ప్రకృతి ఒడిలో పరమ శివుడు | Development of Mallayyakonda Temple during reign of Sri Krishnadevaraya | Sakshi
Sakshi News home page

ప్రకృతి ఒడిలో పరమ శివుడు

Jun 30 2026 5:01 AM | Updated on Jun 30 2026 5:17 AM

Development of Mallayyakonda Temple during reign of Sri Krishnadevaraya

స్వయంభూలింగంగా పూజలు అందుకుంటున్న మల్లికార్జునస్వామి, భ్రమరాంబికా అమ్మవారు

శ్రీకృష్ణదేవరాయల కాలంలో మల్లయ్యకొండ ఆలయ అభివృద్ధి

తంబళ్లపల్లె: రాయలసీమలోని పవిత్ర శైవక్షేత్రం మల్లయ్యకొండకు, విజయనగర సామ్రాజ్య వైభవానికి అవినాభావ సంబంధం ఉంది. మల్లయ్యకొండ ఆలయ అభివృద్ధి అంతా శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో జరిగిందని చరిత్రకారులు, శాసనాల ద్వారా తెలుస్తోంది. రాయలసీమలోని వివిధ ప్రాంతాలలో శైవ, వైష్ణవ క్షేత్రాలను అభివృద్ధి చేసిన రాయలవారు తంబళ్లపల్లె కొండల మధ్య కొలువైన ఈ ఆలయాన్ని ప్రత్యేక నిధులతో జీర్ణోద్ధరణ చేసినట్లు ప్రతీతి.

చుట్టూ పచ్చని లోయలు, దట్టమైన అడవులు, మేఘాల అందాల మధ్య ఈ ఆలయ శిల్పకళా చాతుర్యం విజయనగర నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. విజయనగర రాజుల కాలంలో ఈ స్వామివారి నిత్య నైవేద్యాలు, అర్చనలు, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ కోసం వందలాది ఎకరాల భూములను దేవాలయ మాన్యాలుగా కేటాయించారు. వీటి ద్వారా వచ్చే ఆదాయంతోనే శతాబ్దాలుగా ఆలయ ధూపదీప నైవేద్యాలు సాగుతున్నాయి.

స్వయంభువు..
ఈ పవిత్ర క్షేత్రంలో పరమేశ్వరుడు శ్రీ మల్లికార్జున­స్వామిగా, అమ్మవారు భ్రమరాంబికా దేవిగా వెలసి భక్తుల కోర్కెలు తీరుస్తున్నారు. ఇక్కడి ప్రధాన శివలింగం కొండల మధ్య స్వయంభువుగా వెలిసింది. ఆలయ జీర్ణోద్ధ్ధరణ సమయంలో క్షేత్ర సంప్రదాయాల ప్రకారం కొన్ని మార్పులు జరిగాయి. కాలభైరవస్వామి ఇక్కడ క్షేత్రపాలకుడిగా కొలువై ఆలయాన్ని రక్షిస్తున్నట్లు భక్తుల నమ్మకం. భక్తులు కొండ అడుగున వెలిసిన వినాయకుడు, ఆంజనేయస్వామి ఆలయాలను దర్శించుకుని కొండ ఎక్కడం ప్రారంభిస్తారు. 

పైకి వెళ్లే మార్గంలో నెలమల్లేశ్వరస్వామి, ఏనుగు మల్లమ్మ, యేలక తీర్థం లాంటి పవిత్ర కోనేరులు, స్థలాలను దర్శిస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. కొండపై ప్రధాన ఆలయం వద్ద గౌరీ అమ్మవారి ఉపాలయం కూడా ఉంది. ప్రతి సోమవారం, కార్తీక మాసం, పౌర్ణమి రోజులతో పాటు మహాశివరాత్రి పర్వదినాన ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement