‘డిజిటల్‌’ ఫిష్‌: ‘ఫిష్‌ ఆంధ్ర’కు సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం  | Sakshi
Sakshi News home page

‘డిజిటల్‌’ ఫిష్‌: ‘ఫిష్‌ ఆంధ్ర’కు సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం 

Published Sat, Aug 20 2022 8:43 AM

Digital Publicity for Fish Andhra On Social Media - Sakshi

సాక్షి, అమరావతి: పోషక విలువలతో కూడిన తాజా మత్స్య ఉత్పత్తుల విక్రయాలకు ‘ఫిష్‌ ఆంధ్ర’ డిజిటల్‌ మార్కెటింగ్‌ ద్వారా విస్త్రృత ప్రచారం కల్పించి ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం డిజిటల్‌ మార్కెటింగ్‌ అండ్‌ కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ (డీఎం–సీఆర్‌ఎం)ను అందుబాటులోకి తెస్తోంది. తలసరి వినియోగం పెంచడమే లక్ష్యంగా ఆక్వా హబ్‌లు, రిటైల్‌ అవుట్‌లెట్ల ద్వారా సర్టిఫై చేసిన మత్స్య ఉత్పత్తులకు శ్రీకారం చుట్టారు. లైవ్‌ ఫిష్‌లే కాకుండా ఐస్‌లో భద్రపర్చిన వ్యాక్యూమ్‌ ప్యాక్డ్‌ ఫిష్‌లను దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెస్తున్నారు.

వంద ఆక్వాహబ్‌లు లక్ష్యం
దాదాపు 48.13 లక్షల టన్నుల మత్స్య దిగుబడులతో దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో వీటి తలసరి వినియోగం కేవలం 8.07 కిలోలు మాత్రమే ఉంది. స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా రాష్ట్రంలో వంద ఆక్వా హబ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. తొలి విడతగా డిసెంబర్‌ నెలాఖరులోగా రూ.325.15 కోట్ల అంచనాతో 25 హబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పులివెందుల, పెనమలూరు ఆక్వా హబ్‌లు అందుబాటులోకి రాగా తిరుపతి, కర్నూలు, శ్రీకాకుళం, చిత్తూరులలో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, తాడేపల్లిగూడెం, మంగళగిరి, గుంటూరులో ఆక్వాహబ్‌ల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. మిగిలిన జిల్లాల్లో ప్రాథమిక దశలో ఉన్నాయి.

వారానికి 50 వేల కిలోల విక్రయాలు
హబ్‌ల పరిధిలో రిటైల్‌ అవుట్‌లెట్స్‌ కోసం 10,427 మంది దరఖాస్తు చేయగా, 2724 మంది అర్హులను గుర్తించారు. ఇప్పటి వరకు 398 రిటైల్‌ అవుట్‌లెట్స్‌ గ్రౌండింగ్‌ చేయగా 355 అవుట్‌లెట్స్‌ ట్రయిల్‌రన్‌ ప్రారంభించాయి. మరోవైపు అందుబాటులో ఉన్న 81 ఫిష్‌మార్ట్‌ తరహా దుకాణాలను రిటైల్‌ అవుట్‌లెట్స్‌గా ఆధునికీకరిస్తున్నారు. పులివెందుల, విశాఖపట్నం, వినుకొండల్లో సూపర్‌ ఫార్మట్‌స్టోర్స్‌ (రూ.20 లక్షల యూనిట్‌) అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో రిటైల్‌ అవుట్‌లెట్‌ పరిధిలో 138 కిలోల చొప్పున వారానికి 50 వేల కిలోల మత్స్య విక్రయాలు జరుగుతున్నాయి.

ప్రతి అవుట్‌లెట్‌లో పీవోఎస్‌ మిషన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందుకోసం పేటీఎం సంస్థతో ఆప్కాఫ్‌ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తొలి విడతగా 2 వేల రిటైల్‌ షాపులకు పేటీఎం డివైజ్‌లు సరఫరా చేయనున్నారు. పీఓఎస్‌తో పాటు రూ.22 వేల విలువైన ఇతర సపోర్టింగ్‌ పరికరాలను రిటైల్‌ అవుట్‌లెట్స్‌కు సమకూర్చనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 2వేల రిటైల్‌ అవుట్‌లెట్స్‌లో పేటీఎం, ఇతర డిజిటల్‌ పరికరాలను ఆగస్టు నాలుగో వారం నుంచి అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కంటైనర్‌ తరహా రిటైల్‌ అవుట్‌లెట్స్‌ ఏర్పాటు కోసం గ్రామీణ ప్రాంతాల్లో 150, అర్బన్‌ ప్రాంతాల్లో 191 చోట్ల స్థలాలను గుర్తించారు. త్వరలో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. 

ఫిష్‌ ఆంధ్ర బ్రాండింగ్‌ 
హబ్‌ల పరిధిలో ఏర్పాటు చేస్తున్న రిటైల్‌ అవుట్‌లెట్స్, కియోస్క్‌లు, సూపర్‌ఫార్మెట్, వాల్యూ యాడెడ్‌ యూనిట్ల ద్వారా మత్స్య ఉత్పత్తుల అమ్మకాలను ఫిష్‌ ఆంధ్ర పేరిట బ్రాండింగ్‌ చేస్తున్నారు. హోర్డింగ్‌లు, పేపర్లలో ప్రకటనల కంటే ప్రజలు ఎక్కువగా డిజిటల్‌ మార్కెటింగ్‌ వైపు ఆకర్షితులవుతున్నారు. వారికి మరింత చేరువయ్యేలా ఫిష్‌ ఆంధ్ర పేరిట యూట్యూబ్‌ చానల్‌తో పాటు గూగుల్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్‌ లాంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌ ద్వారా ప్రచారం చేయనున్నారు. ఆక్వా, మత్స్య ఉత్పత్తులు తీసుకోవడం ద్వారా చేకూరే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ ద్వారా వినియోగదారుల సమస్యలను గుర్తించి పరిష్కరిస్తూ ముందుకెళ్లనున్నారు. ఇందుకోసం కాల్‌ సెంటర్‌ ఏరా>్పటు యోచన కూడా ఉంది. వినియోగదారుల నుంచి రోజూ ఫీడ్‌ బ్యాక్‌ తీసుకొని వారు కోరుకునే తాజా మత్స్య ఉత్పత్తులను అందుబాటులో ఉంచనున్నారు. ఏపీ డిజిటల్‌ కంటెంట్‌ కార్పొరేషన్‌ సహకారం తీసుకుంటూ ఇతర మార్గాలను అందిపుచ్చుకొని ఫిష్‌ ఆంధ్రను ప్రమోట్‌ చేస్తారు.  ప్రత్యేకంగా రూపొందించే యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే డోర్‌ డెలివరీ ఏర్పాటు కూడా చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement