చంద్రబాబు జేబు సంస్థగా మారిన కేంద్ర దర్యాప్తు సంస్థ
వైఎస్సార్‌సీపీ నాయకులపై యథేచ్ఛగా దాడులు.. కేసులు
ఎల్లో మీడియా శివాలెత్తిన తర్వాతే.. అవినాష్ కు నోటీసు
చంద్రబాబు రాజకీయ అవసరాలు తీర్చే సాధనంలా ఈడీ
ఆయన వేస్తున్న సిట్‌లకు ఎక్స్‌టెన్షన్ ఆఫీసులా మారిన వైనం
పొలిటికల్ ప్రెస్‌నోట్లు.. రాజకీయ పార్టీలాగా ట్వీట్లు..
ఇపుడు టార్గెట్ జగన్.. ప్రజాక్షేత్రం నుంచి తప్పించే కుట్ర
కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ తెలంగాణ హైకోర్టులో ఈడీ పిటిషన్
మా పర్యవేక్షణలోనే రెగ్యులర్ విచారణ జరుగుతోందన్న హైకోర్టు
మళ్లీ పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరమేమిటని ప్రశ్నించిన ధర్మాసనం
సీబీఐ ప్రధాన కేసు తేలకుండా ఈడీ ముందుకెళ్లడానికి లేదు
సీబీఐ కేసులో తీర్పు ముందుగా రావడం న్యాయ ప్రయోజనాలకు అనుకూలం
జగతి కేసులో ఈ విషయాన్ని స్పష్టం చేసిన ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం
విజయ్ మదన్‌లాల్ చౌదరి కేసులోనూ ఇదే విషయాన్ని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు.. అయినా బాబు కోసం ఈడీ బరితెగింపు
ఆయన చెప్పినట్లల్లా ఆడుతూ పరువు బజారున పడేసుకుంటున్న ఈడీ
సాక్షి, అమరావతి, హైదరాబాద్: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ విభాగం పరిధిలో పనిచేసే దర్యాప్తు సంస్థ. ప్రధానంగా మనీలాండరింగ్, విదేశీ మారకద్రవ్య చట్టాల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేయడం దీని బాధ్యత. కానీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కాస్తా ‘ఎల్లో ఫోర్స్ డైరెక్టరేట్’గా రూపాంతరం చెందింది. బాధ్యతలను గాలికొదిలేసింది. చట్టాలను, కోర్టులను చట్టుబండలను చేసేసింది. ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది.
ఆడమన్నట్టల్లా ఆడడం. ఏది చెబితే అది చేయడం... ఈడీ ఓ కేంద్ర దర్యాప్తు సంస్థ అనుకుంటే చంద్రబాబు జేబు సంస్థ అయిపోయిందని విమర్శకులంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇతరులపై నమోదైన మనీలాండరింగ్ కేసుల విచారణను వేగవంతం చేయాలని, వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సంధించిన ప్రశ్నలు చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా అర్ధమౌతుంది.
ఇప్పటికే రెగ్యులర్ విచారణ జరుగుతూ హైకోర్టు పర్యవేక్షణలో ఉన్న వ్యవహారంపై మళ్లీ పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరమేమిటని ధర్మాసనం ప్రశ్నించింది, ఆర్థికల్ 21 ప్రస్తావనపై సందేహాలు వ్యక్తం చేసింది. మరోవైపు, వైఎస్సార్‌సీపీ నాయకులకు నోటీసులు, వాటిపై ముందుగానే ఎల్లో మీడియా లో కథనాలు, ఈడీ ప్రెస్‌నోట్, పొలిటికల్ పార్టీ తరహాలో చేసిన ట్వీట్ చూస్తే ఈడీ ఏ స్థాయికి ‘ఎల్లో ఫోర్స్’గా దిగజారిందో తేటతెల్లమవుతుంది. పలు కేసుల సందర్భంగా సుప్రీంకోర్టు, దిగువ కోర్టులు పలు మార్లు మొట్టికాయలు వేసినా ఈడీ తీరు మారడం లేదు.
అవినాష్‌కు నోటీసు.. ముందే ఎల్లో మీడియాలో..
వివేకా హత్య కేసుతో ఎలాంటి సంబంధమూ లేని అవినాష్ రెడ్డిపై ఆరోపణలు, సీబీఐ దర్యాప్తు, చార్జిషీట్లు, అనుబంధ చార్జిషీట్లు అన్నీ ముగిసి కోర్టులో విచారణ కూడా కొలిక్కి వచ్చిన తర్వాత చంద్రబాబుకు మళ్లీ ఏడేళ్ల తర్వాత అవినాష్ అవసరమొచ్చాడు. వెంటనే ఈడీ రంగంలోకి దిగింది. చంద్రబాబు చెప్పినట్టుగానే.. చెప్పిన సమయంలోనే ఓ నోటీసు ఇచ్చేసింది. ఇక్కడ విశేషమేమిటంటే.. అవినాష్ కు అక్టోబర్ 3న నోటీసు ఇస్తే.. నోటీసు ఇవ్వబోతున్న విషయం చంద్రబాబుకు సన్నిహితులైన ఎల్లో మీడియా అధినేతలకు మూడు రోజులు ముందే తెలిసిపోయింది. అక్టోబర్ 1నే ఈ నోటీసు విషయాన్ని ఎల్లో పత్రికలు, చానళ్లు ప్రముఖంగా ప్రచురించేసాయి.. ప్రసారం చేసేశాయి.
