది డైట్ విద్యార్థులు ఉంటున్నారు. వీరు చేరేటప్పుడు అడ్వాన్స్‌ల కింద ఒక్కొక్కరు రూ.3 వేలు చెల్లించారు. నిలిచిపోయేందుకు సిద్ధమై అడ్వాన్స్ అడిగితే హాస్టల్ యజమాని భారతి, ఆమె కూతురు మూగతి ఇద్దరూ కలసి గౌతమి అనే విద్యార్థిపై చేయి చేసుకున్నారు. మేము డబ్బులు ఇవ్వం.. దిక్కున్న చోట చెప్పుకో అని బయటకు గెంటేశారు. దీంతో అక్కడున్న హాస్టల్ విద్యార్థులందరూ తిరగబడ్డారు. తమ అడ్వాన్స్‌లు ఇస్తే మేము నిలిచిపోతామని యజమానిని నిలదీయడంతో అందర్నీ కూడా రోడ్డుపై గెంటేసింది. రూముల్లో ఉన్న వారి లగేజీ మొత్తం తెచ్చి రోడ్డుపై పడేసింది. సాయంత్రం నుంచి కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ రోడ్డుపైనే ఉండడంతో స్థానికులు గుర్తించి డయల్ 100కు ఫిర్యాదు చేశారు. అలిపిరి సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ గణేష్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యజమానిని పిలిచి మాట్లాడగా మేము ఎవరినీ కొట్టలేదని, వారే మాపై తిరగబడి హాస్టల్‌ను ఖాళీ చేస్తామని రోడ్డుపైకి వచ్చారన్నారు. కానీ విద్యార్థులు మాత్రం వీరు తరచూ ఇలానే వాదిస్తుంటారని, కాలేజీ సమీపంలో ఉందని ఇక్కడ చేరామని తెలిపారు. యజమాని భారతి దీన్ని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించింది. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా వాగ్వాదానికి దిగింది. విద్యార్థిని గౌతమి ఫిర్యాదు మేరకు భారతీని, ఆమె కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులే రోడ్డుపైనే ఉన్న విద్యార్థినులను, వారి లగేజీని ఓ వ్యాన్‌లో తీసుకుని మరో చోట వసతి కల్పించేందుకు వెళ్లారు. కనీసం ఆడపిల్లలని కూడా చూడకుండా రాత్రి సమయంలో హాస్టల్ బయటకు తరిమేసిందని హాస్టల్ యజమానిని స్థానికులు నిలదీశారు. సీఐ నచ్చజెప్పడంతో వ్యవహారం సద్దుమణిగింది. -
విశాఖలో ప్రైవేట్ హాస్టల్లో అగ్నిప్రమాదం
విశాఖపట్నం: నగరంలోని ఎమ్వీపీ కాలనీ ప్రైవేట్ హాస్టల్లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు, బట్టలు అగ్నికి ఆహూతైయినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. ప్రైవేట్ హాస్టల్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తమ పుస్తకాలు, బట్టలు కాలిపోయ్యాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి షార్ట్ సర్య్కూట్ కారణమని తెలుస్తోంది.