బైజూస్‌పై బురద రాతలు 

Eenadu Fake News On BYJUs - Sakshi

ఆంగ్లంలోనే పాఠాలున్నాయంటూ ‘ఈనాడు’ అసత్యాలు 

విద్యార్థులు తెలుగు భాషనూ ఎంపిక చేసుకునేలా ఏర్పాట్లు 

సందేహాలు నివృత్తి చేసుకునే సదుపాయం ఉంది  

సాక్షి, అమరావతి: ఆధునిక నైపుణ్యాలను సంతరించుకుని ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా బైజూస్‌ పాఠ్యాంశాలతో విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతుంటే ‘ఈనాడు’ వక్ర భాష్యాలు చెబుతోంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టి వివిధ పథకాల ద్వారా విద్యార్థుల చదువులకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తున్న విషయం తెలిసిందే. గత సర్కారు హయాంలో అస్తవ్యస్థమైన విద్యా రంగాన్ని వివిధ పథకాలతో సీఎం జగన్‌ ముందుకు తీసుకువెళ్తున్నారు. బైజూస్‌ భాగస్వామ్యం ద్వారా అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వానికి మంచిపేరు వస్తుండడంతో సహించలేక‘ఈనాడు ’విషం చిమ్ముతోంది. ఇందులో నిజానిజాలివీ..  

బైజూస్‌తో బోలెడు ప్రయోజనాలు 
బట్టీ చదువుల స్థానంలో ఆహ్లాదంగా చదువుకునేలా తరగతి గదిని రూపొందించాలని జాతీయ విద్యా విధానం 2020 సూచించింది. ఈ తరహా విధానాన్ని ప్రవేశపెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం బైజూస్‌ కంటెంట్‌ను స్మార్ట్‌ ఫోన్ల ద్వారా విద్యార్థులకు అందిస్తోంది. బైజూస్‌ కంటెంట్‌ టీచర్లు, పిల్లలకు ఉపయోగపడేలా ప్రపంచ స్థాయి నాణ్యతతో రూపొందించారు. దీనివల్ల తరగతి గది బోధనలో నాణ్యత పెరగటంతో పాటు బడిలో నేర్చుకున్న అంశాలు ఇంటి వద్ద పునఃశ్చరణ చేయడానికి అవకాశం కలుగుతోంది.

పిల్లలు ఎప్పుడైనా పాఠశాలకు హాజరు కాలేకపోతే వీలైన సమయంలో నేర్చుకునేందుకు డిజిటల్‌ కంటెంట్‌ ఉపయోగపడుతుంది. ఇందులో ఉపయోగించిన చిత్రాలు, వీడియోలు, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లు నేర్చుకునేలా దోహదం చేస్తాయి.పాఠ్య పుస్తకాలలో ఇచ్చిన సమాచారాన్ని చిన్న విభాగాలుగా రూపొందించడం వల్ల సంక్లిష్ట అంశాలను సులువుగా నేర్చుకుంటారు. 471కి పైగా వీడియోలతో  నేర్చుకునేందుకు అనువుగా ఉన్నాయి. 

గొప్ప వరం.. 
బైజూస్‌ ద్వారా ఉచితంగా పాఠాలు అందించడం పేద పిల్లలకు గొప్ప వరం. ఈ లెర్నింగ్‌ కోసం పిల్లలందరికీ, ఉపాధ్యాయులకు కూడా ఉచితంగా ట్యాబ్‌లను సమకూరుస్తుండడం సాహసోపేత నిర్ణయం.  
– ఎన్‌.మహేంద్రరెడ్డి, టీచర్, తంగేగుకుంట, శ్రీసత్యసాయి జిల్లా 

రెండు భాషల్లో చక్కగా.. 
బైజూస్‌ వీడియో పాఠాలను అన్ని తరగతుల వారు వింటున్నారు. తెలుగు, ఇంగ్లీష్‌  మాధ్యమాల్లో చక్కటి ఉదాహరణలతో స్థాయికి తగ్గట్లు వీడియో అంశాలున్నాయి. 
– కె.పుష్పవతి, సైన్స్‌ టీచర్, ఎంసీయూపీ స్కూల్, ఏలూరు 

చాలా బాగుంది.. 
బైజూస్‌ కంటెంట్‌ చాలా బాగుంది. విద్యార్థులకు, టీచర్లకు ఎంతో సహాయపడుతుంది. వీడియోలు పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా అద్భుత అనుభూతి 
కలిగిస్తున్నాయి. 
– సంధ్య, ప్రిన్సిపాల్, ఏపీఎమ్మెస్, అక్కివరం, విజయనగరం 

అద్భుతంగా నేర్చుకుంటున్నారు... 
బైజూస్‌ యాప్‌ ద్వారా పిల్లలకు వీడియో పాఠాలు చెబుతున్నాం. కంటెంట్‌ చాలా బాగుంది. పిల్లలు అద్భుతంగా నేర్చుకుంటున్నారు. అన్ని సబ్జెక్టులు అర్థవంతంగా, ఉపయోగకరంగా ఉన్నాయి. పిల్లలు బడికి హాజరు కాని సందర్భాల్లో ఇది చాలా సహాయపడుతుంది. సెలవు రోజుల్లో కూడా ఇంటి వద్ద పాఠ్యాంశ బోధన జరగడం అద్భుతంగా ఉంది. 
– ఎం.నరసింహారెడ్డి, హెచ్‌.ఎమ్, జెడ్పీ హైస్కూల్‌ సంబేపల్లి మండలం, అన్నమయ్య జిల్లా   

అబద్ధం 1
బైజూస్‌ కంటెంట్‌ కేవలం ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే ఉంది 
ఇది పూర్తి అవాస్తవం. పిల్లలు తెలుగు, ఇంగ్లీషులో నేర్చుకోవడానికి వీలుగా కంటెంట్‌ ఉంది.  భాషను ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థులకు కల్పించారు.  

అబద్ధం 2 
పిల్లల సందేహాల నివృత్తికి అవకాశం లేదు 
పాఠశాలలో ఉపాధ్యాయుడు పాఠం బోధించాక సంబంధిత వీడియోను విద్యార్థులు  పరిశీలించిన అనంతరం ఇంకా సందేహాలుంటే మరుసటి రోజు నివృత్తి చేస్తున్నారు. వలస వెళ్లిన పిల్లలు కూడా కంటెంట్‌ను ఫోన్‌లో చూసుకొని తర్వాత స్కూలుకు వచ్చి టీచర్‌ ద్వారా సందేహాలు నివృత్తి చేసుకునే వెసులుబాటు ఉంది. 

అబద్ధం 3
టీచర్లకు రూ.500 చాలదు
ఈ ప్రస్తావన సరికాదు. కంటెంట్‌ ఉన్న వీడియోలు ప్రయోగాలకు సంబంధించినవి మాత్రమే కాకుండా ఆ సబ్జెక్టుకు సంబంధించినవైనందున విషయ పరిజ్ఞానార్జనకు మరింత ఉపయుక్తం. టీచర్లకు వీడియోలు అర్థం కావనడం వారిని అవమానించడమే.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top