అంటే అర్ధం కావడం లేదూ ఈడీ ఏం చేస్తుందో.. ఎవరి తరఫున పనిచేస్తుందో... ఒక్క అవినాషే కాదు.. చంద్రబాబు వేలు ఎవరివైపు తిరిగితే వాళ్లను వేధించడం ఈడీ ప్రధాన బాధ్యత అన్నట్టు అయిపోయింది. మిధున్‌రెడ్డి అయినా, కారుమూరి నాగేశ్వరరావైనా, సునీలైనా, అంబటి రాంబాబైనా.. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అయినా.. విక్రాంత్‌రెడ్డి అయినా.. నోటీసులు, అరెస్టులు, వేధింపులు మామూలే. చంద్రబాబుకు అవసరమొచ్చినపుడు వెంటనే ఈడీ వాలిపోతోంది. బాబు ప్రత్యర్థులకు.. అంటే వైఎస్సార్‌సీపీ నాయకులకు నోటీసులు.. జనం దృష్టిని మళ్లించడం మామూలైపోయింది. అంటే చంద్రబాబు రాజకీయ అవసరాలను తీర్చే ఒక పనిముట్టులా ఈడీ మారిపోయింది.
టార్గెట్ జగన్... ఈడీ కొత్త మిషన్..
ఈడీకి చంద్రబాబు ఇప్పుడు ఓ కొత్త మిషన్ అప్పగించారు. అదే టార్గెట్ జగన్. అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ తమ వాణి వినిపిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ప్రజాక్షేత్రం నుంచి తప్పించి కోర్టుల చుట్టూ తిప్పాలని చంద్రబాబు కుట్ర పన్నారు. అందులో భాగంగానే వేగవంతమైన విచారణ పేరుతో వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈడీ హైకోర్టును అభ్యర్థించడం. అంటే చంద్రబాబు కోసం పనిచేయడం తప్ప ఇందులో ఈడీ చట్టబద్ధంగా చేస్తున్న డ్యూటీ ఏదీ లేదు. ఎందుకంటే సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులపై ఇప్పటికే రోజువారీ ట్రయల్ నడుస్తోంది. జగన్ తరఫున న్యాయవాదులు హాజరై తమ వాదనలను కూడా వినిపిస్తున్నారు.
ఈ ప్రక్రియ కొనసాగుతుండగా వ్యక్తిగతంగా జగన్ హాజరు కావాలంటూ ఈడీ పిటిషన్ వేయడం కచ్చితంగా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకోసం జరుగుతున్న దురుద్దేశ చర్య మాత్రమేనని ఎవరికైనా ఇట్టే అర్ధమౌతుంది. చంద్రబాబు వేస్తున్న సొంత సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)లు ఆయన క్షేమం కోసం, ఆయన చెప్పినట్లు దర్యాప్తు చేయడం కోసం పరుగులు పెడుతుంటాయి. ఇపుడు ఈడీ కేంద్ర దర్యాప్తు సంస్థ అనే గౌరవాన్ని కోల్పోయిందని, చంద్రబాబు సిట్‌కు ఎక్స్‌టెన్షన్ ఆఫీసులా మారిపోయిందని న్యాయవర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి.

కోర్టులెన్ని మొట్టికాయలు వేసినా..
ఆల్రెడీ సీబీఐ కోర్టులో రెగ్యులర్‌గా విచారణ జరగడం, హైకోర్టుకు ఎప్పటికప్పుడు రిపోర్టులు సబ్‌మిట్ చేయడం జరుగుతున్నాయి. అయినా తుత్తర ఆగక ఈడీ అడిగినట్టుగానే కొద్దికాలం క్రితం డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు వేగవంతమైన విచారణ జరగాలంటూ కేసు వేస్తే దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసిన సంగతి తెల్సిందే. అలాగే మరో రెండు కేసుల విచారణ సందర్భంగానూ కోర్టులు స్పష్టమైన తీర్పులిచ్చాయి. తెలంగాణ హైకోర్టులో జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు అనుమతిస్తూ 2022 సెప్టెంబర్8న జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం అతి ముఖ్యమైన తీర్పునిచ్చింది. ఈడీ కేసులో తుది తీర్పును సీబీఐ ప్రధాన కేసులో తీర్పు వెలువడే వరకు వాయిదా వేయాలని ధర్మాసనం పేర్కొంది. సీబీఐ కేసులో తీర్పు ముందుగా రావడం న్యాయ ప్రయోజనాలకు అనుకూలమని పేర్కొంది.
