వైఎస్సార్‌సీపీ హయాంలో సంక్షేమ వైభవం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ హయాంలో సంక్షేమ వైభవం

Aug 14 2026 7:50 AM | Updated on Aug 14 2026 7:50 AM

సాక్షి ప్రతినిధి, కడప: పూజ్య బాపూజీ మహాత్మగాంధీ కలలు కన్న అసలైన గ్రామ స్వరాజ్యం గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అద్భుతంగా ప్రస్ఫుటమైంది. పేదలకు అత్యంత చెంతకు ప్రభుత్వ సేవలన్నింటినీ తీసుకువస్తూ.. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ప్రతి ఇంటి వద్దకే వాలంటీర్‌ వచ్చి అవసరమైన సేవలు మరియు పెన్షన్లను అందించే పకడ్బందీ వ్యవస్థను నాడు జగన్‌ సర్కార్‌ విజయవంతంగా నడిపించింది. పల్లెల్లోనే ఒకే చోట గ్రామ సచివాలయాలు, వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్‌ గ్రంథాలయాలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేసి పరిపాలనా సంస్కరణల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.

ప్రభుత్వ బడులకు కార్పొరేట్‌ వైభవం!

విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేలా నాటి జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన బడి నాడు–నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. కార్పొరేట్‌ మరియు ప్రైవేటు పాఠశాలలను తలదన్నేలా సర్కారు బడులను అధిగమించి అత్యాధునిక వసతులతో అద్భుతంగా తీర్చిదిద్దారు. సరికొత్త విద్యావ్యవస్థను అందుబాటులోకి తెస్తూ గ్రామీణ, మారుమూల ప్రాంతాల పాఠశాలల్లో సైతం డిజిటల్‌ బోర్డులను ఏర్పాటు చేసి స్మార్ట్‌ క్లాస్‌ బోధనను తీసుకువచ్చారు. గతంలో కేవలం సంపన్న ఉన్నత వర్గాలకే పరిమితమైన అంతర్జాతీయ స్థాయి ఇంగ్లీషు మీడియం చదువులను, నాడు ప్రభుత్వ బడులలో ఉచితంగా ప్రవేశపెట్టడం వల్ల పేద విద్యార్థుల ముంగిటకే ఇంగ్లీషు చదువులు వచ్చి చేరాయి.

పల్లెల్లో పరిపాలనా విప్లవం..

నాడు జిల్లావ్యాప్తంగా గ్రామ సచివాలయ వ్యవస్థను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఏకంగా 649 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రజలకు లంచాలు, సిఫార్సులు లేని పాలనను అందించారు. ఆయా సచివాలయాల పరిధిలో స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తూ 6,490 మంది ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులను ఒకేసారి నియమించారు. ఇందులో అంతర్భాగంగా దాదాపు 15,000 మంది గ్రామ వలంటీర్లను నియమించి.. కులం, మతం, రాజకీయం చూడకుండా అరులందరికీ ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలను ఠంచన్‌గా అందించారు. అలాగే పేదలకు స్థానికంగానే అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు జిల్లావ్యాప్తంగా 438 విలేజ్‌ క్లినిక్‌లను, నగరాల్లో 32 అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లను అత్యాధునిక వసతులతో నిర్మించారు.

ప్రతి వర్గానికి సంక్షేమ హారతి

నాడు చేనేత కార్మికుల ఇబ్బందులను గమనించి వైఎస్సార్‌ నేతన్న నేస్తం ద్వారా సొంత మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా ఇరవై నాలుగు వేల రూపాయల చొప్పున అందించి ఆర్థికంగా నిలబెట్టారు. అన్నదాతలకు పెట్టుబడి సాయంగా వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఏడాదికి పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున అందజేసి తోడుగా నిలిచారు. జీవనోపాధి కోసం నిత్యం ఇక్కట్లు పడే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు వైఎస్సార్‌ వాహనమిత్ర ద్వారా ఏటా పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. అలాగే నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్ల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఏటా పది వేల రూపాయల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేసి జగన్‌ సర్కార్‌ అండగా నిలిచింది.

అర్హతేప్రామాణికంగా జగనన్న ప్రస్థానం!

పిల్లల చదువుల కోసం పేద తల్లులు అప్పులపాలు కాకూడదనే ఉద్దేశంతో జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా పదిహేను వేల రూపాయలు అందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు ఇబ్బంది లేకుండా వైఎస్సార్‌ పెళ్లి కానుకను ప్రవేశపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అర్హులైన పేద మహిళలకు సొంత ఇంటి స్థలాలు, పక్కా గృహాలను మంజూరు చేశారు. గ్రామీణులకు విద్య, వైద్యం, జీవనోపాధి మెరుగుపరుచుకునేందుకు కావాల్సిన ఆర్థిక చేయూత.. రాజకీయాలతో నిమిత్తం లేకుండా అర్హతే ప్రామాణికంగా పేదల చెంతకు చేరింది. నాడు నిజమైన గ్రామ స్వరాజ్యం పరిడవిల్లిందని సామాజిక విశ్లేషకులు, మేధావులు ఈ సందర్భంగా బలంగా కొనియాడుతున్నారు.

వెయ్యడుగుల

మువ్వన్నెల జెండా!

అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లె పట్టణ ప్రజలు ముందస్తు స్వాతంత్య్ర వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. రాజకీయ పార్టీల నేతలు, పట్టణ ప్రముఖులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజలు, ప్రజా సంఘాల ప్రతినిధులు భాగస్వాములై వెయ్యి అడుగుల పొడవైన తిరంగా పతాకాన్ని చేతబట్టి నడిచారు. విద్యార్థులు అశ్వాలపై మువ్వన్నెల జెండాతో ముందుకు నడుస్తుంటే.. వారి వెంట జనం ప్రదర్శనగా వెళ్లారు. స్థానిక టిప్పు సుల్తాన్‌ మైదానం నుంచి ప్రారంభమైన తిరంగా ప్రదర్శన.. జాతి సమైక్యత నినాదాలతో మేళ తాళాలు, వివిధ రకాల వాయిద్యాల నడుమ పండగ వాతావరణంలో జరిగింది. అలాగే, హర్‌ ఘర్‌ తిరంగాను పురస్కరించుకుని గురువారం కడప గాంధీనగర్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు 1,000 అడుగుల భారీ జాతీయ జెండాతో ఎర్రముక్కపల్లి సర్కిల్‌ వరకు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్‌ వాండ్రాసి పెంచలయ్య పాల్గొన్నారు.

– సాక్షి, మదనపల్లె/కడప ఎడ్యుకేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement