Eligibility Is Standard Electricity Subsidy For Everyone - Sakshi
Sakshi News home page

అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ విద్యుత్‌ సబ్సిడీ 

Published Thu, Jul 27 2023 4:17 AM

Eligibility is standard electricity subsidy for everyone - Sakshi

పాడిందే పాడరా.. అన్నట్టు పాసిపోయినా అబద్ధమైతే చాలు ఈనాడుకు మహా ఇష్టం. అదే అబద్ధాన్ని ప్రచారం చేస్తే నిజమైపోతుందనే భ్రమలో ఉన్నారు రామోజీ. ‘ఎస్సీ ఎస్టీల బతుకుల్లో జగనన్న  కారు చీకట్లు’ అంటూ అలవాటు ప్రకారం గతంలో అనేకసార్లు రాసిన అసత్యాల కథనాన్నే మరోసారి అచ్చేసింది.

పాసిపోయిన తప్పుడు సమాచారాన్నే మళ్లీ వడ్డించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో విద్యుత్‌ వెలుగులు ప్రసరిస్తున్నాయని విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు స్పష్టం చేశాయి. ఈనాడు రాసిన అసత్య కథనంలోని వాస్తవాలను వెల్లడించాయి. డిస్కంలు తెలిపిన వివరాల ప్రకారం..

గతం కంటే 3 రెట్లు ఎక్కువ
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీ కాలనీల్లో, ఎస్టీ ప్రాంతాల్లో నివసిస్తున్న అర్హులైన వారందరికీ ఉచిత గృహ విద్యుత్‌ పరిమితిని 100 యూనిట్ల నుంచి 200 యూనిట్లకు పెంచింది. గత ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్తుకంటే రెట్టింపు యూనిట్లు అధికంగా అందిస్తోంది. అర్హతనే ప్రామాణికంగా తీసుకుని వినియోగదారులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది.

వినియోగదారుల ధ్రువీకరణ పత్రాలను డిస్కంల క్షేత్రస్థాయి సిబ్బంది పరిశీలించి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నారు. అర్హత ఉన్న ఒక్కరికి కూడా తిరస్కరించలేదు. ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న విద్యుత్‌ సబ్సిడీ కూడా గత ప్రభుత్వంతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు పెరిగింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018–19లో దీని కోసం రూ.235 కోట్లు ఖర్చు చేస్తే, ఈ ప్రభుత్వం రూ.637 కోట్లు ఖర్చు చేస్తుండటమే దీనికి నిదర్శనం.

అర్హత కలిగిన ఎవరికీ ఈ విద్యుత్‌ రాయితీ  ఎత్తివేయలేదు. సాంకేతిక తప్పిదాలు, క్షేత్రస్థాయి వాస్తవాలలో తేడాలేమైనా ఉంటే డిస్కంల  స్థానిక అధికారుల దృష్టికి తీసుకు వస్తే  తప్పకుండా  సరిదిద్ది అర్హత కలిగిన వారికి లబ్ధి చేకూర్చడం జరుగుతోంది. ఎవరికైనా రాయితీ అందకపోతే గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించాలి.

అక్కడున్న సిబ్బంది అర్హులకు దరఖాస్తు నింపడంలో, అవసరమైన ధ్రువపత్రాల జారీలోనూ సహాయపడతారు. వాస్తవాలు ఇలా ఉంటే.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై బురద జల్లేలా, ప్రజలను పక్కదోవ పట్టించేలా నిజా­లను దాచి ఈనాడు పత్రిక అబద్ధాలను అచ్చేసింది.

– సాక్షి, అమరావతి

Advertisement
Advertisement