
ఇద్దరి మృతి, వందలాదిమంది ఆస్పత్రిపాలు
వాంతులు.. విరేచనాలతో అల్లాడిపోతున్న ప్రజలు
చవితి పందిరిలో భోజనాల వల్ల ఫుడ్ పాయిజన్ అని
అధికారుల బుకాయింపు.. అసలు భోజనాలే పెట్టలేదు
కలుషిత నీటి వల్లే అంటున్న స్థానికులు
బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో పరుగులు తీసిన అధికార యంత్రాంగం
తూతూమంత్రంగా వైద్య శిబిరం ఏర్పాటు
విజయవాడలో పడగ విప్పిన డయేరియా
ఈ చిత్రంలో కనిపిస్తున్న తండ్రీకొడుకుల పేర్లు వంగేటినాగబాబు, జయదీప్. వాంతులు విరేచనాలతో నీరసించి ఓ ప్రైవేటు హాస్పటల్‌లో ఇలా సొమ్మసిల్లిపడిపోయారు. రెండు రోజుల నుంచి వీరు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నాగబాబుకు కోడలు వరుస అయ్యే శ్రావణి కూడా వాంతులు, విరేచనాలతో ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెబుతున్నారు.
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): బెజవాడలో డయేరియా పడగ విప్పింది. ఇద్దరు మహిళలను బలిగొంది. వందలాది మందిని ఆస్పత్రిపాలుచేసింది. కలుషిత నీటి సరఫరా వల్ల వాంతులు, విరేచనాలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అయినా అధికారయంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది.
చవితి పందిరిలో పెట్టిన భోజనం వల్ల ఫుడ్‌పాయిజనై ఇద్దరు మరణించారని, వాంతులు, విరేచనాలు ప్రబలాయని అధికారులు బుకాయిస్తున్నారు. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు. అసలు గణపతి పందిరి వద్ద భోజనాలే పెట్టలేదని చెబుతున్నారు. కలుషిత నీటివల్లే వాంతులు, విరేచనాలు ప్రబలుతున్నాయని పేర్కొంటున్నారు. కాగా, ఈ లక్షణాలతో విజయవాడ జీజీహెచ్‌లో 25 మంది చికిత్స పొందుతున్నారు.
వారం రోజులుగా మురుగునీరే సరఫరా
స్థానిక 57వ డివిజన్ న్యూరాజరాజేశ్వరీపేటలో వారం రోజులుగా మంచినీటి కొళాయిల్లో నుంచి దుర్వాసనతో కూడిన మురుగునీరు వస్తోంది. విషయాన్ని కొందరు సంబంధిత నీటి సరఫరా శాఖ అధికారులు, సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. గత్యంతరం లేక ఆ నీటిని తాగిన ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. కొందరు తొలుత సమీపంలోని ఆర్‌ఎంపీ వైద్యుల వద్ద చికిత్స చేయించుకుంటున్నా అక్కడ తగ్గకపోవడంతో మెరుగైన వైద్య సేవల కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
అధికారుల ఉదాసీనం
ఇంతలా డయేరియా ప్రబలుతున్నా.. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అస్వస్థతకు గల కారణాలను అన్వేషించకుండా ఫుడ్ పాయిజన్ అని బుకాయిస్తున్నారు. కలుసిత నీటి సరఫరాకు అడ్డుకట్ట వేయడం లేదు. కేర్ అండ్ షేర్ స్కూల్‌లో తూతూమంత్రంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు. కలుషిత నీటి సరఫరా విమర్శలపై పైప్‌లైన్లను పరిశీలిస్తున్నామని బాధ్యత లేకుండా సమాధానమిస్తున్నారు.
కాగా, విజయవాడ న్యూరాజరాజేశ్వరీపేట డయేరియా కేసుల నమోదుపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ బుధవారం ఆరా తీశారు. డయేరియా బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశను ఆదేశించారు.న్యూ ఆర్‌ఆర్‌పేటలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఇంటిల్లిపాదీ నరకయాతన
ఈ చిత్రంలో మంచంపై ఉన్న వ్యక్తి పేరు గుండు సుధాకర్, కింద పడుకున్న బాలుడి పేరు సూరాబత్తుల చిన్ని చైతన్య. వీరిద్దరు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. చిన్ని చైతన్య సోదరి కుసుమాంజలి, అతని తండ్రి కృష్ణ కూడా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. కుసుమాంజలి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం బీఆర్టీఎస్ రోడ్డులోని ఓ ప్రైవేటు హాస్పటల్‌లో మంగళవారం చేరి్పంచారు. ఇంటిల్లిపాదీ నరకయాతన అనుభవిస్తున్నారు.
తల్లీ, పిల్లలిద్దరూ ఆస్పత్రిలోనే..
ఈ చిత్రంలో అపస్మారక స్థితిలో ఉన్న మహిళ పేరు లంకవలస మహాలక్ష్మి. ఈమెకు ఇద్దరు కుమార్తెలు షర్మిల, హారిక ఉన్నారు. వీరు ముగ్గురూ మూడు రోజుల నుంచి వాంతులు విరేచనాలతో బాధపడుతున్నారు. అందరూ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మహాలక్ష్మి ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని, బుధవారం ఇంటికి వచ్చేసింది. అలా వచ్చిచన కాసేపటికే మళ్లీ వాంతులు, విరేచనాలు కావడంతో అపస్మారకస్థితికి వెళ్లిపోయింది. వెంటనే స్థానికులు ఆమెకు సపర్యలు చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో భర్త, కుటుంబ సభ్యులు ఆమెను భుజాలపై మోసుకుంటూ సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు.
ఇద్దరు మహిళలు బలి
కలుషిత తాగునీరు డయేరియా బారిన పడిన ఇద్దరు మహిళలు మృతిచెందారు. న్యూరాజరాజేశ్వరీపేట ప్రభుత్వ జీప్లస్‌త్రీ అపార్ట్‌మెంట్లలోని 25వ బ్లాకుకు చెందిన శ్రీరామ నాగమణి(61) వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ప్రభుత్వాస్పత్రిలో చేరారు. అయినా ఫలితం లేకపోవడంతో మంగళవారం రాత్రి మరణించారు. నీటి సరఫరా విభాగ అధికారుల నిర్లక్ష్యానికి నాగమణి బలైందని, ఆస్పత్రిలోనూ వైద్యులు సరిగా చికిత్స అందించలేదని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.
న్యూఆర్‌ఆర్‌పేటలోని సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ వెనుక భాగంలో నివసిస్తున్న కువ్వల లక్ష్మీకాంతమ్మ(85) ఆమె అల్లుడు గంటేడి అప్పారావు(55) ఇద్దరూ వాంతులు, విరేచనాల బారిన పడ్డారు. లక్ష్మీకాంతమ్మ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మూడు రోజుల క్రితం మృతిచెందింది. ఆమె అల్లుడు అప్పారావూ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.