
తెలంగాణలో సిగాచీ పరిశ్రమ దుర్ఘటనలో ఎనిమిది మంది ఏపీ వాసుల మృతి.
సుమారు 18 మంది క్షతగాత్రులు
బాధిత కుటుంబసభ్యులకు సహాయం కోసం రాని రాష్ట్ర ప్రభుత్వం
తమ రాష్ట్రవాసుల కోసం అధికారులను పంపిన బిహార్, ఒడిశా ప్రభుత్వాలు
శ్రీకాకుళం జిల్లా జి.శిగడం మండలం పాలకడియం గ్రామానికి చెందిన వెంకటేశ్ సిగాచీ పరిశ్రమలో సీనియర్ కెమిస్ట్. మూడురోజుల కిందట జరిగిన పేలుడు ఘటనలో అతడు మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే రోజులు గడుస్తున్నా తన కొడుకు మృతదేహాన్ని అప్పగించని పరిస్థితి. దీంతో మృతుని తండ్రి చిన్నారావు ఆవేదనకు అంతులేదు. హెల్ప్‌డెస్క్ వద్ద, మార్చురీ వద్ద తమ బిడ్డ మృతదేహం కోసం పడరాని కష్టాలు పడుతున్నాడు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సిగాచీ పరిశ్రమ దుర్ఘటనలో మరణించిన, క్షతగాత్రులైన బిహార్, ఒడిశా కుటుంబాలకు సహాయం చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నతాధికారుల బృందాలను పంపింది. కానీ ∙ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ తరహా చొరవ చూపడం లేదు. ఈ దుర్ఘటనలో 8 మంది ఏపీ వాసులు మృత్యువాత పడ్డారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నారు. ఇతర రాష్ట్రాల అధికారులు దగ్గరుండి తమ రాష్ట్రాల బాధిత కుటుంబాలకు సహాయమందిస్తుంటే ఏపీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఒక్క అధికారి కూడా అటువైపు తొంగిచూడలేదు. దీనిపై బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
రోజుల తరబడి నిరీక్షణ
ఏపీకి చెందిన మృతుల్లో విజయనగరం, కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్, తూర్పుగోదావరి తదితర జిల్లాలకు చెందిన వారున్నారు. అయితే గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో మృతదేహాల అప్పగింత ప్రహసనంగా మారింది. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి మృతదేహాలను అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో మృతదేహాలు ఇంకా అందక ఆయా కుటుంబాలు పాశమైలారం పారిశ్రామిక వాడలో నరకయాతన అనుభవిస్తున్నారు. తమ వారిని కోల్పోయిన దుఖం కంటే.. కడసారి చూపు కోసం వారు పడుతున్న బాధ వర్ణణాతీతం. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద బాధిత కుటుంబాలు కన్నీరు ఇంకిన కళ్లతో వేచి చూస్తున్నాయి. బిహార్, ఒడిశా రాష్ట్రాల మాదిరిగా తమకు సహాయం అందించేందుకు తమ అధికారులెవరూ రాలేదని వాపోతున్నాయి.