ఏదినిజం?: గోబెల్స్‌ను మించిన రామోజీ!

Eenadu Ramoji Rao Fake News On Polavaram Project - Sakshi

పోలవరంపై జల్‌ శక్తి శాఖ, పీపీఏ, డీడీఆర్పీ, సీడబ్ల్యూసీలతో రాష్ట్ర జలవనరుల శాఖ ఉత్తర ప్రత్యుత్తరాలు 

పీపీఏ కార్యదర్శి లేఖను పట్టుకుని రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లుతూ ‘ఈనాడు’ విషపు రాతలు 

చంద్రబాబు కమీషన్ల దాహంతోనే దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ 

సీడబ్ల్యూసీ డిజైన్‌ మేరకు దిగువ కాఫర్‌ డ్యామ్‌లో అగాధం పూడ్చివేత 

జెట్‌ గ్రౌటింగ్‌తో ఇసుక పొరలు జారిపోతున్నందున అధిక శ్రమతో పీయూ గ్రౌటింగ్‌  

లభ్యత తక్కువగా ఉన్నా 2.30 లక్షల జియో మెంబ్రేన్‌ బ్యాగ్‌లను తెప్పించిన ప్రభుత్వం 

జూలై 9 నాటికే 20 మీటర్ల ఎత్తుకు దిగువ కాఫర్‌ డ్యామ్‌ పూర్తి 

జూలై రెండో వారంలోనే గోదావరికి భారీ వరదలు 

దాంతో దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులకు ఆటంకం 

పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం నాడు చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేస్తే రామోజీ పట్టించుకోలేదు. ఎందుకంటే చంద్రబాబు తనవాడు కాబట్టి... తన కుమారుడు కిరణ్‌ వియ్యంకుడికి చెందిన నవయుగకు అక్రమంగా రూ.6,522.2 కోట్ల విలువైన పనులు కట్టబెట్టారు కాబట్టి.. చంద్రబాబు, వియ్యంకుడితో కలిసి దోచుకో.. పంచుకో.. తినుకో(డీపీటీ) విధానంలో అందినంత దోచుకున్నారు కాబట్టి. కమీషన్లు వచ్చే పనులకే అధిక ప్రాధాన్యం ఇచ్చి పోలవరంలో పనుల్లో జాప్యానికి చంద్రబాబు కారణమైతే దాన్ని ‘రామోజీ’ కప్పెట్టే దుస్సాహసానికి ఒడిగట్టారు. ఓ అబద్ధాన్ని పదే పదే అచ్చేస్తే నమ్ముతారనేది ‘ఈనాడు’ మార్కు పాత్రికేయం.అస్మదీయుడు చేసిన తప్పును తస్మదీయుడిపైకి నెట్టేలా పదే పదే విషపురాతలు రాస్తుండటమే అందుకు తార్కాణం. పోలవరానికి సంబంధించి కేంద్ర జల్‌ శక్తి శాఖ, సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ, పీపీఏలు రాష్ట్ర జలవనరుల శాఖతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించడం సాధారణం. ఈ క్రమంలో పీపీఏ రాసిన ఓ లేఖను పట్టుకుని.. ‘ఈ పాపం మీదే’ అంటూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై బురద జల్లుతూ బుధవారం ‘ఈనాడు’లో రామోజీ ఓ కథనాన్ని అచ్చేశారు. అందులో నిజమెంతంటే నేతి బీరకాయలో నెయ్యంత..!! ఇదిగో చూద్దాం..

సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. అనుమతులు, డిజైన్లతోసహా అన్నీ తామే తెచ్చి వంద శాతం వ్యయాన్ని భరించి ప్రాజెక్టును పూర్తి చేసి ఇస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చింది. కేంద్రమే పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని 2014 జూన్‌ 8 నుంచే నాడు చంద్రబాబు అడుగుతూ వచ్చారు. ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టేందుకు సిద్ధపడటంతో 2016 సెప్టెంబరు 7న పోలవరం నిర్మాణ బాధ్యతలను గత సర్కారుకు కేంద్రం అప్పగించింది. జల్‌ శక్తి శాఖ, జలసంఘం(సీడబ్ల్యూసీ), డీడీఆర్పీ(డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌), పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ సమన్వయంతో ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలి.

రాష్ట్ర జలవనరుల శాఖతో కేంద్ర జల్‌ శక్తి శాఖ, సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ, పీపీఏలు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు అడిగిన సమాచారాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ అందజేస్తుంది. ఈ క్రమంలో 2024 జూన్‌కు ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఈ ఏడాది ఏప్రిల్‌లో కార్యాచరణ ప్రణాళికను పీపీఏకు రాష్ట్ర జలవనరుల శాఖ అందజేసింది. దీన్ని పీపీఏ, కేంద్ర జల్‌ శక్తి శాఖ ఆమోదించాయి. ఆ గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని జూలై 22న పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. ఆ లేఖలో పీపీఏ ప్రస్తావించిన అంశాలపై రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి సమాధానం ఇస్తారు.

జాప్యం పాపం బాబుదే..
► చంద్రబాబు కమీషన్ల దాహం ఫలితంగా దిగువ కాఫర్‌ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే విధానాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌ ఆఖరులో సీడబ్ల్యూసీ ఖరారు చేసింది. జెట్‌ గ్రౌటింగ్‌ చేసి జియో మెంబ్రేన్‌ బ్యాగ్‌లలో ఇసుక నింపి కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చాలని.. 30 మీటర్ల మేర డయాఫ్రమ్‌ వాల్‌ వేసి.. 30.5 మీటర్ల ఎత్తుకు కాఫర్‌ డ్యామ్‌ నిర్మించాలని సూచించింది. జూలై 31 నాటికి ఈ పనులు పూర్తి చేయాలని పేర్కొంది. 
► కోతకు గురైన ప్రాంతంలో జెట్‌ గ్రౌటింగ్‌ వేస్తుంటే ఇసుక పొరలు జారిపోయి పీయూ(పాలీయురిథేన్‌) గ్రౌటింగ్‌ చేయాల్సి వచ్చింది. ఇది అధిక శ్రమ, సమయంతో కూడిన పని. 
► ప్రపంచవ్యాప్తంగా జియో మెంబ్రేన్‌ బ్యాగ్‌ల వినియోగం అతి తక్కువగా ఉంటుంది. వాటి లభ్యత కూడా తక్కువే. దాంతో 2.30 లక్షల జియో మెంబ్రేన్‌ బ్యాగ్‌ల తయారీకి గుజరాత్, అస్సోం సంస్థలకు అప్పగించి వాటిలో ఇసుక నింపి కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చారు. ఆ తర్వాత 30 మీటర్ల మేర డయాఫ్రమ్‌ వాల్‌ వేసి దానిపై దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు చేపట్టారు.
► 20 మీటర్ల ఎత్తుకు దిగువ కాఫర్‌ డ్యామ్‌ జూలై 9 నాటికి పూర్తయింది. గోదావరికి జూలైలో ఎన్నడూ భారీ వరద వచ్చిన దాఖలా లేదు. ఈ ఏడాది జూలై 10న ఎగువ నుంచి భారీ వరద రావడంతో దిగువ కాఫర్‌ డ్యామ్‌ను వరద ముంచెత్తింది. పనులకు ఆటంకం కలిగింది. లేదంటే జూలై 31 నాటికే దిగువ కాఫర్‌ డ్యామ్‌ పూర్తయ్యేది. ఇదే అంశాన్ని పీపీఏకు రాష్ట్ర జలవనరుల శాఖ వివరించనుంది. 

వరదల్లో పరీక్షలు సాధ్యమా?
ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చటానికి 11 రకాల పరీక్షలు చేసి జూలై 15 నాటికి నివేదిక ఇవ్వాలని మే 17న ఢిల్లీలో కేంద్ర జల్‌ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖకు సూచించారు. ఆ మేరకు చేపట్టిన పరీక్షలు తుది దశకు చేరుకుంటున్న దశలో దిగువ కాఫర్‌ డ్యామ్‌ మీదుగా గోదావరి వరద ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతంలోకి చేరింది. వరదల్లో పరీక్షలు నిర్వహించడం అసాధ్యం. ఇదే అంశాన్ని పీపీఏకు వివరిస్తూ వరదలు తగ్గాక పరీక్షలు నిర్వహించి నివేదిక అందిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి లేఖ రాయనున్నారు.

ఇటీవల లోక్‌సభలో పోలవరంపై జరిగిన చర్చలో కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ మాట్లాడుతూ.. ఎవరూ ఊహించని రీతిలో ఈ ఏడాది గోదావరికి జూలై రెండో వారంలోనే భారీ వరద వచ్చిందని.. దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులకు ఆటంకం కలిగిందని తెలిపారు. వరదలు తగ్గాక దిగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేసి 2024 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా ప్రణాళిక రచించామని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పనులు చేపట్టిందని వివరించారు. ఇదంతా ‘ఈనాడు’ అధిపతికి తెలిసినా చంద్రబాబు చేసిన తప్పిదాలను సీఎం జగన్‌పై నెడుతూ విషప్రచారం చేస్తున్నారు.

చంద్రబాబు కమీషన్ల దాహం వల్లే..
► నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌ వే నిర్మించి.. నిర్వాసితులకు పునరావాసం కల్పించాక,స్పిల్‌ వే మీదుగా నదీ ప్రవాహాన్ని మళ్లించేలా కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేశాక.. ప్రధాన డ్యామ్‌ పునాది వేయాలి. ప్రపంచవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు.
► చంద్రబాబు సర్కారు 2014 జూన్‌ 8 నుంచి 2016 డిసెంబర్‌ 30 వరకూ అంటే అధికారంలోకి వచ్చిన తొలి 31 నెలల్లో పోలవరంలో తట్టెడు మట్టెత్తలేదు. టీడీపీ ఎంపీ రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ను అడ్డుపెట్టుకుని పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించారు. కమీషన్లు వచ్చే పనులకు చంద్రబాబు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. స్పిల్‌ వే పూర్తి చేయకుండా.. 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా.. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు కట్టకుండా.. ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌(ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ పునాది డయా ఫ్రమ్‌వాల్‌ను బావర్‌ సంస్థకు సబ్‌ కాంట్రాక్టుకు ఇచ్చేసి కమీషన్లు వసూలు చేసుకున్నారు.

► ఆ తర్వాత 2018 ఫిబ్రవరి 27న ట్రాన్స్‌ట్రాయ్‌పై 60సీ నిబంధన కింద వేటు వేసి మిగిలిన రూ.3,302 కోట్ల విలువైన పనులను నామినేషన్‌ పద్ధతిలో రామోజీ వియ్యంకుడికి చెందిన నవయుగకు కట్టబెట్టేశారు. స్పిల్‌ వేను పూర్తి చేయకుండానే ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను ప్రారంభించి 2019 ఫిబ్రవరిలో మధ్యలోనే వదిలేశారు. 
► నిర్వాసితులకు పునరావాసం కల్పించలేక.. ఎగువ కాఫర్‌ డ్యామ్‌కు ఇరు వైపులా 750 మీటర్లు, దిగువ కాఫర్‌ డ్యామ్‌ కుడి వైపున 600 మీటర్లు ఖాళీ ప్రదేశాన్ని వదిలేశారు. చంద్రబాబు ఈ పాపాలకు పాల్పడకపోయి ఉంటే 2021 నాటికే పోలవరం పూర్తయ్యేదని
జలవనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి.

ఈ పాపం టీడీపీ సర్కార్‌దే..
►  2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడంతో 2019 మే 30న సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ ఏడాది జూన్‌ రెండో వారంలోనే గోదావరికి వరదలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కేవలం 15 రోజుల్లోనే 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని 115 గ్రామాలకు చెందిన 20,946 కుటుంబాలకు పునరావాసం కల్పించడం.. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేయడం ఎలా సా«ధ్యమో రామోజీకే తెలియాలి. చంద్రబాబు ఐదేళ్లలో చేయలేని పనిని ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం 15 రోజుల్లోనే ఎలా చేయగలదో ఆయనే చెప్పాలి.
► 2019లో ఆగస్టులో వచ్చిన భారీ వరదలకు 2,400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి.. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఖాళీ ప్రదేశాల గుండా కేవలం 750 మీటర్లకే కుచించుకుపోయి ప్రవహించాల్సి వచ్చింది. దాంతో వరద ఉద్ధృతి అధికమై ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఇసుక పొరలు కోతకు గురి కావడంతో 12 నుంచి 22 మీటర్ల లోతుతో రెండు భారీ అగాధాలు ఏర్పడ్డాయి. దిగువ కాఫర్‌ డ్యామ్‌లో 0 నుంచి 600 మీటర్ల వరకూ కోతకు గురైన పెద్ద అగాధం ఏర్పడింది. డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది. ఇది పోలవరం పనుల్లో జాప్యానికి దారితీసింది. వీటిని పరిశీలిస్తే.. ఈ పాపమంతా చంద్రబాబుదేనన్నది స్పష్టమవుతోంది.

వియ్యంకుడిపై వేటు వేశారని..
పోలవరంలో చంద్రబాబు సర్కారు పాల్పడిన అక్రమాలపై సీఎం వైఎస్‌ జగన్‌ నిపుణుల కమిటీతో విచారణ చేయించారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.3,302 కోట్ల విలువైన పోలవరం జలాశయం పనులను నామినేషన్‌ పద్ధతిలోనూ, రూ.3,220.2 కోట్ల విలువైన  విద్యుత్కేంద్రం పనులు అక్రమంగా నవయుగకు కట్టబెట్టారని, వాటిని రద్దు చేసి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని నిపుణుల కమిటీ సూచించింది. దీంతో వాటికి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించారు. నవయుగకు అప్పగించిన మొత్తం కంటే రూ.845 కోట్లు తక్కువకే పనులు చేయడానికి ముందుకొచ్చిన మేఘా సంస్థకు ప్రభుత్వం పనులు అప్పగించింది. వియ్యంకుడికి చెందిన నవయుగపై వేటు వేశారనే అక్కసుతోనే ‘ఈనాడు’ రామోజీ ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వంపై బురదజల్లుతూ విషపురాతలు రాస్తున్నారు. ప్రణాళికాయుతంగా పోలవరం పనులు చేపట్టి పూర్తి చేసే దిశగా సీఎం జగన్‌ చిత్తశుద్ధితో వడి వడిగా అడుగులు వేస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top