నేరం ద్వారా ఆదాయం వచ్చిందని నిర్ధారించే ముందు, అసలు ఆ వ్యక్తి సంబంధిత నేరానికి పాల్పడ్డాడా లేదా అన్నది పరిశీలించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. అలాగే విజయ్ మదన్‌లాల్ చౌదరి వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో 2022 జులై 27న సుప్రీంకోర్టు కూడా ఇదే విధమైన తీర్పు ఇచ్చింది. అసలు నేరం జరిగిందా? ఎవరి పాత్ర ఎంత అనే విషయాలను సీబీఐ తేల్చాల్సి ఉందని, ఆ తర్వాతే నేరం ద్వారా వచ్చిన ఆదాయానికి సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందా లేదా అనే విషయాలను ఈడీ తేల్చ వచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. మరి జగన్ కేసుల విషయంలో ఈడీ ఎందుకు తొందర పడుతోంది? వాస్తవమేమిటో తేలకుండా తొందరపాటులో ఔచిత్యమేమిటి? ఎవరు చెబితే ఇలా నిబంధనలకు, న్యాయస్థానాలకు విరుద్ధంగా ఈడీ తొందరపడుతోంది...?
తప్పుడు కేసులు.. త్వరగా ముగియాలనే..
నిజానికి సీబీఐ, ఈడీ అక్రమంగా మోపిన అభియోగాలు, తప్పుడు కేసులు త్వరగా ముగిసిపోవాలని, నిజానిజాలేమిటో తేలిపోవాలనే వైఎస్ జగన్ కోరుకుంటున్నారని ఆయన తరఫు న్యాయవాదులు అనేకమార్లు స్పష్టం చేశారు. జగన్ తరఫు న్యాయవాదులు కానీ, జగతి తరఫు న్యాయవాదులు కానీ సీబీఐ అక్రమ కేసుల్లో ఎప్పుడూ వాయిదా తీసుకోలేదు. అంటే కేసులు త్వరత్వరగా విచారణ జరగాలనే కోరుకున్నారని అర్ధం కావడం లేదూ?
పొలిటికల్ ప్రెస్‌నోట్.. ట్వీట్..
కొత్తగా కేసులు నమోదైనప్పుడో, లేదా ఒక కేసుకు సంబంధించి రికవరీలు ఉన్నప్పుడో ఈడీ ప్రెస్‌నోట్లు విడుదలచేయడం సహజంగా జరుగుతుంటుంది. కాని, అకస్మాత్తుగా ఏ పరిణామం లేకుండానే, కొనసాగుతున్న కేసులగురించి, అందులోనూ కోర్టుల్లో ట్రయల్ నడుస్తున్న కేసులగురించి ఈడీ ప్రెస్‌నోట్ రిలీజ్‌చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈడీ ప్రెస్ నోట్ చూస్తే అందులో అది దర్యాప్తు సంస్థ ప్రెస్‌నోట్ మాదిరిగా కాకుండా, పూర్తిగా రాజకీయ అంశాలతో ముడిపడినట్టుగా స్పష్టంగా ఉంది. ఈడీ ప్రకటన వెలువడిన వెంటనే ఎల్లో మీడియా మరింత శివాలెత్తిపోయింది. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమేనని అర్ధం కావడం లేదూ? అయినా ఓ రాజకీయ పార్టీ ట్వీట్ చేసినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థ ట్వీట్ చేయడం చూస్తే ఇందులో ఎలాంటి రాజకీయ కుట్ర దాగి ఉందో తెలుస్తూనే ఉంది.
ఈడీ బరితెగింపును బట్టబయలు చేసిన హైకోర్టు..
జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమంగా మోపిన కేసుల విచారణకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. ఈడీపై కీలక ప్రశ్నలు సంధించింది. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే హైకోర్టు పర్యవేక్షిస్తోందని, ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ ఆదేశాలు కూడా ఇచ్చినప్పుడు మళ్లీ పిటిషన్ దాఖలు చేయడంలో ఈడీ ఉద్దేశమేమిటని ప్రశ్నించింది. సంబంధిత కేసుల విచారణలో సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఉన్న ఆచరణాత్మక ఇబ్బందులు తమకు తెలుసని వ్యాఖ్యానించింది.
జగన్‌తో పాటు ఇతరులపై నమోదైన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కేసుల్లో రోజువారీ విచారణ జరిపించి, త్వరితగతిన విచారణ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.శామ్ కోషి, జస్టిస్ నర్సింగ్‌రావు నందికొండ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ ఈ అంశంపై ఆదేశాలు జారీ చేసినప్పుడు, మరో పిటిషన్ దాఖలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై హైకోర్టు పర్యవేక్షణ కొనసాగుతున్నప్పుడు, మళ్లీ ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఏమిటన్న అంశాన్ని ప్రస్తావించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినదని గుర్తుచేస్తూ, ఈడీ తన పిటిషన్‌లో ఆ నిబంధనను ఎలా ప్రస్తావిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటికే ఇదే అంశానికి సంబంధించి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో, తాజా పిటిషన్ విచారణార్హతపైనా సందేహం వ్యక్తం చేసింది. ఇదే అంశానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్), సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు నమోదైన సుమోటో కేసులతో కలిపి ప్రస్తుత పిటిషన్‌ను విచారణకు జాబితా చేయాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది.


