‘అమరావతి’ ముసుగులో దోచుకో.. పంచుకో.. తినుకో..!
ఈనాడు కిరణ్ వియ్యంకుడి కంపెనీ ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్‌కు పలు కాంట్రాక్టులతో భారీ లబ్ధి
అమరావతిలో 13, సాగునీటి ప్రాజెక్టుల్లో 4 ప్యాకేజీలతో రూ.6,859.95 కోట్ల పనులు పందేరం
మొబిలైజేషన్ అడ్వాన్సు రూపంలోనే ఏకంగా రూ.685.99 కోట్లు చెల్లింపులు..
అంచనా వ్యయం పెంచేసి అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా భారీగా ప్రయోజనం
అమరావతిలో రోడ్లు వేయటానికే రూ.2 లక్షల కోట్లు కావాలి.. ఇక ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు..
అది ఆచరణ సాధ్యం కాదని తెలిసినా.. రాష్ట్రానికి ఏ రాజధాని లేకుండా పోతుందని అంతా హెచ్చరిస్తున్నా.. అమరావతిలో తమ దోపిడీ కోసమే ప్రజల కళ్లకు గంతలు కడుతున్న దొంగల ముఠా
‘మావిగన్’ ఏపీకి గ్రోత్ ఇంజన్‌లా మారుతుందంటూ విద్యావంతులు, మేధావులు, ఆర్థికవేత్తల ప్రశంసలు.. దాంతో అమరావతి ముసుగులో తమ దోపిడీకి తెర పడుతుందని గజ దొంగల తీవ్ర ఆందోళన
సాక్షి, అమరావతి: నిత్యం ఉషోదయంతో సత్యం నినదించు గాక..! అంటూ తెలుగు లోగిళ్లను బురిడీ కొట్టిస్తూ తెల్లారింది మొదలు అనునిత్యం అసత్యాలను అచ్చోసి ఒక పార్టీకి కొమ్ము కాసి దశాబ్దాలుగా ‘ఈనాడు’ను ఎలా నడిపారో మనమంతా చూశాం.. చూస్తూనే ఉన్నాం.. ! ఇక ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న ‘అమరావతి’ ఆచరణ సాధ్యం కాదని ప్రపంచమంతా మొత్తుకుంటున్నా.. అది ఎప్పటికీ జరగదని, రోడ్లు వేయటానికే దశాబ్దాలు పడుతుందని తెలిసినా.. దీనివల్ల రాష్ట్రానికి రాజధానే లేకుండా పోతుందని అంతా హెచ్చరిస్తున్నా.. ఎల్లో మీడియా మాత్రం గంగవెర్రులెత్తుతోంది! ఎందుకంటే... స్వయంగా ‘ఈనాడు’ కిరణ్ వియ్యంకుడిని ముందు పెట్టి అమరావతి ముసుగులో ఈ ముఠా రూ.వేల కోట్ల కాంట్రాక్టులు చేజిక్కించుకుని లబ్ధి పొందుతోంది కాబట్టే..! వీళ్లకు రాష్ట్ర ప్రయోజనాలతో ఏమాత్రం సంబంధం లేదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును అనుసంధానించే ‘మావిగన్’ కారిడార్ వల్ల తక్కువ ఖర్చుతో శరవేగంగా ఏపీ రాజధాని సాకారమవుతుందని నిపుణుల నుంచి యువత వరకు అంతా స్వాగతిస్తూ చెబుతున్నా.. పచ్చ ముఠా మాత్రం రూ.వేల కోట్ల దోపిడీ కోసం ‘అమరావతి’ అంటూ మభ్యపెడుతోంది.
‘మావిగన్’ ఏపీకి గ్రోత్ ఇంజన్‌లా మారి రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చి మేలు జరుగుతుందని స్పష్టంగా తెలుస్తున్నా... గజ దొంగల ముఠా మాత్రం దీనివల్ల తమ దోపిడీకి తెర పడుతుందని తీవ్ర ఆందోళన చెందుతోంది. దీంతో ఎల్లో మీడియా చంద్రబాబు కంటే పది అడుగులు ముందుకు వేసి అమరావతి పేరుతో జనం కళ్లకు గంతలు కడుతోంది. అమరావతిలో రోడ్లు, తాగునీరు, విద్యుత్తు, డ్రైయినేజీ లాంటి కనీస సదుపాయాలకే రూ.2 లక్షల కోట్లు అవసరమని స్వయంగా చంద్రబాబు ప్రభుత్వమే వెల్లడించింది. ఎప్పటికి పూర్తవుతుందో అంతుబట్టదు..! డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు..! అయినా సరే.. అదిగదిగో అమరావతి..! దేవతల రాజధాని..! అంటూ కళ్లముందు సాక్షాత్కారమైనట్లు ఈనాడు చిత్రీకరించటానికి అసలు కారణం ‘డీపీటీ’నే! రాష్ట్రంపై ఎంత భారం పడినా సరే అమరావతి కొనసాగితేనే వీళ్ల దోపిడీ కొనసాగుతుంది..! దీనికి చంద్రబాబు సర్కారు సంపూర్ణంగా సహకరించడంతోనే అమరావతిని ఎల్లో మీడియా భుజాన వేసుకుని భజంత్రీలు వాయిస్తోంది!!
అమరావతి నుంచి పోలవరం దాకా డీపీటీనే..!
రాజధాని అమరావతి నిర్మాణ పనుల నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకూ ప్రజాధనాన్ని దోచుకో– పంచుకో – తినుకో (డీపీటీ) అనే రీతిలో ప్రభుత్వ పెద్దలతో ‘ఈనాడు’ బంధం కొనసాగుతోందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుతూ వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేలా తప్పుడు కథనాలు అచ్చేయడంలో ‘ఈనాడు’ది అందెవేసిన చెయ్యి అని గుర్తు చేస్తున్నారు. ఎన్‌టీ రామారావుకు 1995లో వెన్నుపోటు పొడిచిన నాటి నుంచి చంద్రబాబు గద్దెనెక్కే వరకు కుడి, ఎడమల దన్నుగా నిలిచింది రామోజీరావేనన్నది బహిరంగ రహస్యమే! ఇక ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా విస్మరించి ప్రజా ధనం దోపిడీకి పచ్చ జెండా ఊపుతోంది.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే ఈనాడు కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్టŠస్ సంస్థకు రాజధానిలో 13 ప్యాకేజీలు.. పోలవరం ఎడమ కాలువలో ఒక ప్యాకేజీ.. హంద్రీ–నీవాలో మూడు ప్యాకేజీలు కలిపి మొత్తం 17 ప్యాకేజీల్లో రూ.6,859.95 కోట్ల విలువైన పనులు (జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నులు అదనం) కట్టబెట్టడం గమనార్హం. ఇందులో పది శాతం అంటే రూ.685.99 కోట్లను రాయల రఘుకు మొబిలైజేషన్ అడ్వాన్సు కింద ప్రభుత్వం చెల్లించింది. దీన్ని నీకింత నాకింత..! అంటూ పంచుకు తిన్నారు. రాజధానిలో 2014–15లో ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా కాజేసిన భూముల ధరలు పెంచుకోవడం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, హడ్కో లాంటి ఆర్థిక సంస్థల నుంచి చంద్రబాబు సర్కారు అధిక వడ్డీలకు రూ.47,387 కోట్లు అప్పులు చేస్తోంది.
రాజధానిలో ఆర్వీఆర్‌కు రూ.6,031.79 కోట్ల పనులు..
ఈనాడు కిరణ్ వియ్యంకుడికి చెందిన ఆర్వీఆర్ కన్‌స్ట్రక్షన్స్‌కు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) చేపట్టిన పనుల్లో రూ.2,813.66 కోట్ల విలువైన 4 ప్యాకేజీలు, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏడీసీఎల్) చేపట్టిన పనుల్లో రూ.3,218.13 కోట్ల విలువైన 9 ప్యాకేజీలు వెరసి రూ.6,031.79 కోట్ల విలువైన(జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నులు అదనం) 13 ప్యాకేజీలను కట్టబెట్టారు. అంతేకాదు.. మొబిలైజేషన్ అడ్వాన్సు కింద రూ.600.31 కోట్లు చెల్లించారు. పనుల అంచనా వ్యయం పెంచేయడం ద్వారా భారీ ఎత్తున లబ్ధి చేకూర్చారు. ఈనాడు కిరణ్ బంధువులకు ఇంత భారీ స్థాయిలో లబ్ధి చేకూరుస్తుండటం.. ఈ భారీ దోపిడీలో వాటాదారు కావడంతోనే అమరావతిని అద్భుతంగా నిర్మిస్తున్నారంటూ చంద్రబాబు సర్కారును ఎల్లో మీడియాలో కీర్తిస్తున్నారు.
వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటే ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్‌కు భారీ ఎత్తున ప్రజాధనాన్ని దోచిపెట్టారన్నది స్పష్టమవుతోందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. తద్వారా ఈనాడు కిరణ్‌కు ప్రయోజనం చేకూర్చారని స్పష్టం చేస్తున్నారు. ఆర్వీఆర్ ప్రాజెక్సŠట్‌కు అప్పగించిన పనులన్నీ రెండేళ్లలో పూర్తి చేయాలన్నది టెండర్‌లో పెట్టిన నిబంధన. వాటిని ఆ సంస్థకు అప్పగించి ఇప్పటికే ఏడాది పూర్తయింది. కానీ.. పది శాతం పనులు కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవని ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. లక్ష్యం మేరకు పనులు చేయని ఆ సంస్థపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కారణం ఏమిటన్నది బహిరంగ రహస్యమే.
తమ దోపిడీకి ‘మావిగన్’ అడ్డొస్తుందనే..!
అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.11 వేల నుంచి రూ.14 వేల చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించారు. పైగా ఇసుక ఉచితం. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఫైవ్ స్టార్ వసతులతో చదరపు అడుగు నిర్మాణ పనులను రూ.4,500లకే చేస్తున్నారు. ఇక ఆరు వరుసల జాతీయ రహదారులను కి.మీ.కు రూ.20 కోట్ల చొప్పున నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మిస్తోంది. కానీ.. రాజధానిలో అదే తరహా రోడ్లను కి.మీ.కు రూ.53 కోట్ల వంతున కాంట్రాక్టర్లకు అప్పగించారు. దీన్ని బట్టి చూస్తే రాజధాని నిర్మాణ పనుల్లో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుంటోందని ఇంజనీరింగ్ నిపుణులు, మేధావులు, విద్యావంతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏకంగా రూ.2 లక్షల కోట్లు.. అది కూడా కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే ఖర్చు చేయడం వల్ల అమరావతి రాష్ట్రానికి ఆర్థికంగా గుదిబండగా మారుతుందని స్పష్టం చేస్తున్నారు. అదే మచిలీపట్నం – విజయవాడ – గుంటూరు (మావిగన్) 110 కి.మీ. కారిడార్‌ను రాజధాని ప్రాంతంగా ప్రకటించి కేవలం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తే.. స్వల్ప కాలంలోనే మహానగరంగా మారుతుందని.. రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్‌గా అవుతుందని.. ఆ ప్రతిపాదన ఆచరణాత్మకమైందంటూ విద్యావంతులు, మేధావులు, ఆర్థికవేత్తలు ప్రశంసిస్తున్నారు. దీనికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుండటంతో అది తమ దోపిడీకి అడ్డొస్తుందని ఈనాడు కిరణ్ ఆందోళన చెందుతున్నారు. అందుకే రాజధానిలో సాగుతున్న దోపిడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేలా తప్పుడు కథనాలు అచ్చేస్తున్నారని మేధావులు, విద్యావంతులు స్పష్టం చేస్తున్నారు.
పోలవరంలో రూ.81.63 కోట్ల పని రూ.307.41 కోట్లకు అప్పగింత..
పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 5, 5 ఏ ప్యాకేజీల్లో 2019 అక్టోబర్ 3 నాటికి మిగిలిన రూ.81.63 కోట్ల విలువైన పని అంచనా వ్యయాన్ని కూటమి ప్రభుత్వం రూ.293.66 కోట్లకు పెంచేసింది. వాటిని 4.68 శాతం అధిక ధరలకు అంటే రూ.307.41 కోట్లకు కోట్ చేసిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్‌కు గతేడాది అక్టోబర్ 17న కట్టబెట్టింది. అంటే.. మిగిలిన పని అంచనా వ్యయం కంటే రూ.225.78 కోట్లు (277 శాతం అధికం) అంచనాలను పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఆర్వీఆర్ ప్రాజెక్టŠస్ ఈనాడు కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు చెందినది కావడం గమనార్హం. పెంచిన అంచనా వ్యయాన్ని నీకింత నాకింత.. అంటూ పచ్చ ముఠా పంచుకు తింటోందని సాగు నీటి రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు.
కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ‘ఏటీఎం’గా మార్చుకున్నారంటూ 2019 ఏప్రిల్ 1న రాజమహేంద్రవరం బహిరంగ సభ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 2019 నాటికి.. నేటికీ డీజిల్, స్టీలు, పెట్రోల్, సిమెంటు తదితరాల ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. అయినా సరే అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసినట్లు స్పష్టమవుతోంది. టెండర్లలో 4.68 శాతం అధిక ధరకు రూ.307.41 కోట్లకు కోట్ చేసిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్‌కు ప్రభుత్వం అప్పగించింది. మిగిలిన పని అంచనా వ్యయం కంటే రూ.225.78 కోట్ల మేర పెంచి ఆ సంస్థకు అప్పగించినట్లు స్పష్టమవుతోంది. తద్వారా రామోజీ కుమారుడి వియ్యంకుడికి చంద్రబాబు ప్రభుత్వం భారీ నజరానా ఇచ్చిందని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
హంద్రీ–నీవా లైనింగ్‌లో రూ.520.75 కోట్ల పనులు ఆర్వీఆర్ చేతికి..
హంద్రీ–నీవా కాలువకు సిమెంటు లైనింగ్ చేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోయి.. బోరు బావులు ఎండిపోతాయని.. పంటలు ఎండిపోయి తాము రోడ్డున పడతామని అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకించినా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ 216.30 కి.మీ. నుంచి 400.500 కి.మీ. వరకూ ఐదు ప్యాకేజీలుగా విభజించి ఆర్నెళ్లలో పనులు పూర్తి చేయాలనే నిబంధనతో రూ.972.19 కోట్లకు (రూ.520.75 కోట్ల విలువైన మూడు ప్యాకేజీల పనులు ‘ఈనాడు’ కిరణ్ సోదరుడి వియ్యంకుడికి చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్టŠస్‌కు.. రూ.451.44 కోట్ల విలువైన రెండు ప్యాకేజీల పనులు సీఎం చంద్రబాబు సన్నిహితుడికి చెందిన బీఎస్సార్ ఇన్‌ఫ్రాకు) అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించారు. టెండర్ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా లైనింగ్ పనులు చేశారు. నాణ్యత తీసికట్టుగా ఉన్నా ఆర్వీఆర్ ప్రాజెక్టŠస్ సంస్థకు ప్రభుత్వం బిల్లులు చెల్లించింది.


