Fact Check: రెండు వర్గాల ఘర్షణపై కుట్రపూరిత రాతలా? | Sakshi
Sakshi News home page

Fact Check: రెండు వర్గాల ఘర్షణపై కుట్రపూరిత రాతలా?

Published Wed, Nov 15 2023 5:05 AM

Eenadu Mischievous campaign on social media on construction of community hall - Sakshi

సాక్షి ప్రతినిధి కర్నూలు: తన కలం నిండా నిలువెల్లా విషం నింపుకున్న రామోజీరావు.. ప్రభు­త్వానికి దళితులను దూరం చేయాలనే కుట్రపూరిత రాతలను నిరంతరం కొనసాగిస్తున్నారు. ఆ పరంపరలోనే.. దళితుల్లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణను ఎలాంటి సంబంధం లేకపోయినా అధికార వైఎస్సార్‌సీపీకి అంటగట్టేందుకు ప్రయత్నించారు. ‘దళిత న్యాయ­వాదిపై వైకాపా కార్యకర్తల దాష్టీకం’ శీర్షికతో ఓ తప్పుడు కథనాన్ని తన ‘ఈనాడు’లో మంగళవారం అచ్చేశారు.

దళితులపై వైఎస్సార్‌సీపీ దాడులు చేస్తోందనే దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి పంపే విఫలయత్నం చేశారు. రెండు దళిత వర్గాలు దాడులు చేసుకుంటే ఒక వర్గాన్నే దళితులుగా చిత్రీకరించి.. మరోవర్గం కూడా దళితులేనన్న విషయాన్ని మరుగుపర్చే ప్రయత్నాన్ని ఆ కథనంలో చేశారు. ఈనాడు దిగజారుడు రాతలను నంద్యాల జిల్లా పోలీసులు కూడా తీవ్రంగా ఖండించారు. 

కమ్యూనిటీ హాలు భూమిపై కన్ను..
బనగానపల్లి నియోజకవర్గం కొలివిుగుండ్ల టీడీపీ కార్యాలయం సమీపంలో సర్వే నంబర్‌ 384, 385లో 16 సెంట్ల గ్రామకంఠం భూమి ఉంది. ఇందులో దళితులు కమ్యూనిటీ హాలు నిర్మాణానికి గ్రామ పంచాయతీకి 2001లో దరఖాస్తు చేసుకుంటే.. 11 సెంట్లలో నిర్మాణానికి 2002లో గ్రామపంచాయతీ తీర్మానం చేసింది. దండోరా యువజన సంఘం పేరుతో అధికారులు పట్టా మంజూరు చేశారు. దళితవాడలోని ప్రజలు చందాలు వేసుకుని ఆ హాలు నిర్మించుకుంటున్నారు. ప్రస్తుతం దీని నిర్మాణం చివరి దశలో ఉంది. తన నివాసం ఎదురుగా ఉన్న ఆ భూమిని ఆక్రమించుకోవాలని గతంలో బనగానపల్లి టీడీపీ అధికార ప్రతినిధి విజయ్‌కుమార్‌ ప్రయత్నించారు.

అతని నివాసంలోని ఓ ఫ్లోర్‌లో టీడీపీ కార్యాలయం కూడా ఉండటం విశేషం. తన ఆలోచనకు విరుద్ధంగా కమ్యూనిటీ హాలు నిర్మిస్తుండటంతో దాని­ని అడ్డుకునేందుకు ఏడాదిగా విఫలయత్నం చేస్తున్నాడు. తాను కూడా దళితుడైనా సాటి దళి­తులు నిర్మించుకునే కమ్యూనిటీ హాలును అడ్డుకునేందుకు విజయ్‌కుమార్‌ శతవిధాల ప్రయత్నించా­డు. స్పందన, లోకాయుక్తతోపాటు అధికారులందరికీ ఫిర్యాదు చేశాడు. చివరకు సోషల్‌ మీడియాలో తప్పుడు ఆరోపణలతో వీడియోలు కూ­డా పోస్టు చేశాడు. కమ్యూనిటీ హాలు నిర్మాణం­లో కీలకపాత్ర పోషించిన నాగేశ్వరరావు అనే దళితుడిపై మరింత తీవ్రమైన ఆరోపణలతో పోస్టులు చేశాడు.

తాను కబ్జా చేయాలనుకున్న స్థలం దక్కకుండా పోయి­ందనే అక్కసుతో నాగేశ్వరరావు తమ్ముళ్లకు వచ్చే డప్పు కళాకారుల పింఛన్‌ రాకుండా విజ­య్‌­­కుమార్‌ ఫిర్యాదు చేశాడు. దీంతో నాగేశ్వరరావు, అతని సోదరులు విజయ్‌ని ఫోన్‌లో నిలదీ­శారు. మాటామాట పెరగడంతో ఫోన్‌లో విజయ్‌­కుమార్‌ను దూషించారు. ఈ మాటలను విజయ్‌ రికార్డు చేసి అనంతపురం కోర్టులో ప్రైవేట్‌ కంప్లయింట్‌ వేశాడు. అక్కడే త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఆరుగురిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా కేసు (క్రైం నంబర్‌ 202/­2023యూ/సెక్షన్‌ 506ఆర్‌/డబ్ల్యూ34) నమోదు చేశారు. 

ఐటీడీపీలో చురుగ్గా విజయ్‌కుమార్‌ 
అనంతపురంలో స్థిరపడి న్యాయవాద వృత్తి చేస్తున్న విజయ్‌కుమార్‌ ఐటీడీపీలో చురుగ్గా ఉంటాడు. సోషల్‌మీడియాలో ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తాడు. అలాగే వ్యతిరేక ప్రచారం చేస్తున్న వారికి మద్దతుగా పోస్టులు పెడుతుంటాడు. అనంతపురం నుంచి దీపావళికి విజయ్‌ కొలివిుగుండ్లకు వచ్చాడు. దీంతో నాగేశ్వరరావు, అతని సోదరులు, కుటుంబసభ్యులు ఈ నెల 12న విజయ్‌ని కలిసి తమపై కేసు పెట్టడాన్ని ప్రశ్నించారు.

రెండు వర్గాల మధ్య మాటామాట పెరిగి ఘర్షణ చెలరేగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. నాగేశ్వరరావు, అతని కుటుంబ స భ్యులు విజయ్‌ని పోలీసు స్టేషన్‌ వరకూ తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ మేరకు విజయ్‌పై పోలీసులు కేసు (క్రైం నంబర్‌ 158/­2023యూ/సెక్షన్‌ 448,323, 355,506ఆర్‌/డబ్ల్యూ34 ఐపీసీ) నమోదు చేశారు. నాగేశ్వరరావు బంధువు రమాదేవి ఫిర్యాదు మేరకు క్రైం నంబర్‌ 159/2023యూ/సెక్షన్‌ 354(ఏ),323,­509ఆర్‌/డబ్ల్యూ34 ఐపీసీగా కేసు నమోదు చేశారు. 

వాస్తవాలను విస్మరించి వక్ర రాతలు
ఈ ఘటన ఘర్షణ రెండు వర్గాల మధ్య జరిగింది. ఇందులో వైఎస్సార్‌సీపీకి  సంబంధం లేదు. కానీ విజయ్‌కుమార్‌ దళితుడని రాసిన ‘ఈనాడు’.. దాడి చేసిన వారు కూడా దళితులే అని రాయకపోవడం గమనార్హం. పంచాయతీ తీర్మానం మేరకు దళితులు నిర్మించుకుంటున్న కమ్యూనిటీ హాలు ప్రస్తావన లేకుండా భూమి ఆక్రమించారని తప్పుడు రాతలు రాసింది. ‘ఈనాడు’ అవాస్తవాలు అచ్చేస్తే.. దాన్ని టీడీపీ నేత లోకేశ్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేసి తప్పుడు ప్రచారానికి దిగారు. అలాగే బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి కూడా వాస్తవాలను వక్రీకరిస్తూ మాట్లాడారు. లోకేశ్, బీసీ జనార్దన్‌రెడ్డి, ఈనాడు దుష్ప్రచారాన్ని స్థానిక దళితులు తీవ్రంగా ఖండించారు.

తప్పుడు రాతలపై చర్యలు 
‘ఈనాడు’ కథనంపై నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి స్పందించారు. విలేకరుల సమా­­వేశం నిర్వహించి ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించారు. ‘దళిత న్యాయవాదిపై దాడి పేరుతో ఈనాడులో ప్రచురితమైన కథనం పూర్తి అవాస్తవం. కమ్యూనిటీ హాలు విషయంలో రెండు దళిత వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఇది. దీన్ని రాజకీయ ఘటనగా, దళిత వ్యతిరేక ఘటనగా ఈనాడు చిత్రీకరించింది. అధి­కార పార్టీపై నిందలు మోపుతూ రాష్ట్ర ప్రజ­లకు తప్పుడు సమాచారం అందించే ప్రయత్నం చేసింది. తప్పుడు రాతలు రాసి శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా చేస్తే చర్యలు తప్పవు’ అని ఎస్పీ స్పష్టం చేశారు. 

వైఎస్సార్‌సీపీకి సంబంధం లేదు
కమ్యూనిటీ భవనం విషయంలో చోటు చేసుకున్న ఘర్షణ పూర్తిగా ఎస్సీలకు సంబంధించిన అంశం. ఈ ఘటనకు వైఎస్సార్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదు. 30 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్‌లో కొనసాగుతున్నాం. టీడీపీ నాయకుడిపై వైఎస్సార్‌సీపీ నాయకులు దాడి చేశారని చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి చూస్తున్నారు. ఈ ఘటనను అడ్డుపెట్టుకుని రాజకీయంగా సానుభూతి పొందేందుకు మాపై తప్పుడు ఆరోపణలు చేశాడు. బీసీ జనార్దన్‌ తన పలుకుబడిని ఉపయోగించి గొడవలోలేని వారిపై తప్పుడు కేసు పెట్టించారు.– ఇరికిమాను నాగేశ్వరరావు, ఎమ్మార్పీఎస్‌ సీనియర్‌ నాయకుడు

Advertisement
 
Advertisement