బాబు పాలనలో తాగి తందనాలు | Drunk Father Two Daughters on Road After Drinking at Liquor Shop in Prakasam | Sakshi
Sakshi News home page

బాబు పాలనలో తాగి తందనాలు

Oct 8 2026 1:43 PM | Updated on Oct 8 2026 2:10 PM

Drunk Father Two Daughters on Road After Drinking at Liquor Shop in Prakasam

చంద్రబాబు సర్కారు ఊరూరా మద్యం దుకాణాలు తెరిచి.. ప్రతి సందులో బెల్టు షాపులు పెట్టి మద్యాన్ని ఏరుల్లా పారిస్తోంది. వీధివీధినా మద్యం అమ్మకాలు పోటెత్తుతుండటంతో నిత్యావసర సరుకుల కోసం బయటకొస్తున్న వ్యసనపరులు ఆ డబ్బులతో మద్యం కొనుగోలు చేసి పూటుగా తాగుతున్నారు. మత్తులోనే ద్విచక్ర వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడుతున్నారు. 

రాష్ట్రం నలుమూలలా నిత్యం చోటుచేసుకుంటున్న ఇలాంటి ఘటనలకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం తన ఇద్దరు పాపలతో బైక్‌పై బజారుకొచ్చిన ఓ మందుబాబు పిల్లలిద్దరినీ పచారీ దుకాణం దగ్గర ఉంచి.. ఆ పక్కనే ఉన్న మద్యం దుకాణంలో రెండు బాటిళ్ల మద్యాన్ని గడగడా తాగేశాడు. మరో బాటిల్‌ కొనుగోలు చేసి జేబులో పెట్టుకుని బిడ్డల వద్దకు వచ్చాడు. ఇద్దర్నీ బైక్‌పై ఎక్కించుకుని వెళ్తుండగా దారిలో మద్యం మత్తు అతడిని కమ్మేసింది. ఆ మైకంలో బైక్‌ నడపలేక ఇద్దరు చిన్నారుల్ని కిందకు దించేశాడు. 

కాసేపటికే అదే బైక్‌పై తండ్రి సోలిపోవడంతో ఆ పాపలిద్దరూ తల్లడిల్లిపోయారు. ‘నాన్నా.. లే నాన్న. ఇంటికెళ్లిపోదాం లే నాన్నా’ అంటూ విలపించారు. ఈ దృశ్యాన్ని చూసి చలించిపోయిన స్థానికులు చిన్నారులను ఓదార్చి ఆహారం కొనిచ్చారు. మద్యం మత్తులో సోలిపోయిన ఆ తండ్రి జేబులో మరో మద్యం బాటిల్‌ ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మందుబాబు పేరు యాకోబు అని.. ముండ్లమూరు మండలం గంగన్నపాలెం అతని ఊరని  తెలుసుకుని గ్రామస్తులకు సమాచారం అందించారు.          – అద్దంకి (ప్రకాశం జిల్లా)  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement