సీబీఐతో విచారించాలి | DSC 2025 candidates meet YS Jagan on Wednesday | Sakshi
Sakshi News home page

సీబీఐతో విచారించాలి

Jun 4 2026 5:13 AM | Updated on Jun 4 2026 5:13 AM

DSC 2025 candidates meet YS Jagan on Wednesday

బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగేలా పోరాడతామని వైఎస్‌ జగన్‌ భరోసా 

పరీక్ష నిర్వహణ, ఎంపికలో అంతులేని అక్రమాలు కనిపిస్తున్నాయి 

ఇష్టారాజ్యంగా జీవోలతో స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేశారు 

దీనివల్ల అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగింది 

పార్టీ నుంచి లీగల్‌ ప్యానెల్‌ ఏర్పాటు చేసి వారి తరఫున న్యాయ పోరాటం చేస్తాం 

అన్యాయం జరిగిన అభ్యర్థులు ధైర్యం కోల్పోవద్దు.. ఓపిక పట్టండి 

మన ప్రభుత్వం రాగానే ఈ డీఎస్సీపై కమిషన్‌ వేసి విచారణ జరిపిస్తాం 

అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం.. తప్పు చేసిన వారిని శిక్షిస్తాం 

1998, 2008 డీఎస్సీలో అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగింది మన హయాంలోనే..

పోరాడితేనే నిలబడగలుగుతాం. దేవుడి దయ వల్ల మూడేళ్ల తర్వాత మనం అధికారంలోకి వస్తాం. మనం  రాగానే కమిషన్‌ ఏర్పాటు చేసి మీ కేసులన్నీ విచారించి అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం. తప్పు చేసిన వారిని శిక్షిస్తాం. 1998, 2008 డీఎస్సీలో కూడా అన్యాయం అయిపోయిన వారికి మనం న్యాయం చేశాం. డీఎస్సీ 2025లో అన్యాయానికి గురైన అభ్యర్థులకు కూడా న్యాయం చేస్తాం.  -డీఎస్సీ బాధిత అభ్యర్థులకు వైఎస్‌ జగన్‌ భరోసా  

సాక్షి, అమరావతి: ఒక పోస్టుకు ఒక్కరు (1:1) నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచి అన్నింటా సక్సెస్‌ అయిన అనేక మంది డీఎస్సీ 2025 అభ్యర్థులకు ఉద్యోగాలు రాకపోవడం అత్యంత హేయం.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్షేపించారు. పరీక్ష నిర్వహణ, ఎంపికలో అంతులేని అక్రమాలు చోటు చేసుకున్నట్లు అభ్యర్థులు చెబుతున్న విషయాలను బట్టి తెలుస్తోందని, అందుకే డీఎస్సీ 2025పై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. 

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన డీఎస్సీ 2025 అభ్యర్థులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ను కలిశారు. పరీక్ష నిర్వహణ, ఎంపికలో చోటు చేసుకున్న అక్రమాలను వైఎస్‌ జగన్‌ దృష్టికి తెచ్చి తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ అభ్యర్థుల ఆవేదన, బాధలను సావధానంగా విన్న వైఎస్‌ జగన్‌ వారికి న్యాయం జరిగేలా పోరాడతామని భరోసా ఇచ్చారు. 

ఇష్టారాజ్యంగా జీవోలు జారీ చేసి స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని, దీనివల్ల అర్హులైన ఎందరో అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. వారి తరఫున న్యాయ పోరాటం చేస్తామన్నారు. అందుకోసం పార్టీ నుంచి లీగల్‌ ప్యానెల్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే ఈ డీఎస్సీపై కమిషన్‌ వేసి విచారణ జరిపిస్తామని చె­ప్పారు. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని.. తప్పు చేసిన వారిని శిక్షిస్తామని చెప్పారు. వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే.. 

నాడు పారదర్శకంగా ఒకేసారి 1.30 లక్షల ఉద్యోగాలు.. 
వైఎస్సార్‌సీపీ హయాంలో అధికారంలోకి వ చ్చిన ఆ­రు నెలల్లోపే 2019లో గాంధీ జయంతి నాటికి 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా ఎక్కడా, ఏ వివా­దం రాలే­దు. అంత పారదర్శకంగా పరీక్ష నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు ఇచ్చాం. అదే చంద్ర­బాబు కేవలం 16 వేల ఉద్యోగాల్లో ఇన్ని అక్రమాలు, అవకతవకలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అందు­కే మీ తరఫున న్యాయపోరాటం చేస్తాం. మీ­కు ఖ­ర్చు లేకుండా మేమే భరించి, కోర్టులో పోరాడతాం.  

పని పూర్తి కాగానే మళ్లీ నియమావళిని మార్చేసి.. 
స్పోర్ట్స్‌ కోటా పేరిట మొదట ఒక జీవో ఇచ్చారు. ఎలాంటి పరీక్ష అవసరం లేదని, కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా ఇస్తామని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు భర్తీ చేసి స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత మరో జీవో జారీ చేసి.. ఆ కోటాలో  అభ్యర్థులు ఇక నుంచి పరీక్ష రాయాలని, ఇతర అర్హతలు కూడా కలిగి ఉండాలని నిర్దేశించారు. అంటే తమ పని పూర్తి కాగానే మళ్లీ నియమావళిని మారుస్తూ మరో జీవో ఇచ్చారు. డీఎస్సీ నిర్వహణలో ఎక్కడా పారదర్శకత లేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఉద్యోగాలు అమ్ముకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

తప్పుల మీద తప్పులు.. 
1:1 పద్ధతిలో పిలిచి సర్టిఫికెట్‌ పరిశీలన కూడా పూర్తి చేసి, రిజెక్ట్‌ చేయడం ఒక తప్పు. రెండో అనైతికం ఏమిటంటే.. ఏ పరీక్షా రాయకుండా స్పోర్ట్స్‌ కేటగిరీ అని చెప్పి వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం మీకు అన్యాయం చేశారు. ఆ పని పూర్తి చేయగానే గేట్లు మూసి మరో జీవో ఇచ్చారు. ఇంతకంటే దగా, మో­సం మరొకటి ఉంటుందా? ఓ జిల్లాలో ఫస్ట్‌ ర్యాంక్‌ వ చ్చిన అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వలేదు. ఎందుకంటే.. అతడు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు రాలేదని చెప్పారు. కానీ అదే అభ్యర్థి తనకు ఉద్యోగం ఇవ్వలేదని కో­ర్టుకు వెళ్లాడు. 

పరీక్షకు ముందే పేపర్లు లీక్‌ చేయడం.. ఆ తర్వాత ఇష్టానుసారంగా జీవోలు జారీ చేయడం.. 1:1 పద్ధతిలో సర్టిఫికెట్లు వెరిఫై చేసి అన్నీ కరెక్టుగా ఉన్నా ఉద్యోగాలు ఇవ్వకపోవడం... ఆ తర్వాత మెరిట్‌ వాళ్లకు కాకుండా కింద ఉన్నవారికి ఇవ్వడం... వీటిపై గ్రీవెన్స్‌ సెల్‌లో ఫిర్యాదు చేస్తే స్పష్టమైన సమాధానాలు చెప్పలేదు. మీరంతా క్వాలిఫైడ్‌ కాబట్టే మీకు కాల్‌ లెటర్స్‌ కూడా వచ్చా­యి. మిమ్మల్ని 1:1 నిష్పత్తిలో పిలిచి అన్యాయం చేశారు. 

రెండు జీవోలు జారీ చేసి ఇష్టానుసారంగా ఉద్యోగాలు ఇచ్చారు. స్పోర్ట్స్‌ కోటా అని చెప్పి ఏ అర్హత లేకపోయినా, టెట్‌ క్వాలిఫై కాకపోయినా ఉద్యోగాలు ఇచ్చారు. అలా వారు అనుకున్న వారికి ఉద్యోగాలు ఇ చ్చిన తర్వాత మళ్లీ ఇంకో జీవో ఇచ్చి స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాల భర్తీకి అన్ని అర్హతలు ఉండాలని, పరీక్ష కూడా రాయాలంటూ జీవో జారీ చేశారు. 

మీకు అండగా న్యాయ పోరాటం చేస్తాం..  
మావైపు నుంచి మీకు పూర్తి అండగా ఉంటాం. మాకు ఇద్దరు టీచర్‌ ఎమ్మెల్సీలు ఉన్నారు. విద్యార్థి విభాగం ఉంది. లీగల్‌ టీమ్‌ ఉంది. వారితో ఒక ప్యానెల్‌ ఏర్పాటు చేసి మీ తరఫున కోర్టులో పిటిషన్‌ వేసి పోరాడతాం. మూడేళ్ల తర్వాత మన ప్రభుత్వం రాగానే ఒక కమిషన్‌ వేసి పూర్తి విచారణ జరిపించి మీకు న్యాయం జరిగేలా చూస్తాం. అప్పటి వరకు ఈ మూడేళ్లూ మీ తరఫున న్యాయపోరాటం కొనసాగిస్తాం. 

మీ అందరికీ ఒకటే హామీ..! పోరాడితేనే నిలబడగలుగుతాం. దేవుడి దయ వల్ల మూడేళ్ల తర్వాత మనం అధికారంలోకి వస్తాం. మనం అధికారంలోకి రాగానే కమిషన్‌ ఏర్పాటు చేసి మీ కేసులన్నీ విచారించి న్యాయం చేస్తాం. 1998, 2008 డీఎస్సీలో కూడా అన్యాయం అయిపోయిన వారికి మనం న్యాయం చేశాం. డీఎస్సీ 2025లో అన్యాయానికి గురైన అభ్యర్థులకు కూడా న్యాయం చేస్తాం. 

మన ప్రభుత్వం రాగానే విచారణ జరిపిస్తాం..
రేపు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే డీఎస్సీ 2025 అక్రమాలపై విచారణ జరిపిస్తాం. కొంచెం ఓపిక పట్టండి. ఇప్పుడు సీబీఐ విచారణకు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాం. మూడేళ్ల తర్వాత మన ప్రభుత్వం రాగానే మీ స్పెసిఫిక్‌ కేసుల మీద ఒక కమిషన్‌ వేసి విచారణ జరిపిస్తాం. మీకు న్యాయం జరిగేలా చూ­స్తాం. పోరాడితేనే న్యాయం జరుగుతుంది. న్యా­యం ఆలస్యం కావొచ్చు. కానీ జరగకుండా ఉండదు.   

Advertisement
 
Advertisement
Advertisement